బాబు అతితెలివిని బిజెపి సహిస్తుందా?

చంద్రబాబునాయుడు ఒకవైపు తన రాజకీయ భవిష్యత్తు (?!) కోసం భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు కొనసాగించడానికే అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. భాజపా తమకు ఎన్నడూ వైరం లేదని, ప్రత్యేకహోదా కోసం మాత్రమే వారి కూటమిలోంచి బయటకు…

చంద్రబాబునాయుడు ఒకవైపు తన రాజకీయ భవిష్యత్తు (?!) కోసం భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు కొనసాగించడానికే అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. భాజపా తమకు ఎన్నడూ వైరం లేదని, ప్రత్యేకహోదా కోసం మాత్రమే వారి కూటమిలోంచి బయటకు వచ్చానని చెబుతూ.. తన త్యాగశీలత గురించి ఇటీవలి కాలంలో కూడా ఆయన సొంత డప్పు కొట్టుకున్న వైనం అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఒకవైపు భాజపాను కూడా చంద్రబాబు పల్లకీ మోయించడానికి ఒప్పించి తీసుకువస్తానని పవన్ కల్యాణ్ పలుకుతున్న ప్రగల్భాల మీద కూడా ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాయకుడికి దింపుడుకళ్లెం ఆశలున్నాయి. అయితే అదే సమయంలో.. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పార్టీలకు దగ్గర కావడానికి కూడా చంద్రబాబు లోపాయికారీ మంత్రాంగం నడుపుతున్నారా? అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.

241 కోట్ల రూపాయలు స్వాహా చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబునాయుడు ప్రస్తుతం అరెస్టు అయి రిమాండులో జైలు జీవితం గడుపుతున్నారు. ఈ అరెస్టును వాడుకుని ఆయన తన దేశంలోని పార్టీల్లో తన ప్రతిష్ఠ పెంచుకోవాలని, రాష్ట్రలోని ప్రజల్లో జాలి సానుభూతి పెంచుకోవాలని.. కుయుక్తులు పన్నుతున్నారు. ఆయన అరెస్టు పట్ల రాష్ట్రమంతా భోరుబోరున విలపిస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ.. పచ్చమీడియా మొత్తం గగ్గోలు పెడుతున్న సంగతి అందరికీ తెలుసు. అదే సమయంలో.. దేశంలోని భాజపాయేతర పార్టీలన్నింటినుంచి కూడా సాంత్వన వచనాలు పొందడానికి బాబు టీమ్ ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలుగుదేశం నాయకులు సంప్రదించిన మీదటనే పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీగానీ, యూపీలో అఖిలేష్ యాదవ్ గానీ.. చంద్రబాబు అనుకూల ప్రకటనలు చేశారు. మొన్నటి దాకా తెలుగుదేశం నాయకులు పట్టించుకోలేదు గానీ.. తాజాగా ఎన్డీయే కూటమినుంచి బయటకు వచ్చిన తర్వాత.. అన్నా డీఎంకే సారథి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ని ప్రత్యేకంగా వెళ్లి కలిసి చంద్రబాబునాయుడుకు మద్దతు తెలియజేయాల్సిందిగా కోరడం విశేషం. 

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన పళనిస్వామిని తెలుగుదేశం నేతలు వెళ్లి కలిసి విన్నపాలు చేయడం గమనించాల్సిన సంగతి. చంద్రబాబునాయుడు ఒకవైపు బాజపాతో బంధానికి అర్రులు చాస్తున్నట్టు బిల్డప్ ఇస్తూనే. తన అనుచరులు, తన వర్గం వారితో.. భాజపాను వ్యతిరేకిస్తున్న పార్టీలతో సత్సంబధాలకోసం వెంపర్లాడుతున్నారని.. విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇలాంటి అతి తెలివితేటల వల్లనే చంద్రబాబునాయుడుకు విభజన సమయంలో తల బొప్పి కట్టింది. తెలంగాణలో పార్టీ అంతర్ధానం అయిపోయింది. ఇప్పుడు ఇదేమాదిరి అతి తెలివిని మళ్లీ ప్రదర్శిస్తే.. ఏపీలో కూడా అదే పరిస్థితి తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

అటు బిజెపి సానుభూతి కోసమూ, అదే సమయంలో బిజెపిని తిట్టేవారి స్నేహం కోసమూ పడే తపన దెబ్బ కొడుతుందని అంచనా వేస్తున్నారు.