మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి అంశాన్ని రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవాలనే ఆలోచన ఉన్న నాయకుడు. కాదేదీ కవితకు అనర్హమని మహాకవి శ్రీశ్రీ అన్న మాటల్ని చంద్రబాబు రాజకీయాలకు అప్లై చేయడంతో పాటు ఆచరించిన మహా నాయకుడు.
అలిపిరిలో నక్సలైట్ల మందుపాతర్ల నుంచి చంద్రబాబునాయుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అలిపిరి ఘటనలో తీవ్రంగా గాయపడిన చంద్రబాబు …ఒళ్లంతా గాయాలపాలై, కట్టు కట్టించుకుని నిత్యం పరామర్శల పేరుతో రాజకీయాన్ని రక్తి కట్టించారు.
చంద్రబాబుపై సానుభూతి వెల్లువెత్తుతున్నట్టు తన ఎల్లో మీడియా ద్వారా పాజిటివ్ వేవ్‌ను క్రియేట్ చేసేందుకు యత్నించారు. అలిపిరిలో ప్రాణాపాయం నుంచి బయట పడిన తనపై ప్రజల్లో విపరీతమైన సానుభూతి ఏర్పడిందని, రాజకీయంగా సొమ్ము చేసుకోడానికి ఇదే సరైన సమయమని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు.
ఇందులో భాగంగా 9 నెలల ముందే ఎన్నికలకు వెళ్లారు. పోతూపోతూ తనతో పాటు వాజ్‌పేయ్ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వచ్చేలా బాబు చక్రం తిప్పారు. అయితే బాబు అనుకున్నదొకటి, అయ్యిందొకటి. 2004 ఎన్నికల్లో వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. టీడీపీ-బీజేపీ కూటమి ఘోర ఓటమిని మూటకట్టుకుంది. బాబుపై నక్సలైట్లు హత్యాయత్నం చేసినా సానుభూతి రాలేదు.
చంద్రబాబు ఎప్పుడూ సానుభూతి కోసమే ప్రయత్నిస్తుంటారు. తన భార్య భువనేశ్వరిని వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడారని మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చారు. భువనేశ్వరిని అవమానించిన అసెంబ్లీని కౌరవ సభతో పోల్చి, బాబు బహిష్కరించారు. తిరిగి సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత బహిరంగ సభల్లో తన భార్యను అవమానించారంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. తన జీవిత భాగస్వామికి సంబంధించి సున్నితమైన అంశాన్ని కూడా ఆయన ప్రజల మధ్యకు తీసుకొచ్చి… అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా బలిపెడతారనే అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు.
ప్రస్తుతానికి వస్తే స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఈ నెల 29 నుంచి బాబు జనంలోకి వెళ్లేందుకు న్యాయస్థానం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. నంద్యాలలో అరెస్ట్, రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడం, అక్కడ సౌకర్యాలు కల్పించడంలో వివక్ష చూపారని, చంపాలని ప్రయత్నించారని… ఇలాంటి ఆరోపణలను చేయడానికి చంద్రబాబు వెనుకాడరనే చర్చకు తెరలేచింది.
చంద్రబాబు రాజకీయ ప్రస్థానం అంతా, ప్రత్యర్థులను బద్నాం చేయడంపైనే నడించింది. చివరికి రాజకీయ భవిష్యత్‌తో పాటు పిల్లనిచ్చిన మామను కూడా చంద్రబాబు విడిచి పెట్టకపోవడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి 73 ఏళ్ల వయసులో ఉన్న తనను అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనే చంద్రబాబు కన్నీళ్లపై జనం రియాక్షన్ ఎలా వుంటుందనేది ఆసక్తిని కలిగించే అంశం.