పొత్తాటః ప‌వ‌న్‌కు గుణ‌పాఠం!

రాజ‌కీయాల్లో పొత్తులు కుదుర్చుకోవ‌డం సులువు. వేర్వేరు రాజ‌కీయ పార్టీలు క్షేత్ర‌స్థాయిలో క‌లిసి ప‌ని చేయ‌డం ఆషామాషీకాదు. ఈ విష‌యం అనేక సంద‌ర్భాల్లో రుజువైంది. తెలంగాణ‌లో కాంగ్రెస్‌, వామ‌ప‌క్ష పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. అయితే…

రాజ‌కీయాల్లో పొత్తులు కుదుర్చుకోవ‌డం సులువు. వేర్వేరు రాజ‌కీయ పార్టీలు క్షేత్ర‌స్థాయిలో క‌లిసి ప‌ని చేయ‌డం ఆషామాషీకాదు. ఈ విష‌యం అనేక సంద‌ర్భాల్లో రుజువైంది. తెలంగాణ‌లో కాంగ్రెస్‌, వామ‌ప‌క్ష పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. అయితే సీట్ల పంపిణీకి వ‌చ్చే స‌రికి ఏకాభిప్రాయం కుద‌ర‌డం లేదు. సీపీఐ, సీపీఎంల‌కు చెరో రెండు అసెంబ్లీ స్థానాల‌ను కేటాయించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. అయితే వామ‌ప‌క్షాలు అడుగుతున్న సీట్ల‌ను ఇవ్వ‌డానికి కాంగ్రెస్ స‌సేమిరా అంటోంది.

మ‌రోవైపు నామినేష‌న్ల గ‌డువు ముంచుకొస్తోంది. ఇంత వ‌ర‌కూ ఏ నియోజ‌క‌వ‌ర్గాలిస్తారో ఫైన‌ల్ చేయ‌క‌పోతే …ఇక ప్ర‌చారం ఎప్పుడు చేసుకోవాలి? గెలుపొందడం ఈజీ అవుతుందా? అని వామ‌ప‌క్ష పార్టీలు నిల‌దీస్తున్నాయి. దీంతో ఒకట్రెండు రోజుల్లో తేల్చ‌క‌పోతే బ‌రిలో దిగుతామ‌ని వామ‌ప‌క్ష పార్టీలు హెచ్చ‌రించాయి. మ‌రోవైపు వామ‌ప‌క్షాల వార్నింగ్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే గురువారం స్పందించారు.

వామ‌ప‌క్షాల‌తో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పొత్తు వుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. వామ‌ప‌క్షాల‌తో పొత్తుపై చ‌ర్చించే బాధ్య‌త‌ల్ని సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌కు అప్ప‌గించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. పొత్తు వ‌ద్ద‌ని వెళ్లాల‌ని అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ కుద‌ర‌ద‌ని అంటోంది. అలాగ‌ని కోరుకున్న సీట్ల‌ను ఇచ్చేందుకు స‌సేమిరా అంటోంది. తెలంగాణ‌లో పొత్తాట నుంచి జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ గుణ‌పాఠం నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ఏపీలో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు కుదిరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్ని సీట్లు, ఎక్క‌డెక్క‌డ ఇస్తార‌నే విష‌య‌మై ఆ రెండు పార్టీల మ‌ధ్య స్ప‌ష్ట‌త లేదు. చంద్ర‌బాబునాయుడి నైజం తెలిసిన వారెవ‌రైనా … నామినేష‌న్ల ముగింపు వ‌ర‌కూ తేల్చి చెప్ప‌ర‌ని అనేక ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. 2014లో టీడీపీకి ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చారు. అంతే త‌ప్ప‌, సీట్ల స‌ర్దుబాటు చేసుకోవాల్సిన అవ‌స‌రం లేక‌పోయింది.

2024 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి నాటి ప‌రిస్థితులు లేవు. ఇప్పుడు సీట్ల‌లోనూ, రేపు అధికారంలోనూ వాటా కావాల‌ని జ‌న‌సేనాని డిమాండ్ చేస్తున్నారు. దీంతో టీడీపీ కొన్ని సీట్ల‌ను త్యాగం చేయాల్సి వుంటుంది. 10 లేదా 15 ఎమ్మెల్యే , రెండు లోక్‌స‌భ సీట్ల వ‌ర‌కైతే జ‌న‌సేన‌కు ఇవ్వ‌డానికి టీడీపీ ఇబ్బంది ప‌డ‌దు. అంత‌కు మించి డిమాండ్ చేస్తేనే స‌మ‌స్య‌. క‌నీసం 40 అసెంబ్లీ, 4 లోక్‌స‌భ స్థానాలు ఇస్తేనే జ‌న‌సేన‌కు గౌర‌వం ద‌క్కుతుంద‌ని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ నుంచి గ‌రిష్టంగా ల‌బ్ధి పొంద‌డానికే టీడీపీ ప్ర‌య‌త్నిస్తుంది. అంతే త‌ప్ప‌, ప‌వ‌న్ కోసం టీడీపీ త్యాగం చేసే ప‌రిస్థితి ఉత్ప‌న్నం కాదు.

సీట్ల పంపిణీ ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి రాజ‌కీయం ఏ మ‌లుపు తిరుగుతుందో ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాల మ‌ధ్య సాగుతున్న ఆట‌ను ప‌వ‌న్ చూసి తెలుసుకోవాల‌ని నెటిజ‌న్లు హిత‌వు చెబుతున్నారు. రేపు ఆంధ్రా ఎన్నిక‌ల్లోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉత్ప‌న్నం అవుతుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.