తమకు గిట్టుబాటు కాని చోట ప్రభుత్వాలను కూల్చడం, తమ రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ-ఈడీలను ఉసిగొల్పడం, ప్రభుత్వాలను బలహీన పరచడం, తిరుగుబాటు గుంపులకు పెద్దపీట వేసి తమ పని పూర్తి చేసుకోవడం.. దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.
ఇందిరాగాంధీ హయాం నుంచినే ఇలాంటి వ్యవహారాలు మొదలయ్యాయని దేశ రాజకీయ చరిత్ర చెబుతూ ఉంది. ఆమె కోడలు సోనియాగాంధీ చేతికి పగ్గాలు అందాకా.. ప్రభుత్వాలను కూల్చడం అంత చేత కాలేదు కానీ సీబీఐ, ఈడీలను ఉసిగొల్పి రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టించి, వారికి జైలు జీవితాన్ని చవిచూపడం.. ఈ తరహా రాజకీయాలు అయితే చాలానే చేశారు సోనియాగాంధీ. ఆమే చేశారా.. ఆమె ముఖ్య అనుచరగణం ఇలాంటి పనులకు సలహాలను ఇచ్చి, సీబీఐ- ఈడీ వంటి వ్యవస్థలను భ్రష్టు పట్టించిందా అనేది మరో చర్చ.
ఆ సంగతలా ఉంటే.. అచ్చంగా కాంగ్రెస్ చూపిన తోవలో కొనసాగుతూ ఉంది భారతీయ జనతా పార్టీ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ ఆరు దశాబ్దాల్లో ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందనే లెక్క కన్నా.. ఎనిమిదేళ్లలో భారతీయ జనతా పార్టీ కూల్చిన ప్రభుత్వాల సంఖ్య వేగంగా పెరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాలను, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాలను బీజేపీ వాళ్లు సునాయాసంగా కూల్చగలుగుతున్నారు. ఈ సంఖ్య కొనసాగుతూ ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన కమలం పార్టీ ఈ ప్రక్రియను కొనసాగిస్తూ ఉంది. వివిధ రాష్ట్రాల్లో బీజేపీ టార్గెట్ లో ప్రభుత్వాలున్నాయి. వాటిని కూడా రేపోమాపో కూల్చడం గురించి కమలం పార్టీ కసరత్తు సాగిస్తోందనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తూ ఉన్నాయి.
ఇక కాంగ్రెస్ అధినేత్రిగా సోనియాగాంధీ చూపిన తోవను కూడా కమలం పార్టీ ఫాలో అవుతూ ఉంది. అదే సీబీఐ, ఈడీలను ఉసిగొల్పడం. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ- ఈడీ కేసులు నమోదయ్యాయి. వీటిని అవసరానికి అనుగుణంగా వాడుతోంది కేంద్ర ప్రభుత్వం అనే విమర్శలు రానే వస్తున్నాయి. తాము బెదిరించాలనుకుంటున్న పార్టీల పై ఈ అస్త్రాలను ఎక్కు పెడుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులంటూ పెడితే సదరు రాజకీయ నేతల జుట్టును కేంద్రంలో ఉన్న వారు చిక్కించుకుంటున్నట్టే అన్నట్టుగా తయారైంది పరిస్థితి.
మహారాష్ట్రలో శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ ల ప్రభుత్వం కూలిపోయిన వెంటనే శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్ పై కేసు లేచొచ్చింది. ఆయనను అరెస్టు చేశారు. రౌత్ పై అంతకు ముందు లేని కేసులన్నీ ఈ మధ్యకాలంలోనే మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వంతు కూడా వచ్చింది. ఉద్ధవ్ పై అక్రమాస్తుల కేసులు పెట్టాలంటూ, సీబీఐ- ఈడీల విచారణకు ఆదేశించాలంటూ ఒక పిటిషన్ కోర్టుకు చేరింది.
ఈ వ్యవహారంలో పిటిషనర్ల ఇంట్రస్టు, వారి దగ్గర ఉన్న సమాచారం ఏ స్థాయిది అయినప్పటికీ.. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్కారుకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై ఇప్పుడు సీబీఐ-ఈడీ కేసులు నమోదు కావడం ఏ మాత్రం కష్టం కాదు. మరి ఇప్పుడు ఉద్ధవ్ పై ఇలాంటి విచారణలు మొదలైతే.. బీజేపీవి కక్ష సాధింపు చర్యలు అనే విమర్శలు తీవ్రం అవుతాయి.
ఎందుకంటే.. దశాబ్దాలుగా శివసేన- బీజేపీలు దోస్తీ చేశాయి. సన్నిహితంగా మెలిగాయి. కేవలం రెండున్నరేళ్ల సమయం మాత్రమే ఈ రెండు పక్షాలూ వైరి అయ్యాయి. ఒకవేళ ఉద్ధవ్ ఠాక్రే పై అక్రమాస్తుల విచారణ మొదలైతే.. ఆయన బీజేపీతో దోస్తీ చేసినప్పుడు కూడా అవినీతి పరుడు అయినట్టే అని జనం అనుకోవాల్సి ఉంటుంది.