కేఏ పాల్ చేస్తున్న డ్యాన్సులు , కాంగ్రెస్ నేతల అలకలు, టీఆర్ఎస్ -బీజేపీ నేతల మాటల యుద్ధాలు.. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ అంశాలివి! ఓవరాల్ గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఏపీ రాజకీయమే ఇలాంటి రసవత్తర స్థాయిలో ఉంటుంది. ఉప ఎన్నికలు అయినా.. మాటల యుద్ధంలో అయినా.. ట్రోలింగ్ లు ఇతర వ్యవహారాల్లో అయినా ఏపీ రాజకీయమే సోషల్ మీడియాను లీడ్ చేస్తూ ఉంటుంది. అయితే తెలంగాణలోని ఒక ఉప ఎన్నిక ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ట్రెండింగ్ సబ్జెక్ట్ గా మారింది.
మొన్నటి వరకూ మునుగోడు అంటే.. అదే ఏ జిల్లాలో ఉంటుందో చెప్పమంటే నూటికి పది మంది కూడా చెప్పగలిగేవారు కాదేమో! అయితే ఉప ఎన్నిక దెబ్బకు మునుగోడు ముచ్చట గురించి సామాన్యులు కూడా ఒక రేంజ్ లో ఉపన్యసిస్తున్నారు. మునుగోడు కథేంటి, అక్కడ ఏ కులం జనాభా ఎంత, ఇప్పుడు అక్కడ ఏ పార్టీకి అనుకూలత ఉంది, ఏం జరిగితే ఎవరు గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎటు పడే అవకాశం ఉంది, టీఆర్ఎస్ కు వ్యతిరేకత ఉందా లేదా.. అనే అంశాల గురించి తెలుగు వాళ్లు తెగ మాట్లాడేసుకుంటూ ఉన్నారు. ఎవరు గెలుస్తారో? అంటే.. మాత్రం! పోటాపోటీ అంటూ సణుగుతున్నారు ఈ విశ్లేషకులంతా!
ఏతావాతా.. మునుగోడు ఉప ఎన్నిక కల్ట్ గా మారింది. ఇక బెట్టింగులు పతాక స్థాయికి చేరడమే మిగిలింది. రాజకీయంగా ఎవరికీ అనుకూలత ఉందో తెలుసుకునే ప్రయత్నాలే ఇంకా జరుగుతున్నాయి. బెట్టింగులు భారీ ఎత్తున ఒకరి మీదే పడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. 50-50 ఛాన్సులు అనే మాట గట్టిగా వినిపిస్తూ ఉండటంతో బెట్టింగు రాయుళ్లు ఇంకా పూర్తి స్థాయిలో ఉత్సాహం చూపించడం లేదు. పరిస్థితి మరీ ఫ్లూయిడ్ లా ఉంది. దీంతో పందేలు వేసే వాళ్లు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరి మీద బెట్ వేసినా.. అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సుల్లాగానే ఉంది.
ఇక సోషల్ మీడియాను అయితే మునుగోడు ఉప ఎన్నిక ఊపేస్తోంది. ట్రోల్స్ అయితే ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ వర్గాలు.. పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకుంటున్నాయి. ఈ వ్యంగ్యానికి ప్రధాన అస్త్రాలు ఆయా పార్టీల నేతల మాటలే! టీఆర్ఎస్ నేతల ప్రసంగాలను, వారి హావభావాలనూ బీజేపీ ట్రోల్ పేజీలు వాడుకుంటున్నాయి. బీజేపీ నేతల ప్రచారాన్ని టీఆర్ఎస్ వాళ్లు వైరల్ చేస్తూ ఉన్నారు. నేతల ప్రసంగాల వీడియోలను కట్ చేసి..వాటిని ట్విస్ట్ చేసే తరహాలో ట్రోల్ వీడియోలను పోస్టు చేస్తున్నారు ఆయా పార్టీల అభిమానులు. ఆ మాటలు వింటే.. వాటిని కట్ చేసిన తీరు చూస్తే.. ఆ నేతలు తమ మీద తాము సెటైర్ వేసుకున్నట్టుగా లేదా, తమ ప్రత్యర్థిని పొగిడినట్టుగా ఉంటుంది. ఇలాంటి వీడియోలను వైరల్ చేయడంలో పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే ఈ పోటీ ఉంది. ఆ తరహా పోటీ లో కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకపడిపోయింది! సోషల్ వార్ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య ఉంది. కాంగ్రెస్ ఈ ఊసులో లేదు.
ఏదేతేనేం.. మునుగోడు ఉప ఎన్నిక మాత్రం ప్రజలకు పూర్తి స్థాయిలో వినోదాన్ని అందిస్తోంది. సోషల్ మీడియాను చూసినా, టీవీ చానళ్లను వీక్షించినా.. ఈ వినోదాలు ప్రజలకు కావాల్సినంత టైం పాస్ ను ఇస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక వినోదమే అనుకుంటే… మరో వైపు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ టీఆర్ఎస్, బీజేపీల మధ్యన మరో రచ్చ రేగింది. ఉప ఎన్నిక వినోదానికి అది కొనసాగింపు అనుకోవాలి. అంతిమంగా మునుగోడు ఉప ఎన్నిక అటు టీఆర్ఎస్ కు, ఇటు బీజేపీకి తీవ్ర ప్రతిష్టాత్మకమైన అంశంగా మారింది. ఈ ప్రతిష్ట కోసం ఇరు పార్టీలూ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయనే విశ్లేషణ వినిపిస్తూ ఉంది.
పార్టీలన్నీ మునుగోడులో పోటాపోటీగా ఖర్చు పెడుతున్నాయని.. ఓటుకు ఇరవై వేల రూపాయలు అయినా ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయని, ప్రచార పర్వంలో పార్టీల ఖర్చు కూడా పతాక స్థాయిలో ఉందని.. క్షేత్ర స్థాయి నుంచి సమాచారం వస్తూనే ఉంది. మునుగోడు జనాల్లో.. కూలీనాలీ చేసుకునే వారు కూడా పనులు చేయడం మానేశారని, ఉదయం లేస్తే.. పార్టీలే రోజువారీ కూలికి పిలుస్తున్నాయని, పగలంతా ఎన్నికల ప్రచారం అంటూ తిరిగితే.. ఐదారు వందల రూపాయలు చేతికందుతున్నాయట. అంతే కాదు.. ఆ పై బీరు, బిర్యానీ అదనం. ఇలా తినడానికి నాన్ వెజ్ మీల్స్, తాగినంత మద్యం, ఆ పై ఐదారు వందల రూపాయలకు వస్తున్నప్పుడు కూలీనాలి చేసుకోవడం కన్నా.. ఇదే మేలనే భావన స్థానికుల్లో ఉండటం పెద్ద వింత కాదు. అయితే ఎటొచ్చీ ఉప ఎన్నిక పోలింగ్ అయ్యేంత వరకే ఇదంతా. ఆ తర్వాత రాజకీయ నేతలు వీరికి మొహం చాటేస్తారు. ఇదే మునుగోడు ఓటరు అసలు బాధ కావొచ్చు. మునుగోడులో ఈ ధన ప్రవాహాన్ని చూసి.. మిగతా నియోజకవర్గాల ప్రజలు కూడా తమ నియోజకవర్గానికీ ఆ తరహాలో ఉప ఎన్నిక వస్తే మేలని అనుకోవడం కూడా పెద్ద వింత కాదు.
ఎటొచ్చీ.. ఒక ఉప ఎన్నికలో కోట్ల రూపాయల ధన ప్రవాహం జరుగుతోందని, అన్ని పార్టీలూ కలిసి ఓటుకు ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చుపెట్టే పరిస్థితి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తుంటే.. ఇంతకీ ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది అనే సందేహం రావొచ్చు. అయితే వీటన్నింటినీ పట్టించుకునేంత తీరిక ఈసీకి ఉంటుందా! ఇవన్నీ ఉత్తుత్తి ప్రచారాలే, మునుగోడులో పార్టీలన్నీ చాలా ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకుంటున్నాయని ఈసీ గట్టిగా భావిస్తుండవచ్చు!