2014-19 ల మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చొక్కాలు చించుకున్న వాళ్లు, ఆ సమయంలో, గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీరవిహారం చేసిన వారు 2019 ఎన్నికల ఫలితాలతో తమ పంతం నెరవేరిందని సంతోషించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయడం వెనుక వారి స్వార్థమో, అభిమానమో ఏదో ఒకటి ప్రధాన కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే.. తాము దర్పం చలాయించవచ్చని ఆశించి ఉండవచ్చు. లేదా వీలైనంతగా సంపాదించుకోవచ్చనే లెక్కలూ వేసి ఉండవచ్చు. జన్మభూమి కమిటీలు రాజ్యం చలాయిస్తున్న తరుణంలో ఆ పరిస్థితులను చూసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము కూడా జన్మభూమి కమిటీలకు ధీటుగా తాము కూడా సంపాదించుకోవచ్చని ఆశించిన వారూ ఉన్నారు. పార్టీకి అధికారం దక్కగానే తామకు కీలక పదవులు దక్కుతాయనుకుని లెక్కలేసిన వారూ ఉన్నారు! కులాధిపత్యమో, ముఠాధిపత్యమో, స్థానికంగా పలుకుబడో, ప్రభుత్వాఫీసుల్లో పనులో, అయిన కాడికి సంపాదించుకోవడమో, కాంట్రాక్టులు పొందడమో.. ఇలాంటి లెక్కలతోనే ఎవరైనా రాజకీయంలో తిరుగుతారు. ఏ లాబీయింగో చేసుకోవచ్చనీ ఆశిస్తారు. మరి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయాయి. మరో రెండేళ్లలోపే ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో.. సరిగ్గా 2014-19ల మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షేత్ర స్థాయిలో ఉత్సాహంగా పని చేసిన వారు, సోషల్ మీడియాలో ఆ పార్టీ తరఫున మంచి హడావుడి చేసిన వారు ఇప్పుడు పూర్తిగా ఆ వ్యాపకాలకు దూరంగా ఉండటం గమనార్హం! ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విపరీతంగా హడావుడి చేసిన వారంతా ఇప్పుడు కిక్కురుమనడం లేదు. పార్టీపై అభిమానం ఉందా అంటే ఉందనే అంటున్నారు. మళ్లీ పార్టీకి ఓటేసే బ్యాచ్చే ఇదంతా. అయితే.. మునుపటి ఉత్సాహం మాత్రం లేదు!
అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిఎవరైనా తమ ఊరికి వస్తున్నారంటే వీరి హడావుడి మామూలుగా ఉండేది కాదు. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్నీ తమ ఊర్లలో గొప్పగా జరపడానికి ఉత్సాహం చూపించే వారు. ఇంటింటికీ పార్టీ కార్యక్రమాలను తీసుకెళ్లడం అయితేనేం.. వైఎస్ జయంతి, వర్దంతి కార్యక్రమాలు, జగన్ పుట్టిన రోజు కార్యక్రమం.. పార్టీ నిర్దేశించిన ప్రతి కార్యక్రమాన్నీ వీరు వైభవంగా జరిపేవారు. మంచిహడావుడి చేసే వారు. అయితే .. ఇప్పుడు మాత్రం ఆ హడావుడి లేదు!
సాధారణంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి కార్యక్రమాల హడావుడి ఎక్కువగా ఉంటుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం మాత్రం మునుపటిలా లేదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. మరి పార్టీలో అధికారంలో ఉండటంతో.. జరిగే కార్యక్రమాలు కొన్ని ఉండనే ఉంటాయి. వాటికైతే ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేలు, వారి ప్రధాన అనుచరులు మండల స్థాయి టౌన్లలో ఇలాంటి కార్యక్రమాలను విజయవంతంగా జరుపుతూ ఉంటారు. అలాగే నియోజకవర్గ స్థాయి పట్టణాల్లో కూడా హడావుడి ఉంటుంది.
అదే పల్లెలు, పంచాయతీల విషయానికి వస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్ అంత కనిపంచడం లేదు. ప్రత్యేకించి స్వచ్ఛందంగా జరిగే కార్యక్రమాల గురించే ఇక్కడ చర్చ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రస్తుతం గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. తమ ప్రభుత్వం చేసిన పనుల గురించి ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం ఉందని ప్రకటించుకుంటున్నారు. చెప్పినవి చేసినందుకే తమకు ఈ ధైర్యం ఉందని వారు అంటున్నారు. ఈ మేరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ నిలదీతలు ఉండనే ఉంటున్నాయి. ఇవి మరీ ఇబ్బంది ఏమీ కాదు. ఆ మాత్రం నిలదీసే అవకాశం ఉండనే ఉంటుంది. అవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేవే. ఎందుకంటే.. మరీ మాట మార్చి ఉంటే, కనీసం ప్రజల మధ్యకు వెళ్లే ధైర్యం కూడా ఉండేది కాదు. ఈ మాత్రం అయినా వెళ్తున్నారంటే మంచి సంగతే.
మరి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ మందీమార్బలంతో గడప గడపకూ కార్యక్రమానికి వెళ్తుండగా.. క్యాడర్ కొద్దో గొప్పో కదలి వస్తోంది. అయితే అదంతా నామమాత్రమైన హడావుడే. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ వీరాభిమానులు కూడా మొక్కుబడిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. 2019కి ముందు ఉన్న ఊపు, ఆ మూడ్, ఆ ఉత్సాహం, ఆ ఉత్తేజం మాత్రం క్యాడర్ లో లేదు. తాము ఆశించింది జరగకపోవడమో, తాము ఎక్స్ పెక్ట్ చేసింది దక్కకపోవడమో, మొత్తంగా తాము అనుకున్నట్టుగా లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ పరిస్థితికి కారణం ఏమిటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకూ, నియోజకవర్గ స్థాయి నేతలకే తెలిసి ఉండాలి.
2019కి ముందు తమ కోసం ఎవరు పని చేశారో వారికి బాగా తెలుసు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకూ వారు క్షేత్ర స్థాయిల్లో బాగా తిరిగారు. ఎవరు తమ వారో బాగా గుర్తుపట్టగలరు. అలాంటి వారంతా ఇప్పుడు ఏం చేస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాస్త పరికించి చూస్తే.. అసలు కథ అర్థం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు నాటి ఉత్సాహం ఎప్పుడు ఎందుకు లేదు, ఈ సైన్యం ఎందుకు నిస్తేజం అయ్యిందనే అంశం.. పూర్తిగా అర్థం కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కార్యకర్తలతో మమేకం కావడమే ముందున్న మార్గం. అయితే వారికి అంత తీరిక ఉందా? అనేదే శేష ప్రశ్న!