అగ్రరాజ్యం అమెరికాలోని బే ఏరియా తెలుగు అసోసియేషన్(బాటా) ఏర్పడి 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక సందర్బాన్ని పురస్కరించుకుని గోల్డెన్ జూబ్లీ వేడుకలను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అమెరికా సహా భారత్ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. అత్యంత శోభాయమానంగా జరిగిన కార్యక్రమంలో అనేక విశేషాలు చోటు చేసుకున్నాయి.
'బాటా' స్వర్ణోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలుగు చిత్రసీమలో మకుటంలేని మహారాజుగా విరాజిల్లుతున్న ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ హాజరయ్యారు.
ఇక, ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, చేతికి ఎముకలేని దాతగా పేర్గాంచిన డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డికి `దాతృత్వ సింధు`, జయరాం కోమటికి `ప్రవాస బంధు` బిరుదులు ప్రదానం చేశారు.
అదేవిధంగా తెలుగు భాషలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రచయిత, రేడియో వ్యాఖ్యత కిరణ్ ప్రభ పాల్గొన్నారు.
స్వర్ణోత్సవానికి 'బాటా'లోని పాత, ప్రస్తుత కమిటీ సభ్యులు సైతం హాజరయ్యారు. ఆహూతులకు షడ్రశోపేత విందును ఏర్పాటు చేశారు.
శాంతా క్లారా కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 'బాటా' 50 ఏళ్ల పండుగ… పండితుల వేద మంత్రాలతో శుభారంభమైంది. ఈ కార్యక్రమానికి 'బాటా' సభ్యులు, మద్దతు దారులు, ప్రోత్సాహకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తొలుత జ్యోతిని వెలిగించి ఈ వేడుకలను ప్రారంభించారు. ఎస్ఎఫ్ఓ భారత రాయబార కార్యాలయం దౌత్యవేత్త సీజీ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మేయర్ రిచ్ ట్రాన్, మిల్పిటాస్, కౌన్సిల్ సభ్యుడు రాజ్ సాల్వాన్, ఫ్రీమాంట్ అసెంబ్లీ సభ్యుడు యాష్ కల్రా, శాంటా క్లారా కౌంటీ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ సుసాన్ ఎలెన్‌బర్గ్, మేయర్ లిసా గిల్మోర్, సన్నీవేల్ సూపర్‌వైజర్ ఒట్టో లీ, శాంటా క్లారా కౌంటీ, అసెంబ్లీ ప్రతినిధిగా సభ్యులు అలెక్స్ లీ, సూపర్ వైజర్ సిండీ చావెజ్, శాంటా క్లారా కౌంటీ, శాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ జెఫ్ రోజెన్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా & కాంగ్రెస్ సభ్యుడు ఎరిక్ స్వాల్వెల్ అబినందనలు తెలిపారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నుంచి సతీష్ వేమూరి(కార్యదర్శి) హాజరై సంఘం తరఫున అబినందనలు తెలిపారు.
జానపద కోలాహలం!
ఆంద్రప్రదేశ్, తెలంగాణల నుంచి వచ్చిన జానపద నృత్య కళలను ప్రదర్శించారు. లంబాడీ, డప్పు, థింసా, గరగలు, బతుకమ్మ, కోలాటం, బోనాలు ప్రదర్శించారు.
ఇక, మరింతగా ఆకట్టుకున్న కార్యక్రమం మాయా మశ్చీంద్ర. విద్యుత్ కాంతులతో కూడిన డ్యాన్స్ షో అందరినీ అలరించింది.
కళ్యాణం కమనీయం:
తెలుగు సంప్రదాయ వివాహ క్రతువును ప్రదర్శించారు. అదేవిధంగా 100 మందికిపైగా చిన్నారులు డ్యాన్స్ డ్రామా ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
జబర్దస్త్!
అందరినీ గిలిగింతలు పెట్టే హాస్యభరిత కార్యక్రమం `జబర్దస్త్` అందరినీ ఆకట్టుకుంది. ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్ టీం ప్రదర్శించిన స్కిట్స్ అందరికీ కితకితలు పెట్టాయి.
ఇక, గాడ్ ఫాదర్ మూవీలోని `తార్ మార్ తక్కర్ మార్` పాటకు డ్యాన్స్ అలరించింది. సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్‌ను గర్తుకు తెచ్చేలా కార్యక్రమం నిర్వహించారు.
పౌరాణిక నాటకాల విషయానికి వస్తే.. `శ్రీకృష్ణ రాయబారం` పద్యనాటకాన్ని ప్రదర్శించారు. విజువల్ ఎఫెక్ట్ అందరినీ విస్మయానికి గురిచేసింది.
`వీణ ది ఎవరెస్ట్` పేరుతో నిర్వహించిన ఫణి నారాయణ బృందం నిర్వహించిన వీణ కచేరీ వీనుల విందు చేసింది.
జంతర్ మంతర్!
కామెడీ స్కిట్ అందరినీ మంత్రముగ్దులను చేసింది. సంగీతం, నృత్యం అందరినీ ఊహావిహారం చేయించింది.
ప్రముఖ యాంకర్, నటి అనసూయ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
అల అమెరికాపురం లో!
ప్రముఖ డ్రమ్మర్ శివమణితో సహా లైవ్ ఆర్కెస్ట్రాతో జాతీయ అవార్డు విజేత S.S.థమన్ చేసిన గ్రాండ్ ఫినాలే ఆహూతులను మైమరపింపజేసింది.
ఈ కార్యక్రమానికి వ్యాపార సంస్థల నుంచి భారీ మద్దతు లభించింది. ప్రోగ్రాం అసోసియేట్ స్పాన్సర్ “మోక్ష జ్యువెలర్స్”, “పవర్డ్ బై ”రియల్టర్ నాగరాజ్ అన్నయ్య” సహ ఆధారితం “ఫార్మ్ టెక్నాలజీ”
ఐటీ ఫోరమ్ ఆధ్వర్యంలో `ఎమెర్జెంగ్ మార్కెట్స్ అండ్ ట్రెండ్స్` అనే అంశంపై జేపీ వేజెండ్ల, కరుణ్ వెలిగేటి నేతృత్వంలో ప్యానల్ డిస్కషన్ జరిగింది.
సీతా భరతల నేతృత్వంలో మహిళా సంఘం `రైజ్ ఆఫ్ ఉమెన్.. యాజ్ దే ఫిట్` అనే అంశంపై చర్చ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ అనసూయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలుగు పద్యాలు కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
అదేవిధంగా చిన్నారులకు ఏకపాత్రాభినయం, ఫ్యాన్సీ డ్రస్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి యెర్నేని, పద్మ శొంఠి, సునీత రాయపనేని సహకారం అందించారు.
“సాహితీ బాట” కార్యక్రమం!
ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ కె. గీతామాధవి కన్వీనర్ గా, కిరణ్ ప్రభ గౌరవ సలహాదారుగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి, ప్రముఖ వైద్యులు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత వేమూరి వెంకటేశ్వరరావు `సాహితీ జీవన సాఫల్య` పురస్కారాన్ని అందుకున్నారు.
డాక్టర్ మేడసాని మోహన్ అష్టావధానంలో.. పాలడుగు శ్రీచరణ్ సంచాలకత్వం వహించారు.
చివరగా మృత్యుంజయుడు తాటిపాముల అధ్యక్షతలో జరిగిన కథాచర్చలో `మంచి కథ రాయడం ఎలా?` అనే అంశాలపై విస్తృతమైన చర్చ నిర్వహించారు.
సారాంశం!
'బాటా' స్వర్ణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమం బే ఏరియా తెలుగు సంఘం విజయాల కిరీటంలో మరో కలికితురాయిగా నిలిచింది. సభ్యులందరి మద్దతుతో 'బాటా' (BATA) బృందం ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించింది. ఇదే ఉత్సాహంతో ఈ సంస్థను రాబోయే సంవత్సరాల్లో ముందుకు నడిపించేందుకు ఈ కార్యక్రమం మరింత బలాన్ని, విశ్వాసాన్ని ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు!!