30 యేళ్ల‌లోపు అర్థం చేసుకోవాల్సిన వాస్త‌వాలు!

20 దాట‌గానే త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డే వారికి జీవితంలో చాలా విష‌యాలు తేలిక‌గా అర్థం అవుతాయి! మ‌నుషులు, మ‌న‌స్త‌త్వాలు, స‌మ‌యం, డ‌బ్బు, నిజాలు, అబ‌ద్దాలు.. వీట‌న్నింటి గురించి ఇంటి నుంచి బ‌య‌ట‌కు…

20 దాట‌గానే త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డే వారికి జీవితంలో చాలా విష‌యాలు తేలిక‌గా అర్థం అవుతాయి! మ‌నుషులు, మ‌న‌స్త‌త్వాలు, స‌మ‌యం, డ‌బ్బు, నిజాలు, అబ‌ద్దాలు.. వీట‌న్నింటి గురించి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాకే బాగా అర్థం అవుతాయి! అంత వ‌ర‌కూ వీటి గురించి ఎంతో కొంత తెలిసి ఉండ‌వ‌చ్చు. అయితే జీవితంలో స్వానుభ‌వం నుంచి అర్థం చేసుకోవ‌డం అనేది తెలుసుకోవ‌డం క‌న్నా చాలా కీల‌క‌మైన‌ది! అయితే కొంద‌రు సిల్వ‌ర్ స్పూన్ తో పుట్టి ఉంటారు. మ‌రి కొంద‌రికి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం కూడా రాదు! అమాయ‌క‌త్వమో, అజ్ఞాన‌మో! ఇలాంటి వారు చిన్న చిన్న విష‌యాల‌కు కూడా చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోతూ ఉంటారు. అయితే 30లోపు.. అంటే 20ల‌లో ఉండ‌గానే జీవితంలో స్వ‌త‌హాగా అర్థం చేసుకోవాల్సిన వాస్త‌వాలు కొన్ని ఉంటాయి. వాటిని అర్థం చేసుకున్న వాళ్ల జీవితం చాలా సాఫీగా ఉంటుంది కూడా!

జీవితం ఎప్పుడూ ఒక‌లా ఉండ‌దు!

మీరు చ‌దువుల్లో గొప్ప విద్యార్థి అయి ఉండొచ్చు. అలాగ‌ని అన్నింట్లోనూ మీరు పాజిటివ్ రిజ‌ల్ట్స్ నే పొంద‌లేరు అనేది అర్థం చేసుకోవాల్సిన చ‌దువు! జీవితం ఎప్పుడూ ఫెయిర్ గా సాగిపోదు, ఎత్తుప‌ల్లాలు ఉంటాయి. ఎవ‌డో ఒక‌డు క‌ఠినంగా మాట్లాడ‌తాడు, రూడ్ గా బిహేవ్ చేస్తాడు. అలాంటి సంద‌ర్భాల‌ను మాన‌సికంగా ఎదుర్కొన‌డానికి కూడా సిద్ధంగా ఉండాలి! అంద‌రూ మిమ్మ‌ల్ని మీ తల్లిదండ్రుల్లాగా, బంధువుల్లా, మీ టీచ‌ర్స్ లా ట్రీట్ చేయ‌రు! మీ వ‌య‌సు, మీ అనుభ‌వం తో ప‌ని లేకుండా, మీరు చిన్న వ‌య‌సులో ఉన్నార‌నే సున్నిత‌త్వం లేకుండా ట్రీట్ చేసే వాళ్లు మీకు ఎదురుప‌డ‌వ‌చ్చు. అలాంటి వారిని ఎదుర్కొన‌డానికి కూడా రెడీగా ఉండాలి!

కాలం వేగంగా గ‌డిచిపోతుంది!

20ల‌లోపు ఒక రోజు గ‌డిచిపోవ‌డం కూడా ఎక్కువ సేపు అనిపించ‌వ‌చ్చు! స్కూళ్ల‌లో, కాలేజీల్లో ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురుచూడ‌ని పిల్ల‌లంటూ ఉండ‌రు! అయితే ఒక్క‌సారి వీటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాకా.. కాలం చాలా వేగంగా గ‌డుస్తుంది! రోజు గ‌డిచిపోవ‌డానికి ఎదురుచూడ‌టం అంటూ ఉండ‌దు, రోజు ఎప్పుడు గ‌డిచిపోయిందో కూడా తెలియ‌న‌ట్టుగా జీవితం సాగిపోతుంది 20లు దాటిన త‌ర్వాత‌, రోజులే కాదు, వారాలు, నెల‌లు, సంవ‌త్స‌రాలు కూడా చాలా ఇట్టే గ‌డిచిపోతాయి. ఇంకా టైమ్ ఉందిలే అనే ఆటిట్యూడ్ ప‌నికిరాదు 20లు దాటిన త‌ర్వాత‌. ఈ విష‌యాన్ని ఎంత త్వ‌ర‌గా అర్థం చేసుకుంటే స‌మ‌యాన్ని అంత‌గా స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు!

వ్య‌క్తిగ‌త బాధ్య‌త‌లు పెరుగుతాయి!

మిమ్మ‌ల్ని బాధ్య‌త‌గా ఫీల‌యిన వారు కూడా మిమ్మ‌ల్ని బ‌రువుగా భావించే వ‌య‌సు 20 దాటిన తర్వాత మొద‌ల‌వుతుంది. మీపై ఇంకోరి బాధ్య‌త మొద‌ల‌వుతుంది. పెళ్లి వంటివి కూడా కేవ‌లం ఫెయిరీటేల్స్ కాదు, ఎన్నో ర‌కాల బాధ్య‌త‌ల‌తో ముడిప‌డిన‌వి. ఈ విష‌యాన్ని గ్ర‌హించ‌కుండానే చాలా మంది ప్రేమ‌, పెళ్లి అంటూ ఉంటారు. పెళ్లి త‌ర్వాత మ‌రిన్ని బాధ్య‌త‌ల బ‌రువు మీద‌ప‌డుతుంది. మాన‌సికంగా, ఆర్థికంగా అలాంటి బాధ్య‌త‌ల‌కు ప్రిపేర్ అయి ఉండాల‌నే విష‌యాన్ని కూడా ఇర‌వైల‌లోకి ప‌డిన త‌ర్వాత అర్థం చేసుకోవాలి!

మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే!

ఆరోగ్యం బాగుండ‌టం కూడా ఏమీ గ్రాంటెడ్ కాదు! మీ ఆరోగ్యం బాగుండాలంటే మీ ఆల‌వాట్లు కూడా బాగుండాలి. స్మోకింగ్, డ్రింకింగ్ ల‌కు ప‌రిమితులు పెట్టుకోక‌పోతే క‌ష్టం. శారీర‌క క‌ష్టం లేనిది , వ్యాయామం వంటి లేక‌పోతే ఆరోగ్యం పై ప్ర‌భావం ప‌డుతుంద‌నే విష‌యాన్ని అర్థం చేసుకోవాల్సిన వ‌య‌సు కూడా ఇదే!

ఎవ్వ‌రూ ఎప్పుడూ వెంట ఉండ‌రు!

త‌ల్లిదండ్రులు కావొచ్చు, స్నేహితులు, బంధువులు, ప్రేమించిన వారు.. ఇలా ఎవ‌రైనా ఎప్పుడూ త‌మ వెంట‌, త‌మ‌కు అండ‌గా ఉంటార‌నుకోవ‌డం భ్ర‌మ‌! శారీర‌కంగా, మాన‌సికంగా ఎవ‌రి తోడు ఎప్పుడు దూరం అయినా.. త‌ట్టుకునే దృఢ‌మైన మ‌న‌స్త‌త్వాన్ని అల‌వ‌రుచుకోవాలి. అది పేరెంట్స్ మీద అయినా, స్నేహితులు-బంధువులు, ల‌వ్ చేసినా వాళ్లు.. ఎవ‌రి మీద అయినా అతిగా ఆధార‌ప‌డే త‌త్వం మానుకోవాలి. సొంతంగా ప‌నులు చ‌క్క‌బెట్టుకోవాలి! తిండి ద‌గ్గ‌ర నుంచి ప‌నులు చ‌క్క‌బెట్టుకోవ‌డం వ‌ర‌కూ ప్ర‌తిదానికీ తోడుండాలి, ఫ‌లానా వారే తోడుండాలి అనే తీరు బ‌ల‌హీనుల‌ను చేస్తుంది త‌ప్ప బ‌లాన్ని పెంపొందించ‌దు!

మీ గురించి మీరు అర్థం చేసుకోవాలి!

30లు వ‌చ్చేసరికి అయినా మీ గురించి మీకు పూర్తి అవ‌గాహ‌న ఉండాలి. మీ బ‌లాలు ఏమిటి, బ‌ల‌హీన‌త‌లు ఏమిటి, మీరు ఏం చేయ‌గ‌ల‌రు, ఏం చేయ‌లేరు.. అనే విష‌యాల గురించి మీకైనా అవ‌గాహ‌న ఉండాలి. అలాంటి అవ‌గాహ‌న మిమ్మ‌ల్ని నిల‌దొక్కుకునేందుకు ఆస్కారాన్ని ఇస్తుంది. జీవితంలో ఎదుగుద‌ల‌కూ ఇదే కీల‌కం!

ఫ‌న్ కూడా ఇంత ఉండ‌దు!

20ల‌లో ఉండేంత ఫ‌న్ నిస్సందేహంగా ముప్పైల‌లో ఉండ‌దు. దానికి బోలెడు కార‌ణాలు. 20ల ఫ‌న్ కూడా ఇర‌వైల‌లోనే పూర్తి చేసుకోవాలి. అలాగ‌ని ఈ ఫ‌న్ అతి అయితే 30ల జీవితం తీవ్రంగా ప్ర‌భావితం అవుతుందనే విష‌యాన్ని కూడా గ్ర‌హించుకోవాలి!

3 Replies to “30 యేళ్ల‌లోపు అర్థం చేసుకోవాల్సిన వాస్త‌వాలు!”

  1. Good one. ఏ వయస్సు వారైనా నేలమీద నడవటం నేర్చుకోవాలి, ఆకాశానికి నిచ్చెనలు, చుక్కలే హద్దు లాంటి అతిశయ మోటివేషన్స్ బారిన పడకుండా, ఆచి తూచి అడుగులు వేస్తె ఫెయిల్యూర్స్ ని దూరం పెట్టొచ్చు. మంచి స్నేహితులు మంచి ఇన్వెస్ట్మెంట్.

Comments are closed.