Advertisement

Advertisement


Home > Politics - Analysis

షాకింగ్.. సర్వేలు ఇటువైపు, గంటా అటువైపు

షాకింగ్.. సర్వేలు ఇటువైపు, గంటా అటువైపు

మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తరహా వ్యక్తి. ఏ పార్టీలో చేరితే ఫలితం ఉంటుందో, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలుస్తారో.. ఆయనకి బాగా తెలుసు. 2019లో ప్లాన్ వర్కవుట్ కాక వైసీపీలో చేరలేక, టీడీపీ నుంచే పోటీ చేసి గెలిచారు. 

తాను గెలిచినా పార్టీ ఓడిపోవడంతో ఆ తర్వాత వైసీపీలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు కానీ కుదర్లేదు. దీంతో కొన్నాళ్లపాటు స్తబ్దుగా ఉన్నారు. విశాఖ ఉక్కు వ్యవహారంలో ఏకంగా రాజీనామా చేసి హల్ చల్ చేశారు. మళ్లీ సైలెంట్ అయ్యారు.

అయితే ఇన్నాళ్లకు గంట మళ్లీ మోగింది. టీడీపీ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెబుతున్నారు. ఓవైపు సర్వేలన్నీ జగన్ కే అనుకూలంగా వస్తున్న వేళ.. గంటా ఆ గట్టున ఎందుకు ఆగిపోయారా అని అనుకుంటున్నారంతా. ఈ గట్టుకి రావడానికి గ్రీన్ సిగ్నల్ రాదని డిసైడ్ అయిన తర్వాతే ఆయన అలా ఫిక్స్ అయి ఉంటారని సెటైర్లు పడుతున్నాయి.

మౌనం వీడాల్సిన సమయం వచ్చిందా..?

ఇన్నాళ్లూ గంటా శ్రీనివాసరావు సైలెంట్ గానే ఉన్నారు. వైసీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేసినా విజయసాయి రూపంలో అడ్డుగోడ ఉండే సరికి ఆయనకు ఎంట్రీ లభించలేదు. దీంతో టీడీపీకి దూరంగా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చారు. అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేవారు కాదు. అధినాయకుడు విశాఖ వచ్చినా దూరం దూరంగానే ఉన్నారు. అంతెందుకు.. సొంత వియ్యంకుడు నారాయణ అరెస్ట్ అయినప్పుడు కూడా గంటా స్పందించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కానీ ఎందుకో సడన్ గా ఆయన మనసు మార్చుకున్నారు. మౌనం వీడారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో టీడీపీ మహిళా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఏపీ బాగుపడాలంటే మళ్లీ బాబే సీఎంగా రావాలన్నారు.

టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమానికి సానుకూల స్పందన వస్తోందని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ నేతల్ని ఆదరిస్తున్నారని, జగన్ ప్రభుత్వాన్ని చీవాట్లు పెడుతున్నారని అన్నారు గంటా. అదే సమయంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ఫ్లాప్ అయిందని సెటైర్లు వేస్తున్నారు.

మొత్తానికి గంటా వెలుగులోకి వచ్చేశారు. ఇన్నాళ్లూ తనపై జరుగుతున్న ఊహాగానాలకు చెక్ పెట్టేశారు. తను టీడీపీ మనిషినని బహిరంగంగా తనకుతాను ప్రకటించుకున్నారు. ఇన్నాళ్లూ పార్టీతో అంటీముట్టనట్టు ఉన్న గంటా, ఇప్పుడు టీడీపీ జెండాతోనే కొనసాగాలని మనసావాచాకర్మనా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఆయన గురించి బాగా తెలిసిన వ్యక్తులు మాత్రం గంటాపై ఇంకా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?