వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లకు వెళ్లిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 రిపోర్టర్లకు చేదు అనుభవాలు ఎదురవడం కామన్. అలాగే ఇటీవల టీడీపీ కూడా సాక్షిని బాగా టార్గెట్ చేసింది. సాక్షి రిపోర్టర్ రండి రండి.. మీకోసమే వెయిట్ చేస్తున్నా అంటూ లోకేష్ వేసిన జోకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అటు వైసీపీ, ఇటు టీడీపీ రెండూ బాగానే ఉంటాయి. ఈనాడు, సాక్షి, ఏబీఎన్, టీవీ-5 యాజమాన్యాలు కూడా బాగానే ఉంటాయి. మధ్యలో ఆయా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులే బకరాలు అవుతున్నారు.
ప్రెస్ మీట్ కి వెళ్తే.. అసలు పిలవని పేరంటానికి మీరెందుకొచ్చారు అనే దారుణమైన ప్రశ్నలు కూడా ఇటీవల చాలామంది ఎదుర్కొన్నారు. ఎందుకీ విష సంస్కృతి. ఇష్టం ఉంటే పిలవండి, లేకపోతే మానేయండి, ఇంకా నచ్చకపోతే ఆయా పార్టీల కార్యకర్తలకు పక్క ఛానెళ్లు చూడొద్దు, పేపర్లు చదవొద్దు అని హుకుం జారీ చేయండి. మధ్యలో జర్నలిస్ట్ లు ఏం చేశారు..? పబ్లిసిటీకి, ప్రకటనలకు పేపర్లు కావాలి. ప్రెస్ మీట్ కి మాత్రం వాళ్లు వద్దు అంటే ఎలా..? రెండు పార్టీల నేతలూ ఆలోచించాల్సిందే.
దుష్ట చతుష్టయం అంటూ చంద్రబాబు సహా ఆ మూడు మీడియా సంస్థల్ని టార్గెట్ చేస్తుంటారు సీఎం జగన్. కట్ చేస్తే తెల్లవారి వారి పేపర్లలోనే సంక్షేమ పథకాలు ప్రకటనలు కనపడుతుంటాయి. మరి జనం దేన్ని నమ్మాలి, దేన్ని ఆధారం చేసుకుని పేపర్లు చదవాలి. రాజకీయాల్లో.. వైరి వర్గానికి చెందిన మీడియాలో వస్తే కచ్చితంగా కట్టుకథ అని చెప్పేయడం ఇటీవల రివాజు అయిపోయింది.
పోనీ కట్టుకథతే అయితే.. తప్పుడు సమాచారం ప్రకటించినందుకు కేసు వేయండి, న్యాయస్థానంలో నిలదీయండి, ఇంకోసారి అలాంటి కథనాలు ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోండి. పోనీ అవి తప్పుడు కథనాలే అయితే.. వ్యతిరేక సాక్ష్యాలను సేకరించి అసలు కథేంటో చెప్పండి. మధ్యలో జర్నలిస్టుల్ని ఆడుకోవడం ఎందుకు?
చాలా చోట్ల అంత ఓపిక, తీరిక నాయకులకు లేదు. మీడియా చెప్పేదంతా నిజం అని నమ్మడం వల్లే చంద్రబాబు 2019లో చరిత్ర ఎరుగని ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా ఆయా మీడియా సంస్థలు బాబుని నెత్తినపెట్టుకుని తిరుగుతున్నాయి. తప్పులు చెప్పడంలేదు, కర్తవ్య బోధన చేయడంలేదు. దీనికి ఫలితం ఆయన, ఆయన అనుకూల మీడియా తప్పకుండా అనుభవిస్తాయి. అదే సమయంలో జర్నలిస్ట్ లకు ఈసడింపులు, చీత్కారాలు మాత్రం సరైనవి కావు అంటున్నాయి జర్నలిస్ట్ సంఘాలు.
నాయకులు, మీడియా సంస్థల యజమానులు ఫంక్షన్లు, బయట కలిసినప్పుడు బాగానే మాట్లాడుకుంటారు. కానీ జర్నలిస్ట్ లు కనపడితే మాత్రం ఎందుకో చిరాకుపడిపోతుంటారు నాయకులు. 'నువ్వు ఫలానా పత్రికా.. ఓహో అయితే నువ్వు మా గురించి ఏం రాస్తావులే' అంటూ చీప్ గా మాట్లాడుతుంటారు.
నేతల మాటతీరుకి ఇప్పటికే విసిగి వేసారి పోయారు జర్నలిస్టులు. ఆ పార్టీ నేతల కార్యక్రమాలకు ఈ పార్టీకి అనుబంధంగా ఉండే మీడియా ప్రతినిధులు వెళ్లడమే మానేశారు. మహా అయితే యూట్యూబ్ లో లైవ్ వచ్చే వీడియోస్ ని కట్ చేసుకుని సెటైర్లు వేస్తుంటారు. ఇప్పుడంతా సెల్ఫ్ డబ్బా మీడియానే మిగిలింది.
ఎవరి డబ్బా వారు కొట్టుకోవడం, పక్కోడిపై బురదజల్లడం, మధ్యలో జర్నలిస్ట్ లు అవమానాలు పాలుకావడం.. ఇదే ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది.