గారాబం చేయడం ఇలా!

అవసరం అయితే గారాబం చేసి, లాలించి, బుజ్జగించడం ఎలాగో చంద్రబాబును చూసి తెలుసుకోవాలి జగన్. ఎప్పుడూ పుల్ల విరిచినట్లు మొరటుగా వుండడం కాదు. పవన్ కళ్యాణ్ మద్దతు లేకుంటే తెలుగుదేశం పరిస్థితి ఈ ఎన్నికల్లో…

అవసరం అయితే గారాబం చేసి, లాలించి, బుజ్జగించడం ఎలాగో చంద్రబాబును చూసి తెలుసుకోవాలి జగన్. ఎప్పుడూ పుల్ల విరిచినట్లు మొరటుగా వుండడం కాదు. పవన్ కళ్యాణ్ మద్దతు లేకుంటే తెలుగుదేశం పరిస్థితి ఈ ఎన్నికల్లో ఏమయ్యేదో అందరి ఊహలకు అందేదే. ఎలాగో అలా పవన్ ను దారికి తెచ్చుకున్నారు. ఎన్నికల ముందు పవన్ ఎంతలా తిరిగి కూటమికి ప్రచారం చేసారో తెలిసిందే. చంద్రబాబు ఇచ్చినన్ని సీట్లు మాత్రమే తీసుకున్నారు. చెప్పిన వారికే సీట్లు ఇచ్చారు. కాపులకు నచ్చ చెప్పి ఓట్లు ట్రాన్స్ఫార్మ్ అయ్యేలా చేసుకున్నారు.

తెలుగుదేశం జనాలు పవన్ ప్రాధాన్యత గమనించినా, గమనించకున్నా, చంద్రబాబుకు తెలుసు. ఇకపై కాపులను ఇలా దువ్వుతూ, పవన్ ను దగ్గర వుంచుకోకుండా మళ్లీ జగన్ పార్టీ అధికారం ఎత్తుకుపోతుందని. జగన్ ను ఏదో ఒకటి చేసి, రాజకీయాలకు దూరం చేసే వరకు పవన్ ను, కాపులను ఇలా బుజ్జగిస్తూ పోవాల్సిందే.

అందుకే ఒకే ఒక ఉపముఖ్యమంత్రి పదవి క్రియేట్ చేసి పవన్ కు ఇచ్చారు. అక్కడితో ఆగలేదు. ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్ అనే ఆలోచన చేసి, మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. అటు మోడీ స్పెషల్ గెస్ట్ గా వస్తుంటే, ఆ రేంజ్ లో స్టేట్ గెస్ట్ అంటూ మెగాస్టార్ ను పిలవడం, స్పెషల్ ఫ్లయిట్ లో రప్పించడం ఇవన్నీ చాలు కాపులు పొంగిపోవడానికి, చంద్రబాబు తమకు ఇస్తున్న ప్రయారిటీ చూసి మురిసిపోవడానికి.

సమావేశంలో తనకు ప్రత్యేక కుర్చీ వేస్తే, అది వద్దు, పురంధ్రీశ్వరికి, పవన్ కు వేసిన కుర్చీనే తనకు వేయమన్నారు. ఆ వీడియో చాలు, తెలుగుదేశం జనాలు విపరీతంగా షేర్ చేసుకుని ఆనందించడానికి. అధికారం ముఖ్యం, ఇలాంటి చిన్న చిన్న పనులు ఎన్ని చేసినా, ఏమీ ఫరక్ పడదు. అది చంద్రబాబుకు బాగా తెలుసు.

కానీ జగన్ మాత్రం అధికారం తలకెక్కించుకుని, హీరోలను గేట్ నుంచి లోపలకు నడిపించి, దూరం చేసుకున్నారు. కానీ ఖర్చు లేకుండా గారాబం చేయడం ఎలాగో జగన్ నేర్చుకోవాలి. అమరావతి రాజధాని, వైజాగ్ ఆర్థిక రాజధాని, కర్నూలును అన్ని విధాలా అభివృద్ది చేస్తాం అనే మాటలు చెబితే జనాలకు కమ్మగా వుంటుంది. మూడు రకాలుగా మూడు రాజధానులు అంటే జోక్ గా, మీమ్స్ సరుకుగా మారుతుంది.

జనాల చెవుల్లో ఎలా పువ్వులు పెట్టాలో జగన్ కు రాదు. చంద్రబాబు ను చూసి ఇప్పటి నుంచయినా నేర్చుకోవాలి. లేదూ అంటే ఎప్పటికీ రాజకీయం చేతకాదు.