గోరంట్ల మాధవ్ జగన్ కు ఎలా నచ్చాడో

ఏ పార్టీ అయినా అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, పార్లమెంట్ ఎన్నికల్లో గానీ పార్టీ తరపున టిక్కెట్లు ఇచ్చేటపుడు అభ్యర్థుల గత చరిత్ర తెలుసుకోవాలి. మైనస్ పాయింట్లు ఏమున్నాయో ఆరా తీయాలి. అలా చేయకపోతే వారు…

ఏ పార్టీ అయినా అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, పార్లమెంట్ ఎన్నికల్లో గానీ పార్టీ తరపున టిక్కెట్లు ఇచ్చేటపుడు అభ్యర్థుల గత చరిత్ర తెలుసుకోవాలి. మైనస్ పాయింట్లు ఏమున్నాయో ఆరా తీయాలి. అలా చేయకపోతే వారు ఎప్పటికైనా పార్టీకి చెడ్డ పేరు తెస్తారు. ప్రతిపక్షాలు విమర్శించడానికి అవకాశం ఇస్తారు. ఇప్పుడు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఇలాగే ఉంది. సంచలనం కలిగిస్తున్న ఆయన అభ్యంతరకర వీడియో దుమారం రేపుతోంది. ఈ వీడియో నిజమైందో, బూటకపు వీడియోనో ఇప్పటికిప్పుడు తేల్చడం కష్టం. అధికార పార్టీ ఎంపీ కాబట్టి పోలీసులు దీనిపై ఎంత సీరియస్ గా ఉంటారో చెప్పలేం.

అందులో ఆయన, చొక్కా లేకుండా ఒక మహిళతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఆయన నగ్నంగా కాల్ మాట్లాడారు అంటూ ఒక వీడియో ఇవాళ ఉదయం నుంచీ సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. టీడీపీ నేతలు ఈ వీడియోను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. వారు రాజకీయంగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు తమ గురించి వ్యతిరేకంగా వార్తా పత్రికల్లో వస్తే తాను అలా అనలేదని, వక్రీకరించి రాసారని అంటారు. టీవీల్లో వస్తే మార్ఫింగ్ చేశారని అంటారు. ఇలా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి అనేక కారణాలు చెబుతుంటారు.

గతంలో ఎస్వీబిసి ఛానెల్ (టీడీడీ) సారథిగా పనిచేసిన నటుడు పృథ్వీ రాజ్ ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో టీవీ చానెళ్లలో మారుమోగిన సంగతి తెలిసిందే. అప్పుడు పృథ్వీరాజ్ ఆ గొంతు తనది కాదని ఎవరో మిమిక్రీ చేసి తనను భ్రష్టు పట్టిస్తున్నారని వాదించారు. కానీ చివరికేమైంది? పదవి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ తాను నిర్దోషిగా తిరిగివచ్చి పదవిలో కూర్చుంటానని అన్నాడు. కానీ పార్టీకి, ప్రభుత్వానికి అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇప్పుడు గోరంట్ల మాధవ్ వ్యవహారం కూడా ఇలాగే ఉంది. ఢిల్లీలో ఆయన వీడియో వైరల్ అవడం వైసీపీ ఎంపీకి ఇబ్బంది మారింది. దీంతో తక్షణం మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు.

మీడియా సమావేశంలో తన సహజ ధోరణిలోనే మీడియా వారిని బూతులు తిట్టారు. చెత్త నాకొడుకులంటూ మాట్లాడారు.ఈ ప్రసారాలపై హైకోర్టుకు వెళ్తానని.. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. ఇప్పటికే ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. ఏపీలో అధికారంలో ఉన్నది మీ పార్టీనే కాబట్టి అక్కడి పోలీసుల విచారణ నిజాయితీగా జరుగుతుందా అని ప్రశ్నించగా.. ప్రస్తుతం ఏపీలో పోలీసు వ్యవస్థ చంద్రబాబు హయాంలోలాగా లేదన్నారు. జగన్‌మోహన్ రెడ్డి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ‌ ఇచ్చారని.. తప్పు చేస్తే సొంత పార్టీ వారిపైనా చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఏపీ పోలీసులు ప్రస్తుతం ఎవరి పక్షాన పనిచేయడం లేదని.. కాబట్టి ఈ వ్యవహారంలో నిజానిజాలను వారే తేలుస్తారని చెప్పారు.

కియా కంపెనీ ప్రతినిధులనూ గతంలో దూషించిన అంశంపై  మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మరోసారి నోటి దురుసు ప్రదర్శించారు ఎంపీ. మా నీళ్లు, మా భూములు తీసుకున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వండిరా ''ముండ కొడకల్లారా'' అని కియా ప్రతినిధులను తిట్టానని అందులో తప్పేంటని ఎదురు ప్రశ్నించారు మాధవ్. ఈ ఎంపీ గత చరిత్ర కూడా గొప్పది కాదు. ఈయన పోలీసు ఎస్సైగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. గోరంట్ల మాధవ్‌ ఇప్పుడే కాదు.. పోలీసు శాఖలో ఉన్నప్పుడు  కూడా ఆయన అనేక సార్లు వివాదాస్పదం అయ్యారు. సర్వీస్‌ మొత్తం ఏమాత్రం ఓర్పు, సహనం లేకుండా పోలీసులంటే లాఠీతోనే పలకరించాలన్న నైజం ఇతడిలో ఉండేది. డజన్ల కొద్ది చార్జీ మెమోలు తీసుకున్నారు.

10కిపైగా ప్రైవేట్ కేసులు నమోదు అయ్యాయి. ఎస్‌ఐగా ఉన్నప్పుడే రెండు సార్లు సస్పెండ్ అయ్యారు. ఏదైనా కేసు నమోదు అయితే ఇరు వర్గాలను స్టేషన్‌కు పిలవడం అక్కడే వార్నింగ్‌లు ఇవ్వడం, పంచాయితీలు చేయడం అప్పట్లో మాధవ్ నైజంగా ఉండేదన్న కథనాలు మీడియాలో వచ్చాయి. వినకుంటే దారుణంగా కొట్టేవారన్న ఆరోపణలు వచ్చాయి. పలుమార్లు వీఆర్‌కు వెళ్లారు. ఎన్నికల ముందు జేసీ దివాకర్ రెడ్డిని బూతులు తిట్టి మీసం మెలేయడం ద్వారా జగన్‌ మనసు గెలిచి ఎంపీ టికెట్ సాధించేశారు. 

ఈయన పలు కులాలను బహిరంగ వేదికల మీదే హెచ్చరిస్తుంటారు. ఈయన మీద రేప్ కోసులు కూడా ఉన్నాయని టీడీపీ వాళ్ళు చెబుతున్నారు. మరి జగన్ ఈయన గత చరిత్రను తెలుసుకోలేదా?