ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల దిశగా తన పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచినే జగన్ కసరత్తు మొదలైంది.
కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో నియోజకవర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు జగన్. ఇందులో భాగంగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, పార్టీ శ్రేణులకు విజయం గురించి ఉద్బోధించారు జగన్.
వచ్చే ఎన్నికల్లో కుప్పంలో భరత్ ను గెలిపిస్తే.. ఆయనను మంత్రిని చేస్తానంటూ జగన్ ప్రకటించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి భరత్ పోటీ చేయబోతున్నాడని జగన్ స్పష్టం చేసినట్టుగా అయ్యింది.
ఇటీవల కుప్పం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తమిళనటుడు విశాల్ పోటీ చేస్తాడంటూ ఒక రూమర్ కు తెరలేచింది. ఆ ప్రచారాన్ని టీడీపీ మీడియా గట్టిగా చేయగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని గురించి స్పందించనే లేదు. ఈ నేపథ్యంలో కుప్పంలో పర్యటించిన వైఎస్ జగన్ .. వచ్చే ఎన్నికల్లో భరత్ అక్కడ బరిలో ఉంటారని స్పష్టత ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న, వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు దాదాపుగా పోటీ చేసే కుప్పం నియోజకవర్గం మీదే జగన్ కాన్సన్ ట్రేట్ చేశారు. ఇప్పటికే గత ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు మెజారిటీ తగ్గిపోవడంతో పాటు..అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పంలో తెలుగుదేశాన్ని చిత్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, కుప్పం మున్సిపాలిటీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పాతడం మరో ఎత్తు.
ఇక్కడ పరిస్థితిలో తేడా వస్తోందని.. చంద్రబాబు కూడా రంగంలోకి దిగారు. తన పరువు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఇలా స్పష్టం అవుతోంది.