కొన‌సాగుతున్న ఐ ఫోన్ హ‌వా!

ఇండియాలో ఐ ఫోన్ హ‌వా కొనసాగుతూ ఉంది. ఐ ఫోన్ 16 కూడా ట్రెండింగ్ టాపిక్ గా నిలుస్తోంది. ఒక స్మార్ట్ ఫోన్ కంపెనీ ప్ర‌తియేటా త‌న మోడ‌ల్ ను కాస్త అప్ గ్రేడ్…

ఇండియాలో ఐ ఫోన్ హ‌వా కొనసాగుతూ ఉంది. ఐ ఫోన్ 16 కూడా ట్రెండింగ్ టాపిక్ గా నిలుస్తోంది. ఒక స్మార్ట్ ఫోన్ కంపెనీ ప్ర‌తియేటా త‌న మోడ‌ల్ ను కాస్త అప్ గ్రేడ్ చేస్తూ విడుద‌ల చేయ‌డం, దాన్ని కొన‌డానికి జ‌నం వేలం వెర్రిగా ఎగ‌బ‌డ‌టం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మే! అదేదో ఎప్పుడో అరుదుగానా అంటే.. అలా ఏం కాదు! ప్ర‌తియేటా సెప్టెంబ‌ర్ వ‌స్తోందంటే.. అంత‌కు ముందు రెండు మూడు నెల‌ల నుంచి అదిగో, ఇదిగో అంటూ హ‌డావుడి మొద‌లు! తీరా విడుద‌ల‌య్యే స‌మ‌యానికి పిచ్చి పీక్స్ కు చేరుతుంది! కొత్త‌గా వ‌చ్చే మోడ‌ల్ కోసం పాత మోడ‌ల్ ను మార్చేయ‌డం, లేదా కొత్త మోడ‌ల్ వ‌స్తోందంటే.. ఐ ఫోన్ ఓన‌ర్ కావ‌డానికి అదే త‌గు ముహూర్తం అని భావించే భారతీయుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతూ ఉంది. ఐ ఫోన్ 4 విడుద‌ల స‌మ‌యంలో అమెరికాతో పాటు ప్ర‌పంచం అంతా మొబైల్స్ కోసం క్యూలు గ‌ట్టే సంప్ర‌దాయాన్ని చూసింది.

ఆ స‌మ‌యంలో ఇండియాలో కూడా ఐ ఫోన్ క్రేజ్ ఉన్నా.. ఆ త‌ర్వాత పెరిగింది చాలా ఎక్కువ‌! అయితే అప్ప‌టికి కూడా ఐ ఫోన్ చేతిలో ఉండ‌టం ఒక స్టేట‌స్! సాధార‌ణ ట‌చ్ స్క్రీన్ ఫోన్ ధ‌ర నాలుగైదు వేల రూపాయ‌లు ఉన్న ద‌శ‌లో.. ఐ ఫోన్ 4 ను పాతిక వేల రూపాయ‌ల క‌నీస ధ‌ర‌తో లాంచ్ చేశారు! అది కూడా బేసిక్ మోడ‌ల్ రేటు. ఐఫోన్ 4ఎస్ ధ‌ర మ‌రింత అద‌నం! అప్పుడు ఫోన్ కోసం పాతిక వేలు అంటే కొంచెం ఎక్కువే! దీంతో వెచ్చించే వారుకొంచెం త‌క్కువ‌. దీంతో అప్పుడు ఐ ఫోన్ ను క‌లిగి ఉండ‌టం అనేది ఒక స్టేట‌స్ సింబ‌ల్ గా మారింది. మంచి ఉద్యోగ‌మో, పెద్ద వ్యాపార‌మో చేస్తూ.. ఆస‌క్తి ఉన్న వారే అప్పుడు ఐ ఫోన్ జోలికి వెళ్లారు.

అయితే ఇప్పుడు కాలేజీ స్టూడెంట్ల‌కు కూడా ఐ ఫోన్ త‌ప్ప‌నిస‌రిగా మారింది! దానికి తోడు.. ఏడాదికో మోడ‌ల్ భారీ హంగామా మ‌ధ్య‌న విడుద‌ల అవుతోంది. దీంతో.. ఇప్పుడు చేతిలో ఐ ఫోన్ ఉన్నా.. ఏ వెర్ష‌న్ అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాలి! ఏ 12, లేదా 13 వాడుతున్నామ‌ని అంటే.. వినే వారిలో మీద కొంత ఆస‌క్తి త‌గ్గిపోతోంది! 16 వెర్ష‌న్ న‌డుస్తుంటే.. ఇంకా 12 లేదా 13 నా.. అనే స్పంద‌న వారి లో ఇన్ డైరెక్టుగా కనిపిస్తుంది. ఆ పై ప్రో, ప్రో మ్యాక్స్ వాక‌బు చేసే రెండో అంశం. ఐ ఫోన్ బేస్ మోడ‌లని చెప్పుకోవ‌డం కూడా చిన్న‌త‌నం అయిపోతోంది ఈ రోజుల్లో. మినిమం ఐ ఫోన్ ప్రో అని చెప్పుకోవాల్సిన ప‌రిస్థితులు క‌నిపిస్తూ ఉన్నాయి! ప్రో మ్యాక్స్ ..బ‌రువు అంటూ దాటేయ‌వ‌చ్చు మ‌రి!

ఇప్పుడు ఏడాదికి ఇండియాలో అమ్ముడ‌వుతున్న యాపిల్ ప్రోడ‌క్ట్స్ విలువ క‌ళ్లు చెదిరే స్థాయిలో ఉంది. యాపిల్ ఇండియా వినియోగ‌దారుల‌కు సుమారు 68 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రోడ‌క్ట్స్ ను అమ్మింది గ‌త ఏడాదిలో! ఇది కొన్ని రాష్ట్రాల వాస్త‌విక బ‌డ్జెట్ కుస‌మానం! ఈ క్రేజ్ మ‌రింత‌గా పెరుగుతూ ఉంది. ఇన్నాళ్లూ ఉద్యోగ‌స్తులు, ఇంట్లో ఒక‌రికి ఐ ఫోన్ అనే ప‌రిస్థితులు ఉండేవి. ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ కు కూడా ఐ ఫోన్ త‌ప్ప‌నిస‌రిగా మారుతున్న నేప‌థ్యంలో.. కంప్యూట‌ర్ల వినియోగం విష‌యంలో కూడా యాపిల్ డివైజ్ ల వైపు జ‌నాలు వెళ్తున్న త‌రుణంలో ఈ మార్కెట్ రేంజ్ మ‌రింత‌గా పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి!

అయితే యాపిల్ గ్రోత్ లో ఇండియాకు కూడా కొంత వ‌ర‌కూ లాభం ఉంది. ఇప్పుడు యాపిల్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ లో ఇండియా వాటా కొంత ఉంది. ఇండియాలో త‌యార‌వుతున్న యాపిల్ డివైజ్ ల మార్కెట్ విలువ సుమారు ల‌క్షా న‌ల‌భై వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ట‌! ఇండియా నుంచి ఈ మేర‌కు యాపిల్ డివైజ్ లు త‌యారై, ఎగుమ‌తి అవుతున్నాయ‌ని మార్కెట్ గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఇండియాకు ద‌శాబ్దాలుగా మ్యానుఫ్యాక్చ‌రింగ్ హ‌బ్ గా మారాల‌నే ఆస‌క్తి ఉంది. ఈ మేర‌కు కంపెనీల‌కు మంచి మంచి రాయితీలు కూడా ఇస్తోంది ప్ర‌భుత్వం. చైనాలో ప‌రిస్థితులు కూడా కంపెనీలు ఇండియా వైపు మొగ్గు చూపే ప‌రిస్థితి క‌నిపిస్తున్న‌ట్టుగా ఉంది. ఇలా ఇండియా నుంచి ఏడాదిలో ల‌క్షా న‌ల‌భై వేల కోట్ల రూపాయ‌ల విలువైన యాపిల్ డివైజ్ లు ఎగ‌మ‌తి అయ్యే ప‌రిస్థితులు వ‌చ్చాయి.

అయితే కొంద‌రు మేధావులు కేవ‌లం మ్యానుఫ్యాక్చ‌రింగ్ హ‌బ్ గా మారితే వ‌చ్చేదెంత‌? అనే ప్ర‌శ్న‌నూ వేస్తూ ఉన్నారు! ఐ ఫోన్, మ్యాక్ ల విష‌యంలోనే తీసుకున్నా.. అందులో సాఫ్ట్ వేర్ ల‌ను త‌యారు చేసే యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ‌తో పోలిస్తే, దాని మ్యానుఫ్యాక్చ‌ర్ చేసే సంస్థ స్థాయి చాలా చాలా చిన్న‌ద‌ని, మ‌నం మ్యానుఫ్యాక్చ‌రింగ్ యూనిట్లే గొప్ప అనుకునే భ్ర‌మ‌లో ఉన్నామ‌ని కొంద‌రు మేధావులు చెబుతూ ఉన్నారు! ప్ర‌స్తుతానికి అయితే త‌యారీ యూనిట్లు ఇండియాలో నెల‌కొల్ప‌డం ఘ‌న‌త‌గా ప్ర‌భుత్వాలు చెబుతూ ఉన్నాయి. ప్ర‌జ‌లు కూడా న‌మ్ముతున్నారు. అయితే ఇలాంటి యూనిట్ల‌కు భారీ ఎత్తున రాయితీలు అందుతున్నాయ‌ని, అలాంటి రాయితీల‌ను తయారీ మీద కాకుండా, సృష్టించ‌డం మీద ఇస్తే అప్పుడు దేశం అభ్యున్న‌తి సాధిస్తుంద‌నే న‌మ్మ‌కాన్ని వారు వ్య‌క్తం చేస్తూ ఉన్నారు!

-హిమ‌

8 Replies to “కొన‌సాగుతున్న ఐ ఫోన్ హ‌వా!”

  1. ఐఫోన్ ప్రియురాలు లాంటిది. ఫాన్సీ గా వుంటది. అందరికీ చూపించుకోడానికి బాగా వుంటది. కానీ ఎక్కువ కాలం మేయన్ట్నెన్స్ చేయాలి అంటే జీవితం తల్లకిందులు అవుతుంది.

    యాండ్రాయిడ్ ఫోన్ ఆరెంజ్డ్ మారేజి చేసుకున్న పెళ్ళము లాంటిది. కావాల్సిన పనులు పద్ధతి ప్రకారం చేస్తుంది. మేయన్టెనెన్స్ ఐఫోన్ తో పోలిస్తే తక్కువ.

  2. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ కూడా కావాలి. దీనితో లో qualification ఉన్న వాళ్లకు kudaa జాబ్స్ వస్తాయి.

Comments are closed.