నిన్నటికి నిన్న ఓ చిన్న వీడియో ఒకటి వచ్చింది. తెలంగాణలో జరిగిన క్రికెట్ టికెట్ ల తొక్కిసలాట సంఘటన ఆంధ్రలో జరిగి వుంటే ఎబిఎన్ చానెల్ కు పండగే అని ఒకరు అనడం, దానికి ఎబిఎన్ న్యూస్ ప్రెజెంటర్ వెంకట కృష్ణ పెద్దగ నవ్వడం. అది నిజమేగా అనిపించింది వీడియో చూడగానే.
ఈ రోజు ఓ వార్త. కలకత్తాలో ప్రసిద్దమైన శ్రీభూమి దుర్గా పూజ సమితి అనే సంస్థ వుంది. ఇది మన ఖైరతాబాద్ వినాయక సమితిలాంటిది. ఏటా ఘనంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఏటా ఒక్కో థీమ్ తో భారీ పెండాల్ (మండపం) నిర్మిస్తుంది. దీనికోసం ఏటా ఓ థీమ్ ను తీసుకుంటుంది. గతంలో బుర్జ్ ఖలీపా, జగన్నాధ ఆలయం, బాహుబలి సెట్ ఇలాంటి ధీమ్ లు తీసుకుంది. భారీగా ధన వ్యయం చేసి ఈ పెండాల్ ను నిర్మిస్తారు.
ఈ ఏడాది ఆ దుర్గా పెండాల్ కు థీమ్ గా సుప్రసిద్ద వాటికన్ సిటీని తీసుకున్నారు. పెండాల్ మొత్తాన్ని వాటికన్ సిటీ లా అద్భుతంగా తయారు చేసారు. బయట లోపల వాటికన్ సిటీ ఎలా వుంటుందో అలాగే దింపేసారు. ఆఖరికి బయట భవనంపై శిలువ గుర్తుతో సహా.
ఇది కలకత్తాలో జరిగింది కాబట్టి సరిపోయింది. ఇదే ఆంధ్రలో జరిగి వుంటే అదిగో జగన్ ఇలా చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో ఇలా జరుగుతోంది. అంటూ నానా యాగీ చేసి వుండేవారు. సూది మొన అంత అవకాశం కనిపిస్తే చాలు జగన్ ను టార్గెట్ చేయడానికి రెడీగా వుంటోంది ఓ వర్గం మీడియా. అలాంటి మీడియాకు ఇలాంటి అవకాశం దొరికితే ఇంకేమైనా వుందా? నానా యాగీ చేసేసి, డిస్కషన్లు పెట్టేసి వుండేది. కలకత్తాలో జరిగింది కాబట్టి సరిపోయింది.