గహ్లోత్ నెత్తిన బలవంతంగా కిరీటం పెడుతున్నారా?

ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని, అధికారాన్ని, హోదాని వదులుకొని.. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని ఒక జాతీయ పార్టీకి అధ్యక్ష హోదా స్వీకరించాలనే ముచ్చట ఎవరికి మాత్రం ఉంటుంది? శవాసనం వేసి ఉన్న…

ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని, అధికారాన్ని, హోదాని వదులుకొని.. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని ఒక జాతీయ పార్టీకి అధ్యక్ష హోదా స్వీకరించాలనే ముచ్చట ఎవరికి మాత్రం ఉంటుంది? శవాసనం వేసి ఉన్న జాతీయ పార్టీని తిరిగి పునరుజ్జీవింపజేయాలంటే అంత సులభమైన వ్యవహారం ఎంత మాత్రమూ కాదు! 72 ఏళ్ల వృద్ధ నాయకుడు దేశమంతా తిరుగుతూ పార్టీ నాయకులు అందరికీ ప్రేరణ అందిస్తూ వారిని ఎలా ఉత్తేజితులను చేస్తారు? అనేది కూడా ప్రశ్నార్థకమే! 

ఇవన్నీ ప్రతికూల అంశాలే అయినప్పటికీ కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక గహ్లోత్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టడానికి సోనియా కుటుంబం నిర్ణయం తీసేసుకుంది! కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశిధరూర్ కూడా బరిలో నిలుస్తున్నారు గాని.. ఆయన పోటీ కేవలం లాంఛనం! కాంగ్రెసులో సోనియా కుటుంబ నిర్ణయాల పట్ల భిన్నమైన అభిప్రాయాలు గల వ్యక్తులు కూడా  ఉన్నారు అని చెప్పడానికి మాత్రమే ఆయన పోటీ ఉపయోగపడుతుంది. అయితే వారు ఎంత బలంగా ఉన్నారు అనేది ఈ ఎన్నిక ద్వారా తెలుస్తుంది!

ఇదంతా ఒక ఎత్తు అయితే… రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆ పదవిని వదులుకోకుండానే అధ్యక్ష పీఠం ఎక్కాలని ఉబలాటపడుతూ ఉండడం గమనించాల్సిన విషయం. రెండు పదవులు కాదు మూడు పదవులు అయినా నిర్వహించగల సామర్థ్యం, శక్తి తనకు ఉందని ఆయన పాపం పలుమార్లు చెప్పుకున్నారు. కానీ ఆయన విన్నపాలను రాహుల్ ఖాతరు చేసినట్లుగా లేదు! 

కేరళలో పాదయాత్ర సాగిస్తున్న రాహుల్ చెంతకు అశోక గహ్లోత్ వచ్చి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. భేటీ అనంతరం తాను కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పడం విశేషం. అదే రోజున మళ్లీ షిరిడి వెళ్లిన గహ్లోత్ తాను రెండు బాధ్యతలలో కొనసాగుతూ అని అనడం తమాషా!

సోనియా కుటుంబం మద్దతు గహ్లోత్ కి ఉన్నదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి అది వారి మద్దతే నా, ఆయనను ఆ పదవి నుంచి తప్పించి సచిన్ పైలెట్ కు వివాదరహితంగా అప్పగించాలనే ప్రయత్నమా? నీ అనుమానాలు కూడా ఉన్నాయి. అది వారి వ్యూహం కావచ్చు అని కూడా కొందరు అంచనా వేస్తున్నారు!

ఆ రకంగా చూసినప్పుడు రాజస్థాన్లో యువ నాయకుడిని సీఎం చేయడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవడం కాంగ్రెస్ కు సాధ్యం కావచ్చు! కానీ దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? అశోక గహలోత్ ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టినంత మాత్రాన ఆయన స్వయం నిర్ణయాధికారంతో వ్యవహరించగలరా? సోనియా రాహుల్ కుటుంబ పెత్తనానికి నిరంతరం తలగుతూ వారి కనుసున్నలలో పార్టీకి ఒక రబ్బర్ స్టాంప్ గా మాత్రమే సేవలందిస్తారా.. అనేవి చర్చనీయాంశాలు. 

చూడబోతే అశోక్ గహలోత్ నెత్తిన ఒక ముళ్ళ కిరీటం లాగా బలవంతంగా అధ్యక్ష పదవిని కట్టబెడుతున్నారని కొందరు అంచనా వేస్తున్నారు.