వైఎస్సార్ కుమార్తెగా తెలంగాణ రాజకీయాల్లో తన అస్తిత్వం నిరూపించుకోవడానికి, సొంతంగా ఒక పార్టీని స్థాపించి.. ఇప్పటికే సగం రాష్ట్రం పాదయాత్ర ద్వారా చుట్టబెట్టేసి.. ప్రభుత్వం వేధింపులు, పోలీసు కేసులు ఎన్నో ఎదుర్కొంటూ పోరాడుతున్న వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తు గురించి.. తాజాగా రాజకీయ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
వైఎస్ షర్మిల కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నారనేది ఆ పుకారు. తమ కుటుంబానికి సన్నిహితుడైన కన్నడ కాంగ్రెసు నేత డికె శివకుమార్ సారథ్యంలో ఆ పార్టీ కర్ణాటకలో ఘన విజయం సాధించడం, ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా అయిన నేపథ్యంలో షర్మిల రెండుసార్లు ఆయన ఇంటికి వెళ్లి అభినందించారు. ఆమె కాంగ్రెస్ లో చేరతారనే పుకారు వ్యాప్తిం చెండానికి ఇదొక్కటే కారణం కాకపోవచ్చు.
నాలుగురోజుల కిందట వైతెపాకు చెందిన ఇధ్దరు నాయకులు ఢిల్లీ వెళ్లి, అక్కడ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసి చర్చించినట్లుగా కూడా పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లన్నీ నిజమై షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం అంటూ జరిగితే గనుక.. ఆమెకు ముందు ముందు చాలా ఇబ్బందులు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
(1) ఆమె ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీచేస్తానని పాదయాత్ర సందర్భంగానే చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఆమెకు ఆసీటును కేటాయించడానికి ఒప్పుకోవచ్చు. అంతకు మించి.. ఆమె అనుచరులకు వైతెపా నాయకులకు టికెట్లు ఇవ్వడానికి, కేవలం ఆమెమాట మీద, వారు ఒప్పుకుంటారా లేదా డౌటే! ఒక్క పాలేరు ఎమ్మెల్యే కావడం కోసమే అయితే.. షర్మిల వైతెపా తరఫున కూడా గెలవగలరు. పరిమితంగా కొన్ని సీట్లలో పార్టీని పోటీకి దింపి, తన పాలేరు మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఆమె గెలవడం సాధ్యం. ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం ఏకంగా పార్టీని విలీనం చేయాలా? అనేది ప్రశ్న.
(2) విలీనం జరిగి, పార్టీ కూడా గెలిస్తే.. ఆమెకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. కానీ అది షర్మిల స్థాయికి పెద్ద విషయం కాదు. కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడడమే గనుక జరిగితే.. ఆమె వైతెపా తరఫున ఎమ్మెల్యేగా నెగ్గితే ఆ తర్వాతనైనా తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి మంత్రి పదవి తీసుకోవచ్చు. ఎటొచ్చీ.. డికె శివకుమార్, కేవీపీ రామచంద్రరావు లాంటి అత్యంత ప్రభావశీలమైన వ్యక్తులు ఆమెకు సహకరిస్తారు.
(3) కాంగ్రెసులోకి విలీనం అయి, కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పాటుకాకపోయినట్లయితే గనుక.. షర్మిల రాజకీయ భవితవ్యం పూర్తిగా అగమ్యగోచరంగా మారుతుంది. ఆమెను తెలంగాణ పీసీసీలో కీలక నాయకురాలిగా పరిగణిస్తారనే గ్యారంటీ లేదు.
(4) అదే సమయంలో ఒకసారి కాంగ్రెసు నాయకురాలు అనే ముద్ర పడిన తర్వాత.. ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మీదికి ఒక బాణంలాగా ప్రయోగిస్తారు. ఆ రాష్ట్రంలో పూర్తిగా అడుగంటిపోయిన పార్టీని తిరిగి పైకి లేపడానికి ఆమెను వాడుకోవాలని చూస్తారు. ఆమె రాజకీయ కెరీర్ కు ఇవన్నీ చాలా సంక్లిష్టమైన అంశాలు అవుతాయి.
ఇలాంటి కారణాల దృష్ట్యా చూసినప్పుడు.. షర్మిల వైతెపా పార్టీ కాంగ్రెసు పార్టీలో విలీనం కావడం వలన, ఆమెకు వరుస ట్రబుల్స్ పొంచి ఉన్నాయని, అందలాలు దక్కడం అనేది అంత ఈజీ కాదని, ఆచితూచి వ్యవహరించడం మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు.