వైజాగ్ సెంట్రల్ జైలులో పూర్ణానంద స్వామి

ఇన్నాళ్లూ భక్తిపేరిట కళ్లబొల్లి కబుర్లు చెప్పిన పూర్ణానంద స్వామి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో, ఇతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచారు. వచ్చే…

ఇన్నాళ్లూ భక్తిపేరిట కళ్లబొల్లి కబుర్లు చెప్పిన పూర్ణానంద స్వామి, ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్నాడు. బాలికను రెండేళ్ల పాటు నిర్బంధించి లైంగికంగా వేధించిన కేసులో, ఇతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచారు. వచ్చే నెల 5వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో 'స్వామివారిని' సగౌరవంగా సెంట్రల్ జైలుకు తరలించారు.

పూర్ణానంద స్వామికి జైలు కొత్తేం కాదు. 2012లోనే అతడిపై రేప్ కేసు పడింది. అప్పుడో ఓసారి అరెస్ట్ అయి బయటకొచ్చాడు. ఇప్పుడు మరోసారి దొరికాడు. ఈసారి దొంగ బాబా బయటకొస్తే ఊరుకునేది లేదంటూ స్వచ్ఛంధ సంస్థలు, కొన్ని పార్టీలు ఆల్రెడీ విశాఖలో ధర్నాకు దిగాయి.

పూర్ణానంద స్వామికి విశాఖపట్నం నగరంలోని వెంకోజీపాలెంలో జ్ఞానానంద ఆశ్రమం ఉంది. 2016లో, 12 ఏళ్ల వయసులో ఈ ఆశ్రమంలోకి వచ్చింది ఓ బాలిక. తల్లిదండ్రుల్ని కోల్పోయి, అనాథగా మారిన ఈ బాలికను అక్కున చేర్చుకోవాల్సింది పోయి, పడక గదిలోకి తీసుకెళ్లాడు ఈ దొంగ స్వామీజీ.

రెండేళ్లుగా ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వస్తున్నాడు. తన గదిలోనే గొలుసులతో బంధించి మరీ ఈ దుశ్చర్యను కొనసాగిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు పనిమనిషి సహాయంతో బయటపడి, తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కి పారిపోయింది బాలిక. కొంతమంది సహాయంతో, విజయవాడ పోలీసుల్ని ఆశ్రయించి, జరిగింది మొత్తం చెప్పింది.

దీంతో పూర్ణానందను అదుపులోకి తీసుకున్నారు విశాఖ పోలీసులు. రిమాండ్ లో ఉన్న అతడ్ని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోర్టుకు విన్నవించుకున్నారు. కస్టడీలోకి వచ్చిన తర్వాత, పూర్ణానంద రాసలీలలు మరిన్ని బయటపడే అవకాశం ఉంది.