తెలంగాణ సీఎం కేసీఆర్ తన పాలన గొప్పతనం గురించి చెప్పుకోడానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన విషయాలను ఉదహరించాల్సి వచ్చింది. ఇవాళ ఒక సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ ఏమన్నారంటే…
“మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల చెప్పారు. గతంలో ఆంధ్రాలో ఎకరా అమ్మితే తెలంగాణలో ఐదారెకరాలు కొనొచ్చని. ఇప్పుడు తెలంగాణలో ఎకరా భూమి అమ్మి, ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చని చంద్రబాబు చెప్పారు. అంటే విషయం తారుమారైంది. మంచి నాయకత్వం వుంటే ఏమవుతుందో ఆయన మాటలే చెబుతున్నాయి. పటాన్చెరులో ఎకరా భూమి రూ.30 కోట్లు వుంది. ఈ లెక్కన ఆంధ్రాలో 100 ఎకరాలు కొనొచ్చు” అని కేసీఆర్ అన్నారు.
ఇదే కేసీఆర్ గతంలో చంద్రబాబు గురించి దేశంలోనే డర్టీయిస్ట్ పొలిటీషియన్‌గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. 2018లో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ జతకట్టి తనను ఓడించడానికి ప్రయత్నించడంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది.
నాడు చంద్రబాబు ఘోర ఓటమికి కేసీఆర్ కూడా కారణమని టీడీపీ అభిప్రాయం. జగన్‌కు కేసీఆర్ అన్ని రకాలుగా వెన్నుదన్నుగా నిలబడడం వల్లే టీడీపీని ఘోరంగా ఓడించారని ఆ పార్టీ నాయకులు నమ్మారు.
గతంలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబుపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే చంద్రబాబు ఆంధ్రాలో తన ప్రత్యర్థి వైఎస్ జగన్ పాలనను చులకన చేయడానికి తెలంగాణ గొప్పగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఆ మాటల్నే కేసీఆర్ సందర్భోచితంగా వాడుకుని, తెలంగాణలో తన సారథ్యంలో అద్భుతమైన పాలన సాగుతోందని చెప్పడం విశేషం.