ఇన్ ఫ్లుయ‌న్స‌ర్ల‌దే కాలం.. వాళ్ల‌కే ఈజీ మ‌నీ!

రానున్న కాలంలో సోష‌ల్ మీడియాలో ఎంత‌మంది ఫాలోయ‌ర్ల‌ను క‌లిగి ఉండ‌టం కూడా ఒక చెప్పుకోవాల్సిన‌, చెప్పుకోద‌గిన అంశం అవుతుంది

త‌న‌కు సంబంధం ఉన్న అన్ని సోష‌ల్ మీడియా ఖాతాల‌కూ క‌లిపి.. ఫాలోయ‌ర్ల సంఖ్య 1 బిలియ‌న్(వంద కోట్లు)కు చేరింద‌ని త‌న అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్టు పెట్టాడు పోర్చుగ‌ల్ సాక‌ర్ ప్లేయ‌ర్ క్రిస్టియానో రొనాల్డో! ఈ 39 యేళ్ల ఫుట్ బాల్ ప్లేయ‌ర్ కు అత్య‌ధికంగా ఇన్ స్టాగ్ర‌మ్ లో ఫాలోయ‌ర్లున్నారు. అస‌లు ఇత‌డు ఫుట్ బాల్ ప్లేయ‌ర్ అని తెలిసినా.. ఇత‌డి దేశం ఏది? అంటే ట‌క్కున చెప్ప‌లేని ఇండియ‌న్స్ కూడా చాలా మంది ఇత‌డిని ఇన్ స్టా లో ఫాలో అవుతూ ఉంటారు. మ‌రి కొంద‌రికి అయితే ఇత‌డెవ‌రో అస్స‌లు తెలీక‌పోయినా ఫాలో అవుతూ ఉంటారు!

ఇండియాలో ఇప్పుడు ఇన్ స్టాగ్ర‌మ్ ఊపు గ‌ట్టిగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ భారీ జ‌నాభా ఉన్న దేశంలో కూడా క్రిస్టియానోకు గ‌ట్టిగానే ఫాలోయ‌ర్లు ఉంటారు. ఇన్ స్టాగ్ర‌మ్ లో క్రిస్టియానోకు సుమారు 68 కోట్ల మంది ఫాలోయ‌ర్లు ఉన్నారంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు! ఫుట్ బాల్ ప్ర‌పంచ క్రీడ‌గా వెలుగొందుతూ ఉంది. సాక‌ర్ ప్రపంచ‌క‌ప్ లో ఏకంగా 32 దేశాలు పాల్గొంటాయి! అర్హ‌త సంపాదించే దేశాలే అన్ని, అర్హ‌త కోసం ఎదురుచూసే దేశాలు బోలెడు! ఒక‌సారి అర్హ‌త సంపాదించి, ఆ త‌ర్వాత దాన్ని కోల్పోయిన దేశాలు కూడా ఉన్నాయి! ఇలా అత్యంత పోటీతో ఉండే సాక‌ర్ ఇప్పుడు రిచెస్ట్ గేమ్ కూడా! సాక‌ర్ తో స‌త్తా చూపించే ప్లేయ‌ర్ల‌కు దేశంతో నిమిత్తం లేకుండా క్రేజ్ ఉంటుంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో సాక‌ర్ క్ల‌బ్ ల‌కు మంచి పేరు ప్ర‌ఖ్యాతులున్నాయి. ఇలా కూడా సాక‌ర్ ప్లేయ‌ర్లు దేశాల‌కు అతీతంగా ఫాలోయ‌ర్ల‌ను సంపాదించుకుంటూ ఉన్నారు. మ‌రి ఇన్ స్టాగ్ర‌మ్, యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట‌ర్.. ఇలా అన్ని అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల్లో క‌లిపి ఫాలోయ‌ర్ల సంఖ్య వంద కోట్ల‌ను దాటిందంటూ.. త‌న అన్ని సోష‌ల్ మీడియా ఖాతాల్లోనూ క్రిస్టియానో ప్ర‌క‌టించుకోవ‌డం వెనుక పెద్ద వ్యూహ‌మే ఉంది! ఇలాంటి ప్ర‌క‌ట‌న ద్వారా.. అత‌డు త‌న సోష‌ల్ మీడియా పోస్టు రేటును గ‌ట్టిగా పెంచుకునే అవ‌కాశం ఉంది! ఇప్ప‌టికే ప్ర‌పంచంలో ఇన్ స్టాగ్ర‌మ్ పోస్టుకు అత్య‌ధిక సొమ్మును వ‌సూలు చేసే సెల‌బ్రిటీగా ఇత‌డే మొద‌టి స్థానంలో ఉన్నాడు. త‌న అధికారిక ఇన్ స్టాగ్ర‌మ్ అకౌంట్లో పెట్టే ప్ర‌తి పోస్టుకూ ఇత‌డు 16 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తాడ‌ని రెండు మూడేళ్ల కింద‌టే వార్త‌లు వ‌చ్చాయి!

ఇప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న బ‌లగం వంద కోట్లు అని చెప్పుకుంటున్న క్రిస్టియానో రొనాల్డో ఆ రేటును మ‌రింత పెంచుకోవ‌చ్చు! ఈ మ‌ధ్య కాలంలో ఆట‌గాడిగా ఇత‌డి ఫామ్ త‌గ్గుముఖం ప‌ట్టింది. రెండేళ్ల కింద‌ట జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ లో ఇత‌డిని కీల‌క మ్యాచ్ ల‌లో కూడా ఇత‌డిని చాలా సేపు బెంచ్ కు ప‌రిమితం చేశాడు ఆ జ‌ట్టు మేనేజ‌ర్. అలా క్రిస్టియానో ఇమేజ్ కొంత డౌన్ అయినా, ఫ్యాన్ డ‌మ్ మాత్రం పెరుగుతూనే ఉన్న‌ట్టుగా ఉంది! ఇలా సోష‌ల్ మీడియాలో దూసుకుపోతున్నాడు. ఎంతైనా.. 900 గోల్స్ చేసిన తొలి ఫుట్ బాల‌ర్ ఇత‌డు!

ఇక ఇన్ స్టా పోస్టుల ద్వారా క్రిస్టియానో త‌ర‌హాలోనే భారీగా సంపాదిస్తున్న సెల‌బ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు. నాన్ స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్ లో అమెరిక‌న్ సెల‌బ్రిటీలు ఈ వ‌ర‌స‌లో ముందున్నారు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది అమెరిక‌న్ మోడ‌ల్ కైలీ జెన్న‌ర్. ఈమె త‌న ప్ర‌తి ఇన్ స్టాగ్ర‌మ్ పోస్టుకూ భార‌త మార‌కంలో చెప్పాలంటే 15 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ వ‌సూలు చేస్తుంద‌ట‌! ఆ త‌ర్వాత స్థానంలోనూ ఒక అమెరిక‌న్ ఉంది. ఆమే సింగ‌ర్ సెలీనా గొమేజ్ ఆమె 14 కోట్ల రూపాయ‌ల స్థాయిలో తీసుకుంటుంద‌ట ప్ర‌తి పోస్ట్ కూ.

అలాగే అర్జెంటీన‌న్ ఫుట్ బాల‌ర్ మెస్సీ కూడా దాదాపు 14 నుంచి 15 కోట్ల రూపాయ‌ల స్థాయిలో వ‌సూలు చేస్తాడ‌ట ప్ర‌తి ఇన్ స్టాగ్ర‌మ్ పోస్ట్ కూ! ఆ త‌ర్వాత మ‌ళ్లీ అమెరిక‌న్ సెల‌బ్రిటీలే ఉన్నారు. డ్వెన్ జాన్స‌న్, కిమ్ క‌ర్ధాషియాన్ వంటి వాళ్లు కూడా దాదాపు అటు ఇటుగా ఇదే స్థాయిలో ప్ర‌తి పోస్టుకూ రేటు క‌డ‌తార‌ట‌! అయితే ఈ జాబితాలో టాప్ టెన్లో కూడా భార‌తీయ సెల‌బ్రిటీలు ఎవ‌రూ లేరు.

ఇండియ‌న్ సెల‌బ్రిటీలూ ఇన్ స్టాగ్ర‌మ్ లో మంచి స్థాయిలో సంపాదిస్తున్నారు. త‌మ ఫాలోయ‌ర్ల సంఖ్య‌ను బ‌ట్టి వీరు ప్ర‌తి పోస్టుకూ రేటు క‌డుతూ ఉన్నారు. వీరికీ ఫాలోయ‌ర్ల సంఖ్య‌ను బట్టి బాగానే ముడుతున్న‌ట్టుగా ఉంది. ఇప్పుడిప్పుడు అంత‌ర్జాతీయ బ్రాండ్లు కూడా ఈ విష‌యంలో భారతీయ సెల‌బ్రిటీల‌ను సంప్ర‌దిస్తూ ఉన్నాయ‌ని, కొంత‌మంది బాలీవుడ్ హీరోయిన్ల‌ను ఇప్పుడు అంత‌ర్జాతీయ బ్రాండ్లు పోస్టులు పెట్ట‌మ‌ని భారీగానే ఆఫ‌ర్లు ఇస్తున్నాయ‌నేవార్త‌లు వ‌స్తున్నాయి. ఈ అవ‌కాశాల‌ను భార‌తీయ సెల‌బ్రిటీలు కూడా ఉప‌యోగించుకుంటూ ఉన్నారు.

ఇండియాలో కూడా ఇన్ స్టాలో పోస్టుకు కోటి రూపాయ‌ల‌కు పైన వ‌సూలు చేసే ఇన్ ఫ్లుయ‌న్స‌ర్లు ఉన్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. ఈ విష‌యంలో ఎవ‌రి స్థాయి వారిది. కోటి తీసుకునే వారూ ఉన్నారు, ల‌క్ష‌ల్లో తీసుకుంటున్న వారూ ఉన్నారు. త‌మ ప్ర‌మోష‌న్ల కోసం ఇన్ స్టా దారిని ఎంచుకుంటున్నాయి ర‌క‌ర‌కాల కంపెనీలు. పేరున్న సెంట్లు, షాంపులు, సూటింగ్ కంపెనీలు, బ్రాండింగ్ షూస్, క‌ళ్ల‌జోళ్ల కంపెనీలే కాదు.. ఆఖ‌రికి కాఫీ పొడి వాళ్లు కూడా సెల‌బ్రిటీల ద్వారా పోస్టులు పెట్టించుకుని ప్ర‌మోట్ చేయించుకుంటూ ఉన్నారు. ఆ కంపెనీల స్థాయిని బ‌ట్టి.. స‌ద‌రు సెల‌బ్రిటీల‌కు డ‌బ్బులు వ‌స్తూ ఉన్నాయ‌నేది బ‌హిరంగ స‌త్యం.

గ‌తంలో యాడ్ ల‌లో న‌టించాలి, వాటిని టీవీల్లో ప్ర‌సారం చేయించాలి! వీటిల్లో యాడ్ చిత్రీక‌ర‌ణ‌కు, సెల‌బ్రిటీ ఎండోర్స్ మెంట్ కు అయ్యే ఖ‌ర్చు క‌న్నా టీవీల్లో ప్ర‌సారం చేయించ‌డానికే ఎక్కువ ఖ‌ర్చు పెట్టుకోవాల్సి ఉండేది కంపెనీలు. లేదా పేప‌ర్ లో యాడ్ ప్ర‌చురించాల‌న్నా ఖ‌ర్చు ఎక్కువే! ఇప్పుడు స‌ద‌రు సెల‌బ్రిటీకే ఒక పేజ్ ఉంటోంది. దానికి బోలెడంత‌మంది ఫాలోయ‌ర్లు. అలాగే అందులో పోస్టు చేయ‌డం ద్వారా రీచ్ ఎంతో కూడా కంపెనీల‌కూ స్ప‌ష్టం అయిపోతుంది. ఎంత మందికి వారి పోస్ట్ రీచ్ అవుతోంద‌నే క్లారిటీ ఈజీగా వ‌స్తుంది. దీంతో వారు కూడా అటే మొగ్గు చూపుతున్నారు. ఇలా ప్ర‌సార లేదా ప్ర‌చుర‌ణ ఖ‌ర్చులు త‌గ్గిపోయి సెల‌బ్రిటీల‌కే అద‌న‌పు ఆదాయం అందే ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. టీవీల‌తో పోలిస్తే ఇప్పుడు జ‌నాలు సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నారు. దీంతో ఇదో పెద్ద వ్యాపార‌మార్గంగా మారింది.

అయితే ఇది కేవ‌లం సెల‌బ్రిటీల‌కే కాదు.. సామాన్యుల‌కూ అవ‌కాశం ఇస్తూ ఉంది. చాలా మంది ఇన్ స్టాగ్ర‌మ్ లో పాపుల‌ర్ అవుతున్నారు త‌మ టాలెంట్లు చూపించి. వారిలో మ‌రీ వంద‌లు, వేల సంఖ్య‌లో ఫాలోయ‌ర్ల‌ను క‌లిగి ఉన్న వారికి పెద్ద ఆదాయం ఉండ‌క‌పోవ‌చ్చు. వేల సంఖ్య‌లో ఫాలోయ‌ర్లు క‌లిగిన వారు కూడా యూట్యూబ్ వంటిచోట ఎంతో కొంత సంపాదించ‌గ‌లుగుతారు. ఆ ఫాలోయ‌ర్ల సంఖ్య ల‌క్ష‌ల్లోకి చేరితే మాత్రం స్థిర‌మైన ఆదాయ మార్గం ఏర్ప‌రుచుకున్న‌ట్టే. ఒకే వ్య‌క్తి ప‌ని చేసుకుంటూ, అందులో వీడియోల‌ను అప్ లోడ్ చేస్తూ ల‌క్ష‌ల సంఖ్య‌లో ఫాలోయ‌ర్ల‌ను సంపాదించుకుంటే.. అది దాదాపు ఒక మంచి జాబ్ క‌న్నా ఎక్కువే అని చెప్ప‌వ‌చ్చు.

ఇన్ స్టాలో ఓ మోస్త‌రుగా పాపుల‌ర్ అయిన వారు ఇప్పుడు నెల‌కు ల‌క్ష‌, ల‌క్ష‌న్న‌ర సంపాదిస్తున్నామ‌ని ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. అది కూడా ఒక త‌ర‌హా ప్రేక్ష‌కుల‌కు రీచ్ అయిన వాళ్లే ఆ మాత్రం సంపాదిస్తున్నారు. ఇలా పాపులారిటీ పెంచుకుంటే.. ఎంతో కొంత సంపాద‌న అయితే ఖాయంగా ఉంటుంది. కేవ‌లం స‌ద‌రు సోష‌ల్ మీడియా సైట్లు ఇచ్చే యాడ్సే కాకుండా, బ‌య‌టి యాడ్స్ ను తెచ్చుకుని, ప్ర‌మోష‌న‌ల్ యాడ్స్ ను పోస్టు చేసుకోగ‌లిగితే.. మ‌రో మెట్టు పైకి ఎక్కిన‌ట్టే!

అయితే ఫాలోయ‌ర్ల‌ను సంపాదించే ఆత్రంలో కొంద‌రు ఈజీ మార్గాల‌ను వెదుక్కొంటూ ఉన్నారు. బూతులు, ఎక్స్ పోజింగ్ తో ఇన్ స్టాలో ఫాలోయ‌ర్ల‌ను సంపాదించ‌డానికి కూడా చాలామంది ప్ర‌య‌త్నిస్తూ ఉన్నారు. ఈ బాప‌తు జ‌నాలే అక్క‌డ ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉన్నారు. భార్యాభ‌ర్త‌లు క‌లిసి వీడియోలు చేస్తూ డ‌బుల్ మీనింగ్ జోకులు, లిప్ లాక్ ల‌తో రెచ్చిపోతున్న వారూ క‌నిపిస్తూ ఉన్నారు. ఇంటిల్లిపాదీ బూతు జోకుల‌తో రెచ్చిపోతున్న వారూ ఉన్నారు! ఇదంతా ఎందుకోసం అంటే.. రీచ్ పెర‌గాలి, ఫాలోయ‌ర్లు పెర‌గాలి!

ఎలాగైనా తామూ సెల‌బ్రిటీలం అయిపోవాల‌నే తాప‌త్ర‌యం చాలా మందిలో ఉంది. ఈ త‌ర‌హా ఫాలోయింగ్ పెరిగినా, అది ప‌రిమిత‌కాల‌మే అవుతుందని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే నిజాయితీతో కూడిన ప్ర‌య‌త్నాలు మాత్రం చేయాల్సిన స‌మ‌యం ఇదే, రానున్న కాలంలో సోష‌ల్ మీడియాలో ఎంత‌మంది ఫాలోయ‌ర్ల‌ను క‌లిగి ఉండ‌టం కూడా ఒక చెప్పుకోవాల్సిన‌, చెప్పుకోద‌గిన అంశం అవుతుంది! ఆదాయ మార్గ‌మూ అవుతుంది!

8 Replies to “ఇన్ ఫ్లుయ‌న్స‌ర్ల‌దే కాలం.. వాళ్ల‌కే ఈజీ మ‌నీ!”

  1. ఎక్కడిదో అనేది తెలియక పోయినా చాలామంది జంతుప్రేమికులు రోడ్లమ్మట తిరిగే జాగిలాలకి తిండి పెడుతుంటారు…..మరి అవి కూడా సెలబ్రెటీస్ నేనా..

  2. This is what China is expecting from India that most of the indian should get addicted to Social media and make them useful . for time being they might earn money and some most of the youth follow them because it is easy money( ppl might think it is creative but it is not). so down the line this will effect inida a lot mark my word.

Comments are closed.