జగన్ కూడా కేసీఆర్ బాటలో నడుస్తారా?

తెలంగాణలో ఆల్రెడీ గంట మోగింది గనుక.. పార్టీలు, నాయకులు హడావుడి పడడంలో అర్థముంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా చాలా దూరం ఉంది. ఇప్పుడు ఎలాంటి వరాలు ప్రకటించాలి, ఎలా ప్రజలను…

తెలంగాణలో ఆల్రెడీ గంట మోగింది గనుక.. పార్టీలు, నాయకులు హడావుడి పడడంలో అర్థముంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా చాలా దూరం ఉంది. ఇప్పుడు ఎలాంటి వరాలు ప్రకటించాలి, ఎలా ప్రజలను ఆకట్టుకోవాలి అనే కసరత్తు ఇప్పుడే అనవసరం. 

అయితే చంద్రబాబునాయుడు.. అర్ధరాత్రి కాకుండానే కూచే కోడిపుంజు మాదిరిగా, ఈ ఏడాది మహానాడు సమయంలో.. తమ పార్టీ మినీ మేనిఫెస్టోను ప్రకటించారు. ఎన్నికలు ఏడాది దూరంలో ఉండగా మేనిఫెస్టో పేరుతో కొన్ని వరాలు ప్రకటించడం ఆయనకు మాత్రమే చెల్లింది. ఆ వరాలను మొన్నమొన్నటిదాకా ప్రజల్లో ఊదరగొడుతూ తిరిగారు. ఇప్పుడు.. ఏపీ ప్రజల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు మినీ మేనిఫెస్టో లోని హామీలను అందుకుని, వాటిని మరింతగా పెంచి ప్రజలకోసం ప్రకటిస్తారా? అనేదే ఆ చర్చ!

తెలంగాణలో అచ్చంగా ఇలాగే జరిగింది. కాంగ్రెసు పార్టీ కొన్ని వరాలను ముందుగానే ప్రకటించింది. వృద్ధాప్య పెన్షన్లను నాలుగువేలకు పెంచడం వంటివి అందులో ఉన్నాయి. అయితే సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలో.. కాంగ్రెసును మించి.. తాను అయిదువేలు చేస్తానని ప్రకటించారు. ఆ రకంగా కాంగ్రెసు ముందుగా ప్రకటించిన వరాలపై పైచేయి సాధించారు. ఆ నష్ట నివారణకు కాంగ్రెస్ ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది. ఆ రకంగా కాంగ్రెస్ ముందుగానే ప్రకటించేసిన వరాల విషయంలో కేసీఆర్ పైచేయి సాధించి వారిని ఇబ్బందిలో పడేశారు.

ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి వ్యూహమే అనుసరిస్తారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. చంద్రబాబునాయుడు ఈ ఏడాది మేలో ప్రకటించిన వరాలపై జగన్ కూడా కాస్త అదనంగా జోడించి.. వచ్చే ఏడాది తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తారా? అనేది కీలకంగా కనిపిస్తోంది. 

చంద్రబాబు ప్రకటించిన జనాకర్షక అంశాల్లో రాష్ట్రంలోని ప్రతి మహిళకు 1500 రూపాయలు ప్రతినెలా ఇవ్వడం వంటి హామీలు ఉన్నాయి. జగన్ వీటికి ఒక వెయ్యి జోడించి.. ప్రతి మహిళకు తాను 2500 ఇస్తానని ప్రకటించే అవకాశం ఉంటుందా? అని పలువురు యోచిస్తున్నారు.

నిజానికి చంద్రబాబు హామీల్లో అనేకం డొల్లే. పేదలను ధనవంతులుగా చేయడం వంటి.. ఎవ్వరికీ అర్థంకాని హామీలు అందులో ఉన్నాయి. వాటి సంగతి ఎలా పోయినా.. డబ్బు పంపకాలపై దృష్టి పెట్టిన ఇలాంటి హామీని జగన్ అందిపుచ్చుకుంటారా? లేదా, తాను చేస్తున్నదే గొప్ప సంక్షేమం అని నమ్మి.. ఇతరత్రా కొత్త హామీలను తెరపైకి తీసుకువస్తారా? అనే వాదన వినిపిస్తోంది.