అస్సలు రాజకీయం తెలియదు జగన్ కు. అందుకే అయిదేళ్లకే అధికారం పొగొట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఇంకా నేర్చుకోలేదు. అందుకే నెల రోజులు కూడా కాకుండానే తొందర పడుతున్నారు. వైకాపా శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని గొడవ పెడుతున్నారు. మీరు చేయలేదా అని తెలుగుదేశం పక్షాలు ఎదురుదాడి చేస్తున్నాయి. మీరు దాడులు చేసారు.. మేమూ చేస్తున్నాం అన్నట్లుగా ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాతో తెలుగుదేశం శ్రేణులు బదులిస్తున్నాయి.
నిజానికి ఇక్కడ జగన్ కు తెలియంది ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ ఆయనకు మేలు చేస్తోంది. నాయకులు పార్టీ మారిపోవచ్చు. కానీ కార్యకర్తలు మారిపోతే ప్రమాదం. కానీ ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు చేస్తున్న దాడుల వల్ల దెబ్బతిన్నవారంతా హార్డ్ కోర్ వైకాపా జనాలుగా వుండిపోతారు. తెలుగుదేశం పార్టీ వల్ల దారుణంగా దెబ్బలు తిన్నవారు, ఊరు వదిలి పారిపోయి పరాయి ఊళ్లలో బతకాల్సి వచ్చిన వారు, వైకాపా వైపు వుండకుండా, దేశం వైపు వుంటారా? తమకు అవకాశం వచ్చే వరకు మదిలో రగిలిపోతూ వుంటారు కదా?
అందువల్ల జగన్ ఇప్పుడు చేయాల్సింది దాడుల గురించి మాట్లాడడం కాదు. దాడులకు గురైన వారిని నిత్యం పరామర్శించుకుంటూ పోవడం. వాళ్లు కూలగొడుతుంటారు. దాడులు చేస్తుంటారు. పంటలు వేయకుండా అడ్డుకుంటారు. ఊళ్ల నుంచి తరిమేస్తారు. జగన్ చేయాల్సింది వాటిని ప్రశ్నించడం కన్నా, ఆ బాధితులను పరామర్శించడం, ఆదుకోవడం, ఆర్థిక ఆసరా అందించడం. ఆ విధంగా తన కేడర్ తనతో వుండేలా చేసుకోవచ్చు. పైగా అందుకు తెలుగుదేశంనే పరోక్షంగా సాయం చేస్తోంది కదా.
అలాగే ఈ పథకం అమలు చేయలేదు, ఆ డబ్బులు ఇవ్వలేదు, ఇలా తెలుగుదేశం లోటు పాట్లు, నెల కాకుండానే ఏకరవు పెట్టడం ఎందుకు? హామీలను గుర్తు చేయడం ఎందుకు? జనాలకు తెలియదా? తమకు ఏ డబ్బులు వచ్చాయో, ఏమి రాలేదొ? అదే జనాలకు తెలియదా? ఏ హామీ నెరవేరిందో, ఏ హామీ నెరవేరలేదో? మీడియా కప్పి పుచ్చినంత మాత్రాన జనాలకు గుర్తు లేదా.. తెలియదా.
జగన్ గుర్తు చేసి, అమలు చేసేలా చేయాల్సిన అవసరం ఏముంది? నాలుగేళ్లు సైలంట్ గా వుంటే అమలు అయితే జనాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారు. అమలు చేయకపోతే వైకాపా వెనుక వస్తారు. ఈ సింపుల్ లాజిక్ వదిలేసి నిత్యం సాక్షిలో రాతలెందుకు? చేయాల్సింది పార్టీ సమగ్ర నిర్మాణం. పార్టీకి కొత్త నెత్తురు ఎక్కించడం. బాధితులను అన్ని విధాలా ఆదుకోవడం. మాటల్లో కాదు. చేతల్లో.