తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఖాళీ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శర వేగంగా పావులు కదుపుతున్నారు. రాత్రికి రాత్రే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వుండింది. అయితే ఒక రోజు ముందే కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. ఒకట్రెండు రోజుల్లో మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గతంలో కాంగ్రెస్ శాసనసభ పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా విలీనం చేసుకోవడం వల్ల తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనాలు వుంటాయని రేవంత్‌రెడ్డి గుర్తించకపోవడం గమనార్హం.
ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరికను అక్కడి అధికార పార్టీ ఇన్‌చార్జ్ సరిత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు తాను ఉండగా, ఎమ్మెల్యేను చేర్చుకోవాల్సిన అవసరం ఏంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేను చేర్చుకోవడంపై తనను ఎవరూ సంప్రదించలేదని ఆమె వాపోయారు.