ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. తన పార్టీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ దాడులకు పాల్పడడాన్ని జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. వేంపల్లెలో అజయ్‌కుమార్‌రెడ్డి అనే యువకుడిపై టీడీపీ నాయకుడు బీటెక్ రవి అనుచరులు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో అజయ్ తీవ్రంగా గాయపడ్డారు.
కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న అజయ్‌ని వైఎస్ జగన్ శనివారం పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి వద్ద జగన్ మీడియాతో మాట్లాడుతూ చెడు సంప్రదాయాన్ని ఇంతటితో ఆపాలని, ఎల్లకాలం ప్రభుత్వం మీదే వుండదని చంద్రబాబును ఆయన హెచ్చరించారు.
20 ఏళ్ల పిల్లాడిని నిర్దాక్షిణ్యంగా ఎందుకు కొట్టారో కూడా తెలియదని జగన్ అన్నారు. వైసీపీ కుటుంబానికి చెందిన వ్యక్తి అనే కారణంతో, అతి దారుణంగా కొట్టారని ఆయన వాపోయారు. అదే పనిగా వేంపల్లెకు వాహనంలో వచ్చి, దారిన పోతున్న ఆ యువకుడిపై దాడి చేసి, ఆస్పత్రిపాలు చేశారని జగన్ మండిపడ్డారు. ఇలాంటి ఘటనలతో ఏం సాధిస్తున్నారని జగన్ ప్రశ్నించారు. ఇంత వరకూ పులివెందులలో ఇలాంటి దాడులు చేసే సంప్రదాయం లేదని జగన్ అన్నారు. ఎన్నో ఎన్నికలు చూశామన్నారు. పులివెందులలో ఎప్పుడూ ఎన్నికలయ్యాకు ఓట్లు వేయలేదని కొట్టిన సంప్రదాయం లేదని ఆయన అన్నారు.
భయాందోళన సృష్టించేందుకు ఇలాంటి దాడుల్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. మీరు వేసే ఈ బీజం, చేసే చెడు సంప్రదాయం రేప్పొద్దున మళ్లీ టీడీపీ కార్యకర్తలకు చుట్టుకుంటుందని జగన్ హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులతో తెలియని ఆనందాన్ని పొందొచ్చని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబునాయుడికి మరోసారి చెబుతున్నా… చెడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నావన్నారు. దయచేసి ఆపాలని ఆయన అన్నారు. ఆపకపోతే ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరని గుర్తించుకోవాలని ఆయన హెచ్చరించారు. శిశుపాలుడి పాపాల పండినట్టుగా చంద్రబాబు పాపాలు చాలా త్వరగా పండుతున్నాయన్నారు. అధికారం మారిన రోజు ఈ చెడు సంప్రదాయం ఆయనకే చుట్టుకుంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఈ రోజు దెబ్బలు తిన్న వారు, రేపు అటు వైపు దాడులు చేయడానికి మీరంతకు మీరే బీజం వేస్తున్నారని జగన్ అన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. నాయకులైన మనం ఇలాంటివి ప్రోత్సహించకూడదని జగన్ అన్నారు. చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా… ఇది సరైన సంప్రదాయం కాదు, ఇప్పటికైనా ఆపండి అని జగన్ అన్నారు.
ఏం పాపం చేశాడని ఆ యువకుడిని కొట్టారని జగన్ ప్రశ్నించారు. మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల 10 శాతం ఓట్లు కూటమికి వెళ్లాయన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. రైతు భరోసా, అమ్మ ఒడి పథకాల కింద లబ్ధి కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.