జగన్ శిబిరం పిచ్చ హ్యాపీ!!

తాజా రాజకీయ పరిణామాల పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శిబిరం సంతోషంతో పండగ చేసుకుంటోంది. శుభకృత్ నామ సంవత్సర విజయదశమి పర్వదినం 2024 సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో తమ విజయాన్ని ఏడాదిన్నర…

తాజా రాజకీయ పరిణామాల పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శిబిరం సంతోషంతో పండగ చేసుకుంటోంది. శుభకృత్ నామ సంవత్సర విజయదశమి పర్వదినం 2024 సంవత్సరంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో తమ విజయాన్ని ఏడాదిన్నర ముందుగానే ఖరారు చేసిందని పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. 

కేసిఆర్ స్థాపించిన భారత్ రాష్ట్ర సమితి పుణ్యమా అని వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం మరింత ఈజీ కాబోతోందని..నల్లేరుపై బండి నడక లాగా సాఫీగా సాగబోతోందని వారు అంచనా వేస్తున్నారు. పైకి ఈ విషయాన్ని బాహాటంగా చెప్పుకోకపోయినప్పటికీ లోలోపల పార్టీ శ్రేణులు బి ఆర్ ఎస్ ఆవిర్భావం పట్ల మురిసిపోతున్నాయి.

కల్వకుంట్ల చంద్రశేఖర రావు తరపు ఏజెంట్లుగా కొంతకాలంగా ఆ పార్టీ నాయకులు ఏపీ సర్కారు మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రంగా విరుచుకుపడుతూ వస్తున్నారు. ఏపీలో కూడా ఎన్నికల బరిలో ఉండాలనే ఆశ వారితో అలా మాట్లాడిస్తూ ఉండవచ్చు. అలాగే ఏపీలో శవాసనం వేసి ఉన్న అనేక పార్టీల సీనియర్ నాయకులు వేరే గత్యంతరం లేని పరిస్థితులలో బి ఆర్ ఎస్ వైపు చూపు సాధించే అవకాశం కూడా ఉంది. 

తెలుగుదేశం పార్టీ ఇక ఎప్పటికీ పునర్వైభవాన్ని సంతరించుకోదు అని నమ్ముతున్న అనేకమంది సీనియర్ నాయకులు కేసిఆర్ తో ఉండగల పూర్వపరిచయాల దృష్ట్యా బి ఆర్ ఎస్ లో చేరే అవకాశం ఉంది. అదే మాదిరిగా ఏపీలో సర్వనాశనం అయిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కల్వకుంట్లతో జతకలవవచ్చు మొత్తానికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉంటుందని వీరంతా ఊహిస్తున్నారు.

తాను చేపడుతున్న తిరుగులేని సంక్షేమ పథకాలు తనను ఎప్పటికీ ఏపీలో గెలిపిస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరాలని తెలుగుదేశం కష్టపడుతోంది. జగన్‌కు రెండో అవకాశం దక్కితే గనుక తమ పార్టీ ఇక పూర్తిగా సమాధి అయిపోవడమే.. అని వారందరూ లెక్కలు వేసుకుంటున్నారు. అందుకోసమే జగన్ అడ్డుకోవడానికి తెలుగుదేశం పల్లకీ మోయాలని పవన్ కళ్యాణ్ ఉబలాటపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని పవన్ కళ్యాణ్ అంటున్నారు. కానీ బీఆర్ఎస్ కూడా రంగంలోకి వస్తే ఏం జరుగుతుంది?

ఏపీలో భారాసకు నాయకుల కొరత ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. పైన చెప్పుకున్నట్టు ఇతర పార్టీల నుంచి గత్యంతరం లేని అనేక మంది సీనియర్లు టిఆర్ఎస్ లో చేరుతారు. వారిలో ఎందరు గెలుస్తారు అనే సంగతి పక్కన పెడితే.. వారందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాత్రమే పంచుకోగలరు! చంద్రబాబునాయుడు.. కల్పకుంట్ల చంద్రశేఖర రావు ఇద్దరూ చేతులు కలిపి ఏపీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటారు అనుకోవడం భ్రమ! వారిద్దరూ ఎప్పటికీ బద్ధ శత్రువులే! అలాంటప్పుడు కేసీఆర్ ఎంతమందిని బరిలోకి దించితే వారందరూ కూడా ఆయా నియోజకవర్గాలలో జగన్ వ్యతిరేక ఓటును చీల్చుకోవడంలోనే తమ ప్రతిభ చూపిస్తారు. 

ఏతావతా తెలుగుదేశానికి నష్టం తప్పదు. అందుకే జగన్ శిబిరం పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతోంది. ఇక జాతీయ రాజకీయాల విషయానికి వస్తే జగన్ శిబిరం తొలినుంచి కూడా రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే తమకు ముఖ్యం అనే మాట అంటూనే ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ రాజకీయాలలో తమ వైఖరిని నిర్ణయించుకునే స్వేచ్ఛ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. 

కేసీఆర్ ఏపీ మీద కన్నేస్తే నష్టపోయేది చంద్రబాబు మాత్రమే. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణంగా సమాధి కట్టేసిన కేసిఆర్.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే పనిని పూర్తి చేయడానికి పరోక్షంగా కారకులు అవుతారు అనడంలో సందేహం లేదు!!