పవర్‌స్టార్‌ను నమ్మలేదు.. కమెడియన్‌ను నమ్మారు!

తనను తాను ప్రజాయుద్ధనౌకగా అభివర్ణించుకునే ఒకప్పటి ప్రజా గాయకుడు గద్దర్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు నల్గొండ జిల్లా మునుగోడు స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నిక బరిలో గద్దర్ దిగుతున్నారు. కాకపోతే రాజకీయ…

తనను తాను ప్రజాయుద్ధనౌకగా అభివర్ణించుకునే ఒకప్పటి ప్రజా గాయకుడు గద్దర్ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు నల్గొండ జిల్లా మునుగోడు స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నిక బరిలో గద్దర్ దిగుతున్నారు. కాకపోతే రాజకీయ కమెడియన్‌గా గుర్తింపు ఉన్న కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతి తరఫున ఆయన ఎన్నికలలో పోటీ చేస్తుండడం విశేషం. ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న కేఏ పాల్‌తో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే మునుగోడు బరిలోకి దిగుతున్నట్లుగా గద్దర్ ప్రకటించడం విశేషం.

ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది కవి గాయకుడు గద్దర్‌కు ప్రజల మనిషిగా అనన్యమైన గుర్తింపు ఉండేది. వామపక్ష భావజాల ఉద్యమ పోరాటాలలో కీలకమైన వ్యక్తిగా మెలిగి తన పాటలతో ప్రజల ను ఉర్రూతలూగించిన గద్దర్ తనకు ఎంత ఆదరణ ఉన్నప్పటికీ ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల వైపు చూడలేదు అలాగని రాజకీయ పార్టీల మీద తన వాగ్బాణాలను సంధించడం మానలేదు. 

రాజకీయాల మీద ఆయనకు ఆసక్తి లేదని అనుకోవడానికి కూడా లేదు. గత ఎన్నికల్లోనే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీచేయాలని ముచ్చటపడ్డారు కూడా. ఎట్టకేలకు ఊరు పేరు లేని, తెలంగాణ ప్రజలలో ఆదరణకు ఏమాత్రం ఠికానాలేని కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ తరఫున ఆయన ఎన్నికల బరిలో దిగుతూ ఉండడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

పవన్ కళ్యాణ్ తాను జనసేన పార్టీని స్థాపించినప్పుడు గద్దర్‌ను పలుమార్లు కలిశారు గద్దర్ మీద తనకు విపరీతమైన గౌరవాభిమానాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ బహిరంగ వేదికల మీద ప్రసంగాలలో ప్రస్తావిస్తుంటారు. గద్దర్ ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా తెలంగాణలో జనసేన అస్తిత్వాన్ని నిరూపించుకోవచ్చునని ఎంతో కొంత జనాదరణ దక్కించుకోవచ్చునని పవన్ కళ్యాణ్ గతంలో తలపోశారు. 

అయితే పవన్ కు రాష్ట్రంలో సొంతంగా ఉండే.. ఓట్లుగా మారగలిగిన ప్రజాదరణ తక్కువ! కారణాలు ఏమైనా కావచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఆలోచనలను, ప్రతిపాదనలను గద్దర్ పట్టించుకోలేదు. 

పవర్ స్టార్ ప్రతిపాదనలను తోసిరాజన్న గద్దర్ రాజకీయ కమెడియన్ కేఏ పాల్ ప్రతిపాదనకు ఓకే చెప్పి ఆయన పార్టీలో చేరి ఎన్నికల బరిలోకి దిగడం తమాషా కాక మరేమిటి. గద్దర్ దృష్టిలో కేఏ పాల్ కు ఉన్న విలువ పవర్‌స్టార్, టాప్‌హీరో పవన్ కళ్యాణ్ కు లేకుండా పోయిందా? అనే తరహా అనుమానాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి.