భారత్ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ దేశవ్యాప్తంగా రాజకీయం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఆయా రాష్ట్రాలలో తన అస్తిత్వం కూడా నిరూపించుకునేలాగా కలిసి అడుగులు వేయడానికి ఆయన పావులు కదుపుతున్నారు. అయితే జాతీయ రాజకీయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తొలి నాటి నుంచి అటు భారతీయ జనతా పార్టీని.. ఇటు కాంగ్రెస్ పార్టీని.. కేసీఆర్ సమానంగా ద్వేషిస్తూ వస్తున్నారు. అలాంటి నేపథ్యంలో.. రేపటి జాతీయస్థాయి అడుగులు సవ్యంగా ముందుకు సాగాలంటే… కాంగ్రెస్ పార్టీ మీద ద్వేషం తగ్గించుకోక తప్పదు. కాంగ్రెస్ విషయంలో ఆయన మెత్తబడక తప్పదు అనే అంచనాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
కాంగ్రెసును ద్వేషించడం అనేది కేసీఆర్‌కు రాజకీయ అవసరం! ప్రస్తుతానికి ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని అతిభయంకరంగా తూలనాడుతూ వారిని తక్షణం గద్దె దింపి విపక్షాలు కలసికట్టుగా అధికారంలోకి రావాలని ప్రబోధిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ను కూడా సమాన దూరంలో ఉంచాలని కూడా ఆయన కోరుకుంటున్నారు. తెలంగాణ స్థానిక రాజకీయాలు, ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఏకపక్షంగా అధికారంలోకి రావడం అనే లక్ష్యాలు ఆయనకు కీలకమైనవి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ ను తీవ్రమైన శత్రువుగా చూస్తోంది. భారాసను ప్రకటించిన వెంటనే కూడా రేవంత్ రెడ్డి ఒక రేంజిలో కేసీఆర్ మీద ఫైర్ అయ్యారు. తన పార్టీ పేరులోంచి తెలంగాణ అనే పదాన్ని తొలగించిన కేసీఆర్ యావత్తు తెలంగాణ రాష్ట్రాన్నే వంచిస్తున్నారని తెలంగాణ అస్తిత్వాన్ని చంపేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెసుతో కలిసి అధికారాన్ని పంచుకోవడాన్ని కెసిఆర్ ఏనాటికీ ఇష్టపడరు. వీరి మధ్య ‘స్థానిక’ సయోధ్య కుదరడం అసాధ్యం.!
అదే సమయంలో జాతీయ స్థాయిలో ఏయే పార్టీలతో అయితే ఆయన ప్రధానంగా చేతులు కలపాలని అనుకుంటున్నారో వారందరికీ కాంగ్రెస్ అంటే ప్రేమ ఉంది. బిజెపికి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని అనుకున్నప్పుడు కాంగ్రెసుతో కలిసిన కూటమిని సమష్టిగా ఏర్పాటు చేయడమే మంచిదని అభిప్రాయంతోనే వారందరూ ఉన్నారు.
ప్రస్తుతానికి కెసిఆర్ రాజకీయ ఎత్తుగడలతో ఏకీభావం వ్యక్తం చేసిన వారు కొందరు కనిపిస్తున్నారు. తమిళనాడులోని చిదంబరం ఎంపీ తిరుమవలవన్ తన పార్టీని బిఆర్ఎస్‌లో విలీనం కూడా చేస్తున్నారు. కర్ణాటక నుంచి జెడిఎస్ పొత్తులకు సిద్ధంగా ఉంది. తెలంగాణ సరిహద్దులలో ఉండే కన్నడ ప్రాంతాల్లో సీట్లను ఈ పార్టీకి ధారాదత్తం చేయడానికి కుమారస్వామి ఉత్సాహంగానే ఉన్నారు. సరిహద్దు సీట్లు మాత్రమే కాకుండా కన్నడ నాట తెలుగు వారి ప్రాబల్యం సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న ప్రతి చోటా కూడా బిఆర్ఎస్ పోటీలో ఉండేలా కేసీఆర్ వారితో బేరం కుదుర్చుకోవచ్చు!
అదే సమయంలో ఉత్తరాది నుంచి అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ ఇద్దరూ బీఆర్ఎస్ నిర్వహించబోయే తొలి కార్యక్రమానికి హాజరవుతారని కేసీఆర్ అంటున్నారు. వీరిద్దరికీ కూడా కాంగ్రెస్ వ్యతిరేకత లేదు. తేజస్వి యాదవ్ ప్రస్తుతం నితీష్ కుమార్‌తో కలిసి బీహార్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. సదరు నితీశ్ కుమార్‌కు కాంగ్రెసుతో కలిసి మాత్రమే ప్రత్యామ్నాయ కూటమి ఉండగలదు అనే అభిప్రాయం బలంగా ఉంది. కెసిఆర్ నిజంగా జాతీయస్థాయిలో ఇతర పార్టీలతో కలిసే అడుగులు ముందుకు వేయాలంటే కాంగ్రెస్ పట్ల తన ధోరణిని, దృక్పథాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ కూడా ఉండే కూటమిలోనే భాగం కావాల్సి వస్తుంది.
స్థానికంగా తెలంగాణలో తన పరువు కాపాడుకోవడానికి కేసీఆర్ కు ఒక మార్గం ఉంది. ఇక్కడ 2023లోనే అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి కాబట్టి, ఆ పర్వం ముగిసే దాకా కాంగ్రెస్ పట్ల తన వైఖరిని స్పష్టం చేయకుండా రోజులు నెట్టుకొచ్చి, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి కాంగ్రెస్ కూడా ఉండే కూటమిలో చేరిపోయి.. ‘దేశ విస్తృత ప్రయోజనాల దృశ్య మాత్రమే ఆ రకంగా చేస్తున్నాను’ అని బుకాయించే అవకాశం ఉంది. మొత్తానికి సుదూర రాజకీయ వ్యూహ చతురుడు అయిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎలాంటి మలుపులతో తన జాతీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకువెళతారో వేచి చూడాలి!!