రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఆగ్రహంతో రగిలిపోతుంటారు. అసభ్యంగా తిట్టుకుంటారు. బూతులు మాట్లాడతారు. అసెంబ్లీ అయినా, బహిరంగసభ అయినా, ప్రెస్ మీట్ అయినా వారికి ఒకటే. ఎక్కడ మాట్లాడుతున్నామనేది పట్టించుకోరు. బూతులు మాట్లాడటంలో, అసభ్యంగా మాట్లాడటంలో, అనుచిత వ్యాఖ్యలు చేయడంలో రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ప్రజలను ఆకర్షించే ఎత్తుగడ ఉంటుంది. రెచ్చగొట్టే స్ట్రాటజీ ఉంటుంది.
తాజాగా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతరలో సీఎం రేవంత్ రెడ్డి రెచ్చిపోయి మాట్లాడాడు. కేసీఆర్ ను బూతులు తిట్టాడు. కాంగ్రెస్ కార్యకర్తలు తలచుకుంటే ఆయన (కేసీఆర్) ఒంటి మీద డ్రాయర్ కూడా ఉండదన్నాడు. అంగీ లాగు ఊడదీస్తామన్నాడు. కేసీఆర్ ఫ్యామిలీకి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానన్నాడు. అక్కడ ఆయనకు చిప్పకూడు తినిపిస్తానన్నాడు.
రాజకీయ నాయకుల్లో ఎక్కువమంది ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు జైలుకు పంపించి చిప్పకూడు తినిపిస్తా అంటారు. రాజకీయ నాయకులకు ఇదో ఊతపదం. జైల్లో చిప్పకూడు తినడమంటే అక్కడ సరైన భోజనం ఉండదని, ఇంట్లో పంచభక్ష్య పరమాన్నాలతో సుష్టుగా భోజనం చేసే నువ్వు (ప్రత్యర్థి) జైల్లో తిండి లేక ఛస్తావ్ అని చెప్పడం కావొచ్చు. జైలుకు పొతే నీ పరువంతా గంగలో కలుస్తుందని, ప్రజలు ఛీ కొడతారని చెప్పడం కావొచ్చు. చిప్పకూడు తినిపిస్తా అనడంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి.
ఈ మాట ఎప్పుడో రాజుల కాలం నాటిది అయివుండొచ్చు లేదా బ్రిటిష్ వారి పరిపాలనా కాలంనాటిది అయివుండొచ్చు. అప్పట్లో జైళ్లలో పరిస్థితులు దుర్భరంగా ఉండేవి. చీకటి గదుల్లో బంధించేవారు. సత్తు ప్లేట్లలో పనికిమాలిన, దిక్కుమాలిన భోజనం పెట్టేవారు. దాన్ని చిప్పకూడు అనేవారేమో. అది తినలేని పరిస్థితి ఉండేది. మన దేశ స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న ఎంతోమంది నాయకులు జైళ్లకు వెళ్లి ఆరోగ్యాలు పాడుచేసుకున్నారు. తీవ్రమైన వ్యాధుల బారిన పడిన వారున్నారు.
కొన్ని జైళ్లు నరకానికి మారుపేరుగా ఉండేవి. మంచి ఆహారం కోసం, సౌకర్యాల కోసం ఖైదీలు తిరుగుబాటు చేసిన ఘటనలు చరిత్రలో ఉన్నాయి. కానీ కాలక్రమంలో జైళ్లకు సంబంధించి చాలా సంస్కరణలు వచ్చాయి. చట్టాలు వచ్చాయి. ఖైదీలకు హక్కులు వచ్చాయి. ఇప్పుడు చిప్పకూడు అనే మాటకు అర్ధంలేదు. జైలుకు వెళ్లినవారి ఆరోగ్యాలు దెబ్బతినడంలేదు.
రాజకీయ ఖైదీలకు స్పెషల్ ట్రీట్ మెంట్ ఉంటుంది. వారికి కొన్ని మినహాయింపులు ఇస్తారు. ఇంటి నుంచి భోజనాన్ని అనుమతిస్తారు. తీహార్ జైల్లో ఉన్న కవితకు పర్మిషన్ ఇచ్చారు కదా. ఇక రాజకీయ ఖైదీలకే కాకుండా ఇతర ఖైదీలకు కూడా మంచి భోజనం ఇస్తున్నారు.
జైళ్లలో భోజనానికి, ఇతర సౌకర్యాల కోసం ప్రభుత్వాలు బాగానే ఖర్చు చేస్తున్నాయి. జైళ్లలో ఉండే రిమాండ్ ఖైదీలు కావొచ్చు, శిక్షపడ్డ ఖైదీలు కావొచ్చు ఎవరైనా సరే ఎలాపడితే అలా ట్రీట్ చేయకూడదు. వాళ్లకూ హక్కులు ఉన్నాయి. వాళ్ళ హక్కులను కాపాడడానికి కోర్టులు ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులు జైలుకు వెళ్ళొస్తే పరువు పోతుందని అనుకుంటాం. అలాంటిది ఏమీ ఉండదు. వాళ్ళు తమ రాజకీయ ఎదుగుదలకు దాన్ని ఉపయోగించుకుంటారు. కేసీఆర్ కు చిప్పకూడు తినిపిస్తా అన్న రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళొచ్చినవాడే కదా. ఏపీ సీఎం జగన్ కూడా అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళాడు కదా. వాళ్ళ పరువు పోయిందా?
ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు. ఈ మధ్య చంద్రబాబు కూడా కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు కదా. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు కదా. చాలా రాష్ట్రాల్లో సీఎంలు, ఇతర నాయకులు జైలుకు వెళ్లారు. రాజకీయ నాయకులకు జైలుకు వెళ్లడం వారికి మైనస్ కాదు. వాళ్ళు చిప్పకూడు తినరు.