అభ్యర్థుల ఎంపికలో రేగిన రచ్చలు, మిత్రపక్షాల సర్దుబాటు వ్యవహారం రాయలసీమలో తెలుగుదేశం పార్టీలో రచ్చను రేపుతూ ఉంది. గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో రేగిన రగడ రెబల్స్ తెరపై మీదకు రావడానికి దారి తీస్తోంది. జనసేన, బీజేపీల పోటీకి రాయలసీమలో చంద్రబాబు ఇచ్చిన సీట్లు రెండుమూడే! అయితే.. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న చోటే అసలు చిచ్చు రగులుకోవడం గమనార్హం!
అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో ప్రభాకర్ చౌదరిని కాదని చంద్రబాబు నాయుడు మరో కమ్మ వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇది చౌదరి వర్గాన్ని నిశ్చేష్టులను చేసింది. వారు నానారచ్చ చేశారు. అనంతపురం అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లింలు కూడా ఆశించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఈ సీటులో ముస్లింలను పోటీ చేయించిన సందర్భం ఉంది. అయితే.. అటు ముస్లింలకూ ఛాన్సు ఇవ్వకుండా, ప్రభాకర్ చౌదరికి కాకుండా మరో అభ్యర్థికి టికెట్ ను ఇవ్వడంతో ఇక్కడ రచ్చ తీవ్రం అయ్యింది.
ప్రభాకర్ చౌదరి నేపథ్యాన్ని బట్టి.. ఆయన నిస్సందేహంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలున్నాయి! ఇక ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా రెబల్ బరిలో ఉన్నట్టే! ఇక్కడ నుంచి వెంకయ్యనాయుడు కోటాలో బీజేపీ నేత సత్యకుమార్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, అవసరారర్థం బీజేపీలో చేరిన వరదాపురం సూరి టికెట్ ను ఆశించారు. ఆయన తన శాయశక్తులా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. సత్యకుమార్ అభ్యర్థిత్వంపై ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు వరదాపురం. అయితే.. ప్రయోజనం శూన్యం! అటు పరిటాల కుటుంబం కూడా వ్యతిరేకించడంతో వరదాపురం సూరికి టికెట్ దక్కడం లేదనే టాక్ నడుస్తోంది.
వరదాపురం సూరి కూడా గతంలో తెలుగుదేశం రెబల్ గా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన వ్యక్తే! 2009లో తెలుగుదేశం పార్టీ- కమ్యూనిస్టుల పొత్తు నేపథ్యంలో ధర్మవరం టికెట్ ను ఎర్రపార్టీ దక్కించుకుంది. అప్పుడు వరదాపురం సూరి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసి ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి! వరదాపురం కేవలం ధర్మవరంతో ఆగడని, రాప్తాడులో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడనే ప్రచారం జరుగుతోంద!
కల్యాణదుర్గంలో కూడా తెలుగుదేశం పార్టీలో రచ్చ రేగింది. అక్కడ టికెట్ ఆశించిన ఇద్దరిని కాదని మూడో అభ్యర్థికి చంద్రబాబు టికెట్ కేటాయించారు. అయితే ఇప్పటికే ఒక అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిపోయారు. ఇక మిగిలిన ఉన్నం హనుమంతరాయచౌదరి వర్గం భగ్గున మండుతోంది.
కదిరిలో కూడా అభ్యర్థి విషయంలో రచ్చ జరిగి, ఒకప్పటి ఫిరాయింపు ఎమ్మెల్యే చాంద్ భాషా తెలుగుదేశం టికెట్ ఆశించి, భంగపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం కూటమి పరిస్థితి మూడు వర్గాలు, ఆరు రచ్చలు అన్నట్టుగా ఉంది. జనసేనకు ఈ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ను కేటాయించింది టీడీపీ. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ పాత కాపులు విరుచుకుపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరో నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని తిరుపతి అభ్యర్థిగా ప్రకటించడంపై రచ్చ రగులుకుంది. ఇక్కడ సెట్ చేస్తే సెట్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నట్టుగా లేవు! అమీతుమీ తేల్చుకోవడానికే అన్ని వర్గాలూ రెడీగా ఉన్నట్టున్నాయి. జనసేన అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ వర్గాలు ఏ మాత్రం సహకారం అందించే పరిస్థితి లేదు!
రైల్వే కోడూరులో కూటమిలో గందరగోళం కొనసాగుతోంది. ముందుగా జనసేన తరఫున అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాత తెలుగుదేశం ఇంట్రస్ట్ కొద్దీ మరో అభ్యర్థిని ప్రకటించారు. ఇది కూటమి ఇమేజ్ ను రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతీసేదిలా ఉంది. జనసేన వెన్నెముక లేని పార్టీ అనే విషయాన్ని ఈ మార్పు చాటి చెప్పింది. తెలుగుదేశం కనుసన్నల్లో జనసేన రాజకీయం కొనసాగుతూ ఉందనే విషయాన్ని అందరికీ చాటి చెప్పింది ఈ విషయం.
డోన్ అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో ధర్మవరం సుబ్బారెడ్డిని ముందుగా అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ఏడాది కిందటే ఈ ప్రకటన చేసి ఆ తర్వాత అవసరార్థం మార్పు చేశారు. ఇది ముందుగా ఆశలు పెట్టుకున్న వారిని నిరాశ పరిచే పరిస్థితి ఉంది!నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కూడా రచ్చ రాజుకుంది. ఇక్కడ నుంచి గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన భూమా బ్రహ్మానందరెడ్డి అలక వహించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ నుంచి సీనియర్ టీడీపీ నేత ఫరూక్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనేమో బీజేపీతో పొత్తు వల్ల ముస్లింల ఓట్లకే గండిపడుతోందనే టెన్షన్ తో ప్రచారంలో కనీసం కమలం పార్టీ జెండా, కండువాలు కనిపించకుండా ప్రచారం చేసుకుంటున్నారు.
అయితే గతంలో నంద్యాల నుంచి గెలిచిన తనకు టికెట్ ఇవ్వలేదనే కారణంతో భూమా బ్రహ్మానందరెడ్డి ఇప్పుడు అసంతృప్తుడుగా తయారయ్యారు. ఆయన రెబల్ గా బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.