రాయలసీమలో బలిజల జనాభా గణనీయంగా ఉంటుంది. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చూస్తే.. బలిజల కొన్ని చోట్ల యాభై వేల స్థాయిలో ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. తిరుపతి, బద్వేలు, రైల్వే కోడూరు, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఇవన్నీ బలిజల ఓట్లు భారీగా ఉన్న నియోజకవర్గాలు. తిరుపతి, అనంతపురంలలో యాభై, అరవై వేల స్థాయిలో బలిజల జనాభా ఉంది! సంప్రదాయంగా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉండటం కూడా బలిజల రాజకీయతత్వం!
బీసీలతో పాటు.. అన్నట్టుగా బలిజలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిలిచేవారు. అయితే బీసీల్లో చాలా మార్పు వచ్చింది. మెజారిటీ బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు. అయితే బలిజలు మాత్రం తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు! బలిజల ఓట్లు పది వేలు, ఇరవై వేల ఓట్లు ఉన్న నియోజకవర్గాలు కూడా ఎన్నో ఉన్నాయి! గ్రామాల్లో దాదాపు ప్రతి ఊర్లోనూ బలిజలు ఉంటారు చాలా నియోజకవర్గాల్లో!
బలిజల సినీ అభిమానం కూడా ఒకప్పుడు ఎన్టీఆర్, బాలకృష్ణ అన్నట్టుగానే ఉండేది! చిరంజీవిని కూడా సీమ బలిజలు పట్టించుకునే వారు కాదు! బాలకృష్ణనే ఆరాధించేవారు. అయితే 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టడంతో.. బలిజల్లో ఆయనపై వీరాభిమానం కూడా వచ్చింది. అప్పటి వరకూ బాలకృష్ణను అతిగా ధ్యానించిన బలిజ యువత.. చిరంజీవి వైపు మొగ్గడం ఆయన రాజకీయ పార్టీని పెట్టిన తర్వాత కావడం గమనార్హం. అయితే చిరంజీవి పార్టీ తొందరగానే మూతపడింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి రావడంతో బలిజ యువతకు మరింత ఉత్సాహం వచ్చింది. ఊరూరా జనసైనికులు తయారయ్యారు! ప్రత్యేకించి బలిజ కుర్రాళ్లు!
గత సార్వత్రిక ఎన్నికలప్పుడు మారుమూల పంచాయతీల స్థాయిలో జనసేనకు ఊరూరా ఐదు నుంచి కనీసం పది ఓట్లు పడ్డాయి ప్రతి బూత్ లో కూడా! అలా ఆ పార్టీకి ఉనికిలో ఉంది ఊరూరా. మరి సీమలో అంతమంది బలిజలున్నా, వాళ్ల ఉనికి అన్ని నియోజకవర్గాల పరిధిలోనూ ఉన్నా, కూటమి తరఫున జనసేనకు దక్కిన ప్రాధాన్యత అయితే శూన్యం!
నాలుగు జిల్లాల పరిధిలో.. 52 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జనసేనకు రెండంటే రెండు సీట్లలో పోటీకి అవకాశం దక్కింది. బలిజల జనాభా పరంగా చూస్తే.. అది జనసేన బలం అనుకుంటే.. రెండు సీట్లు అనేవి ఒక్క లెక్కలోకి కూడా రావు! తిరుపతి, రైల్వే కోడూరుల్లో జనసేన పోటీ చేస్తోంది. అయితే తిరుపతిలో తెలుగుదేశం గ్రూపులు జనసేనను ఓడిస్తాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రైల్వే కోడూరులో అభ్యర్థి మార్పుతో జనసేన పూర్తి వీక్ అయిపోయింది! అక్కడ తెలుగుదేశం పార్టీనే శాసిస్తోంది తప్ప జనసేనకు సీన్ లేదనే క్లారిటీ వచ్చింది! ఇదీ బలిజల జనాభా గట్టిగా ఉన్న సీమలో జనసేన పరిస్థితి! అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని బలిజలు ఆశించారు. ప్రజారాజ్యం రోజుల్లోనే అనంతపురం లో బలిజలు గట్టిగా తిరిగారు, బలిజలకే అక్కడ టికెట్ దక్కింది. మంచి స్థాయిలో ఓట్లను కూడా పొందారు.
అయితే అదే బలిజ కుటుంబం కూటమి తరఫున ఈ సారి టికెట్ ఆశించింది. అయితే అలాంటేదేమీ దక్కలేదు. కనీసం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇస్తూ తెలుగుదేశం పార్టీ జనసేనకు అవకాశం ఇవ్వకపోయినా అదో లెక్క! అయితే ఎవరో అనామకుడిని తెరపైకి తెచ్చి మరీ బలిజలను నిరాశ పరిచారు!
అనంతపురం జిల్లాలో కమ్మ వాళ్లకు టీడీపీ తరఫున ఐదు టికెట్ లు దక్కినట్టే! పరిటాల సునీత, బాలకృష్ణ, కల్యాణదుర్గం అభ్యర్థి, అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి, ఉరవకొండ అభ్యర్థి వీళ్లంతా కమ్మ వాళ్లే! వీళ్లుగాక వరదాపురం సూరి ఇంకా తన ప్రయత్నాల్లో తను ఉన్నాడు! ఇలా ఆరు నియోజకవర్గాల విషయంలో.. కమ్మవాళ్లే రాజ్యమే నడుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కమ్మ వాళ్ల జనాభా రెండు మూడు శాతం కూడా ఉండదు! అదే బలిజల జనాభా 15 శాతం వరకూ ఉంటుంది! జనసేనతో పొత్తు పెట్టుకుని బలిజల ఓట్లను గంపగుత్తగా ఆశిస్తూ టీడీపీ ఒక్క బలిజకు కూడా టికెట్ ఇవ్వలేదు!
రాయలసీమ మొత్తంగా కూడా ఎక్కడా వారికి చిన్న ప్రాధాన్యతను ఇవ్వలేదు! అయితే జనసేన ఓట్లూ కావాలి, బలిజల ఓట్లూ కావాలి! అభ్యర్థులు కమ్మ వాళ్లు, ఓటు బ్యాంకుగా బలిజలు! ఇదీ టీడీపీ ఆట!