కాకినాడ జిల్లా తునిలో వార్ వన్‌సైడ్ అనే చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి టీడీపీ తరపున మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి తనయ యనమల దివ్య బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా పోటీ చేస్తున్నారు. ఈయన జగన్ కేబినెట్‌లో మంత్రి కూడా. ఎలాగైనా తునిలో పట్టు నిలుపుకోవాలని యనమల రామకృష్ణుడు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరిస్థితులు ఆయనకు అనుకూలించడం లేదు.
యనమల రామకృష్ణుడు తనకు తమ్ముడు కృష్ణుడిని రాజకీయంగా పూర్తిగా పక్కన పెట్టారు. 2014, 2019 ఎన్నికల్లో కృష్ణుడు వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. దీంతో తన కుమార్తె దివ్యను రంగంలోకి రామకృష్ణుడు దింపారు. కృష్ణుడిపై చెడ్డ పేరు వుందని ఆయన్ను వ్యూహాత్మకంగా రామకృష్ణుడు తప్పించారు. అలాగే దివ్య ఓడిపోయినా భవిష్యత్‌లో ఆమె సీటుకు అడ్డం రాకుండా కృష్ణుడిని దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు యనమల కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడు, కృష్ణుడి అనుచరుడైన శేషగిరిని కూడా దూరం పెట్టడంతో రాజకీయంగా బాగా దెబ్బ తగిలిందని తెలిసింది. శేషగిరి కాపు కులస్తుడు. రాజకీయ గొడవల్లో చేతిని కూడా పోగొట్టుకున్నారు. అలాంటి వ్యక్తిని అనుమానించడం, కనీస కృతజ్ఞత లేకుండా వ్యవహరించారనే కోపంతో అసలే అంతంత మాత్రం మద్దతుగా ఉన్న కాపులంతా టీడీపీని వీడి వైసీపీ పంచన చేరారు.
అలాగే తునిలో కృష్ణుడి అనుచరుడు 500 కుటుంబాలు వైసీపీలో చేరడం విశేషం. తునిలో యనమలకు అండగా వుంటున్న వారంతా దాడిశెట్టి రాజా పంచన చేరిపోతున్నారు. ఈ నేపథ్యంలో తునిలో వార్ వన్‌సైడ్ అనే చర్చకు తెరలేచింది. మరోసారి తునిలో యనమల కుటుంబం ఓడిపోయే అవకాశాలే ఎక్కువని అంటున్నారు.