గ్లాసులో పువ్వు: లొల్లి షురూ!

తెలంగాణలో ఎవరి అవసరం కోసం ఎవరిని ఆశ్రయించారో మనకు క్లారిటీ లేదుగానీ.. మొత్తానికి బిజెపి- జనసేన పార్టీల మధ్య పొత్తు బంధం సవ్యంగానే నడుస్తుందా? లేదా? అనే అనుమానం పలువురిలో వ్యక్తం అవుతోంది. Advertisement…

తెలంగాణలో ఎవరి అవసరం కోసం ఎవరిని ఆశ్రయించారో మనకు క్లారిటీ లేదుగానీ.. మొత్తానికి బిజెపి- జనసేన పార్టీల మధ్య పొత్తు బంధం సవ్యంగానే నడుస్తుందా? లేదా? అనే అనుమానం పలువురిలో వ్యక్తం అవుతోంది.

జనసేన పార్టీ తొలుత తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉన్న 32 సీట్లలో పోటీచేస్తాం అని సీట్ల జాబితా కూడా ప్రకటించేసింది. ఆ తర్వాత వారితో పొత్తు పెట్టుకోవడం కోసం బిజెపి ఆశ్రయించింది. ఢిల్లీ లెవెల్లో మంతనాలు కూడా అయ్యాయి. రెండు రోజుల్లోగా సీట్ల పంపకం పంచాయతీ తేల్చమని అమిత్ షా సూచించినట్లు వార్తలు వచ్చాయి గానీ.. వారం గడుస్తున్నా ఆ సంగతి తేలలేదు.

ఈలోగా పవన్ కల్యాణ్ ఎంచక్కా సకుటుంబ సపరివార సమేతంగా, అన్న కొడుకు పెళ్లికోసం విదేశాలకు వెళ్లారు. ఇక్కడేమో సీట్ల పంచాయతీ తేలలేదు. ఇప్పుడు పొత్తు మొదలు కాకుండానే సిగపట్లు పట్టుకునే పరిస్థితి వొచ్చేసింది. హైదరాబాదు నగరంలో కూకట్ పల్లి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడానికి వీల్లేదని అక్కడి బిజెపి నాయకులు పార్టీ ఆఫీసు దగ్గర లొల్లి ప్రారంభించారు. ఇది ఇక్కడితో ఆగేలా కూడా కనిపించడం లేదు. జనసేన వల్ల బిజెపిక అసలు ఏమాత్రం ఉపయోగం లేదని.. వారికి సీట్లు కేటాయించడం ఆత్మహత్యాసదృశం అవుతుందని వాదిస్తున్న వారు కూడా పార్టీలో పెరుగుతున్నారు.

నిజానికి ఆంధ్రా సెటిలర్లు ఎక్కువ ఉండే సీట్లనే పవన్ కల్యాణ్ ఎక్కువగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి లాంటివి అందులో ఉంటాయి. సహజంగా ఆ సీట్లలో చదువుకున్న వాళ్లు ఎక్కువగా ఉంటారని, మోడీని చూసి తమకు ఓట్లు వేస్తారని బిజెపికి కూడా కోరిక ఉంటుంది. ఆ సీటు మీద ఆశలు పెట్టుకుని ఇన్నాళ్లూ ఊడిగం చేసిన కమలనాయకులు ఉంటారు. 

ఇప్పుడు జనసేన గద్దలా వచ్చి సీట్లను తన్నుకుపోతే వారు ఓర్చుకోలేరు. అందుకే లొల్లి మొదలవుతోంది. వీరి పొత్తు బంధం సవ్యంగా సాగుతుందా? పవన్ కల్యాణ్ సీట్లు పుచ్చుకున్నంత మాత్రాన ధైర్యంగా తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా? కేసీఆర్ మీద.. జగన్ ను తిట్టిన తరహాలు విమర్శలు చేయగల తెగువ పవన్ కు ఉందా? అనే సందేహాలు కూడా పలువురిలో ఉన్నాయి.

ఇంకా లోతుగా అనుమానించేవాళ్లు ఇంకో మాట కూడా అంటున్నారు. బిజెపి- బిఆర్ఎస్ తో కుమ్మక్కు అయిన మాట నిజమే అని.. డైరక్టుగా బిజెపి పోటీచేస్తే విజయావకాశాలు ఉండే కొన్ని సీట్లను ఇప్పుడు జనసేనకు కేటాయించి.. తద్వారా.. తమ కూటమి కేండేటు గెలకుండా భారాస గెలిచేలా లోపాయికారీ వ్యూహరచన చేస్తున్నారని కూడా అంటున్నారు. ఏమో ఎన్నెన్ని లోగుట్టులున్నాయో.. పెరుమాళ్లు కెరుక!