ఊహించిన‌ట్టే.. చిత్త‌వుతున్న పొత్తు!

టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు చిత్త‌వుతోంది. జ‌న‌సేన‌కు అంతోఇంతో బ‌ల‌మున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో లాభిస్తుంద‌నే ఉద్దేశంతోనే టీడీపీ పొత్తుకు అంగీక‌రించింది. అయితే టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు ఆశించిన‌ట్టు క్షేత్ర‌స్థాయిలో ఆ పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క‌లిసి…

టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు చిత్త‌వుతోంది. జ‌న‌సేన‌కు అంతోఇంతో బ‌ల‌మున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో లాభిస్తుంద‌నే ఉద్దేశంతోనే టీడీపీ పొత్తుకు అంగీక‌రించింది. అయితే టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు ఆశించిన‌ట్టు క్షేత్ర‌స్థాయిలో ఆ పార్టీల నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క‌లిసి ప‌ని చేసే వాతావ‌ర‌ణం ఏ మాత్రం క‌నిపించ‌డం లేదు. ఇరుపార్టీల నాయ‌కులు త‌మ నాయ‌క‌త్వాన్ని మ‌రొక‌రి కోసం త్యాగం చేయ‌డానికి సిద్ధంగా లేరు. ఈ వాస్త‌వాన్ని ఆ రెండు పార్టీల ఆత్మీయ స‌మావేశాల్లో చోటు చేసుకుంటున్న జ‌గ‌డాలు బ‌య‌ట పెడుతున్నాయి.

ప్ర‌ధానంగా జ‌న‌సేన బ‌లమంతా ఆయ‌న సామాజిక వ‌ర్గ‌మే అని ఆ పార్టీ నేత‌లు న‌మ్ముతున్నారు. అయితే ప‌వ‌న్ సామాజిక వ‌ర్గం గంప‌గుత్త‌గా జ‌న‌సేన‌కు ఓట్లు వేయ‌ద‌నే గ‌త ఎన్నిక‌ల్లో రుజువైంది. కానీ కొద్దోగొప్పో  కుల‌మే ప‌వ‌న్‌కు ఆలంబ‌న‌. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో సామాజిక ప‌రిస్థితుల రీత్యా జ‌న‌సేన కొంత వ‌ర‌కు ప్ర‌భావితం చేస్తుంది. అందుకే జ‌న‌సేన‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంద‌న్న‌ది వాస్త‌వం.

ఈ బ‌ల‌మే టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య గొడ‌వ‌ల‌కు దారి తీసింది. ఎక్క‌డైతే జ‌న‌సేన నాయ‌క‌త్వం టీడీపీతో పోటాపోటీగా వుంటున్న‌దో అలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లోనే రచ్చ‌కు దారి తీస్తోంది. గ‌త రెండుమూడు రోజులుగా జ‌న‌సేన‌, టీడీపీ ఆత్మీయ స‌మావేశాల్లో చోటు చేసుకుంటున్న గొడ‌వ‌ల‌ను ప‌రిశీలిస్తే ఈ వాస్త‌వం బోధ‌ప‌డుతోంది. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, జ‌గ్గంపేట నియోజ‌క వ‌ర్గాల్లోనూ, అలాగే అన్న‌మ‌య్య జిల్లా మ‌ద‌న‌ప‌ల్లెలో, విశాఖ‌ప‌ట్నంలోనూ గొడ‌వ‌ల‌ను గ‌మ‌నిస్తే ఇదే అర్థ‌మ‌వుతుంది.

జ‌న‌సేన ఏ మాత్రం ప్ర‌భావితం చూప‌ని చోట అస‌లు ర‌చ్చ అనేదే ఉత్ప‌న్నం కాదు. ఉదాహ‌ర‌ణ‌కు మ‌ద‌న‌ప‌ల్లెలో జ‌న‌సేన ఇన్‌చార్జ్ రాందాస్ చౌద‌రి వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జాబ‌లం ఉన్న నాయ‌కుడు. ఈయ‌న రాయ‌ల‌సీమ జ‌న‌సేన కోఆర్డినేట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. రాయ‌ల‌సీమ‌లో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య ఆత్మీయ స‌మావేశాలు సాఫీగా సాగిపోతాయి. మ‌ద‌న‌ప‌ల్లె లాంటి ఘ‌ట‌న‌లు త‌ప్ప‌, మ‌రెక్క‌డా గొడ‌వ‌ల‌కు అస్కారం వుండ‌దు. దీనికి కార‌ణం…రాయ‌ల‌సీమలో జ‌న‌సేన బ‌లం నామ‌మాత్ర‌మే.

ఆ పార్టీ ప్ర‌భావం చూపేంత సీన్ లేదు. తిరుప‌తి, చిత్తూరు, అనంత‌పురం, రైల్వేకోడూరు లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లిజ‌లు ఉన్న చోట జ‌న‌సేన‌కు కొద్ది మేర‌కు ఓట్లు ప‌డొచ్చు. ప్ర‌ధానంగా రాయ‌ల‌సీమ‌లో బ‌లిజ సామాజిక వ‌ర్గం మొదటి నుంచి టీడీపీ వెంట న‌డుస్తోంది. కొత్త‌గా జ‌న‌సేన‌కు వారు ఆక‌ర్షితులైన ప‌రిస్థితి లేదు. కానీ కోస్తా ప్రాంతంలో మాత్రం కొద్ది మేర‌కు జ‌న‌సేన వెంట వారు న‌డుస్తున్నారు.

పొత్తు ప్ర‌క‌ట‌న‌తో జ‌న‌సేన నేత‌ల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల‌పై ఆశ పెరిగింది. త‌మ బ‌లాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేత‌లు ప‌ద‌వులు పొందుతార‌నే భ‌యం జ‌న‌సేన నేత‌ల్లో వుంది. త‌మ ఆశ‌ల్ని ఎక్క‌డ చిదిమేస్తారో అనే భ‌యంతో తిరుగుబాటు చేస్తున్నారు. ప‌ల్ల‌కీలు మోయ‌డానికి మాత్ర‌మే లేమ‌ని, తమ‌కు కూడా ప‌ద‌వులు కావాల‌ని బ‌హిరంగంగా డిమాండ్ చేస్తుండ‌డంతో గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. 

ఇది కేవ‌లం ఆరంభం మాత్ర‌మే. రానున్న రోజుల్లో ఇవి మ‌రింత‌గా పెర‌గ‌నున్నాయి. సీట్ల సంఖ్య‌, నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌క‌ట‌న వెలువ‌డితే టీడీపీ, జ‌న‌సేన నేత‌ల మ‌ధ్య ఓ రేంజ్‌లో గొడ‌వ‌లు ఖాయ‌మ‌ని తాజా ప‌రిణామాలు హెచ్చ‌రిస్తున్నాయి.