స్పెషల్ ఫ్లైట్‌లో సరదా పడి వెళ్లి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్, భాజపా ఉచ్చులో ఇరుక్కున్నారు. కలిసి పోటీ చేయండి, రెండు రోజుల్లో ఏయే స్థానాల్లో పోటీ చేస్తారో డిసైడ్ చేసుకోండి అంటూ భాజపా నేత అమిత్ షా చెప్పేసరికి పచ్చి వెలక్కాయ గొంతులో పడిపోయింది. ఏమీ అనలేక పవన్ వెనక్కు వచ్చారు.
నిజానికి అంతకు చాలా ముందే, ముఫై కి పైగా సీట్లలో పోటీ చేస్తామని పేర్లతో సహా ప్రకటించి వున్నారు జనసేనాధిపతి. మరి ఆ లిస్ట్ భాజపాకు ఇచ్చేస్తే సరిపోయేది. కానీ ఢిల్లీ నుంచి వచ్చాక పవన్ నుంచి మాట, పలుకు లేదు.
కానీ ఇక్కడో గమ్మత్తు వుంది. 25 సాయంత్రం హుటాహుటిన పవన్ ఢిల్లీ వెళ్లారు. అది కూడా స్పెషల్ ఫ్లైట్‌లో. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో కలిసి మరీ వెళ్లారు. అమిత్ షాతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై నిమిషాల పాటు చర్చలు జరిపారు. తాను శుక్రవారం హైదరాబాద్ వస్తానని, ఆలోగా కలిసి పోటీ చేసే లెక్కలు తేల్చాలని అమిత్ షా చెప్పారు. ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అమిత్ షా తో పవన్ కలిసిన ఫొటో మాత్రం బయటకు రాలేదు. కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఫైల్ ఫొటో వాడుకున్నాయి.
కట్ చేస్తే.. పలు మీడియాలు ఈ వ్యవహారం మొత్తం విశ్లేషణ చేసాయి. అన్ని విశ్లేషణలు కలిసి తేల్చినది ఏమిటంటే.. తెలంగాణలో భాజపాతో కలిసి పోటీ చేయడం అన్నది జనసేనకు అన్ని విధాలా మైనస్ అని తేల్చాయి. ఆంధ్రలో తేదేపాతో, తెలంగాణలో భాజపాతో బంధం అంటే రకరకాల ఈక్వెషన్లకు దారి తీస్తుందని లెక్కలు కట్టారు. పవన్ సీట్లు గెలవడం అన్నది లేకపోగా, కాంగ్రెస్ విజయానికి అడ్డం పడతారని హెచ్చరికలు చేసారు. దీనివల్ల ఆంధ్రలో పార్టీకి అన్ని విధాలా నష్టం అని జోస్యం చెప్పారు.
మరి పవన్ మదిలోకి ఇవన్నీ వెళ్లాయో, లేక ఆయనకు కూడా ఇష్టం లేదో, మొత్తానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ పోటీ గురించి మాట్లాడితే ఒట్టు. అంతే కాదు, అసలు జనసేనకు సంబంధించిన అన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ లో కూడా అసలు అమిత్ షా తొ సమావేశం, దాని సారాంశం ఇలా ఏ ఒక్క పాయింట్ అయినా కనిపిస్తే ఒట్టు. చాలా కన్వీనియెంట్‌గా తెలంగాణ పోటీ అన్నది మాయం చేసారు. పవన్ నే ప్రకటించారు. పవన్ నే ఢిల్లీ వెళ్లారు. పవన్ నే వదిలేసారు.
తెలంగాణలో పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదు అని ఆంధ్రలో వైరి పక్షాలు అంటే పవన్ సమాధానం ఏమిటో?