Advertisement

Advertisement


Home > Politics - Opinion

అమెరికాలో హింస, డ్రగ్స్ మధ్య తెలుగువాళ్లు

అమెరికాలో హింస, డ్రగ్స్ మధ్య తెలుగువాళ్లు

అమెరికా అంటే ప్రపంచానికి అదొక క్రేజ్. మరీ ముఖ్యంగా భారతీయులకి, అందులో మరింత ఎక్కువగా తెలుగువాళ్లకి అమెరికా పిచ్చ చాలా ఎక్కువ.

ఎంత పిచ్చంటే అమెరికాలో ఇలా ఉద్యోగం రాగానే అలా పెళ్లి చేసుకుని అక్కడే పిల్లల్ని కనేసేటంత పిచ్చ! ఇంత హడావిడి ఎందుకంటరా? ఎందుకంటే తమకొచ్చిన ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలీదు!

ఒకవేళ ఊడితే హెచ్1బి మీద వెంటనే ఇంకో ఉద్యోగం సంపాదించుకోవాలి. లేకపోతే ఇండియాకు పోవాలి. ఆ లెక్కలో తమ అమెరికా కల కంటిన్యూ అవ్వాలంటే అక్కడే పుట్టి అమెరికన్ పౌరసత్వం పొందిన పిల్లల మీదే ఆశ. ఎందుకంటే వాళ్లకి 18 ఎళ్లు వచ్చాక తమ తల్లిదండ్రులైన వీళ్లకి గ్రీన్ కార్డ్ తెప్పించే అవకాశముంటుంది. అక్కడి నుంచి ఐదేళ్లల్లో సిటిజెన్స్ అవ్వొచ్చు. అదీ ప్లాన్! 

ఏకంగా 23 ఏళ్ల ప్లానా!?..అని వెక్కిరిస్తే వాళ్లు రివర్సులో వెక్కిరిస్తున్నారు. ఎందుకంటే గ్రీన్ కార్డ్ కి అప్లై చేస్తాయని కంపెనీల్ని నమ్ముకుంటే ఒక పట్టాన అది అయ్యేది కాదని.. పైగా మధ్యలో ఉద్యోగం ఊడితే అంతా మొదటికొస్తుందని.. పోనీ అన్నీ సక్రమంగా జరిగినా పాతికేళ్ల లోపు ప్రస్తుత తరుణంలో సిటిజెన్షిప్ వచ్చే సీన్ లేదని.. కనుక పిల్లల్ని కనేయడమే తెలివైన పని అని అంటున్నారు ఆ అన్-ట్యాలెంటెడ్ బ్యాచ్. 

అన్-ట్యాలెంటెడ్ అని ఎందుకు అనాల్సొస్తోందంటే వీళ్లకి తమ ట్యాలెంట్ మీద, అమెరికాలో పోటీకి నిలబడగలిగే శక్తి మీద నమ్మకం ఉండదు. నిజంగా ట్యాలెంటున్న వాళ్లు అక్కడే పిల్లల్ని కన్నా..వాళ్ల ఆధారంతో అమెరికా పౌరసత్వం పొందాలనే ఆలోచనలు చేయరు. తమ ట్యాలెంటు మీద నమ్మకంతో ముందుకు సాగుతుంటారు. ఎక్కడా ఏ తప్పులు, పొరబాట్లు చేయరు. 

ఇంతకీ ఇప్పుడు చెప్పుకునేది అమెరికాకి వచ్చిపడుతున్న అన్-ట్యాలెంటెడ్ స్క్రాప్ గురించి. 

గతంలో అమెరికా ట్యాలెంటెడ్ పీపుల్ కే స్వాగతం చెప్పేది. 20 ఏళ్ళ క్రితం వరకు స్టూడెంట్ వీసాలు కూడా రిజెక్టయ్యేవి. మరీ పెద్ద యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ వస్తే తప్ప ఇండియా నుంచి అమెరికాకి వెళ్లడానికి స్టూడెంట్స్ కి వీసాలు గుద్దేసేవాళ్లు కాదు కౌన్సిలేట్ లో. 

కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇండియా వాళ్ల విదేశీ వేలంవెర్రిని క్యాష్ చేసుకోవడానికి యూనివర్సిటీల తలుపు తెరిచింది అమెరికా. ఎక్కడో మారుమూల చెత్త కాలేజీ నుంచి అడ్మిషన్ తెచ్చుకున్నా వీసాలు గుద్దేస్తున్నాయి కౌన్సులేట్లు. 

మనవాళ్లు లక్షల్లో,కోట్లల్లో ఫీజులు కట్టేసి అమెరికాని ఆర్ధికంగా బలోపేతం చెసేస్తున్నారు. ఈ మాయలో పడి అమెరికా స్క్రాపునంతా తెచ్చి నెత్తినపెట్టుకుంటోంది. ఈ స్క్రాపులో చాలామంది తమ ట్యాలెంట్ తెలిసి.. దొంగ కన్సెల్టెన్సీల ద్వారా బ్యాక్-డోర్ పద్ధతిలో ఫేక్ హెచ్1బిలు పొందడం.. అదే రాంగ్ రూటులో ఉద్యోగాలు సంపాదించడం చేస్తున్నారు. అది నేరమని తెలిసినా కూడా అమెరికా జీవితం మీద పిచ్చితో అస్సలు భయపడకుండా ఈ చర్యలకి పూనుకుంటున్నారు. 

ఆశ్చర్యమేంటంటే అమెరికా వ్యవస్థలు ఈ దొంగ కన్సెల్టెన్సీల్ని ఇప్పటికీ పట్టుకోకపోవడం...దేశంలోకి అటు అన్-ట్యాలెంటెడ్ మెక్సికన్లు ఇల్లీగల్ గా చొరబడుతున్నా, ఇటు స్క్రాప్ ఇండియన్స్ ఫేక్ ఐడీలతో బతికేస్తున్నా పట్టించుకోకపోవడం జరుగుతోంది!! 

దీనివల్ల పద్ధతిగా ఉండేవాళ్లకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ రాంగ్ రూటులోనూ వెళ్లకుండా తమ ట్యాలెంటుని నమ్ముకుని ఉద్యోగం సంపాదించాలనుకునే వాళ్లకి ఫేక్ ఐడీలతో proxy ఉద్యోగాలు పొందేసిన వాళ్ల వల్ల వేకెన్సీలు ఉండడం లేదు. చదువు పూర్తవగానే నిరాశగా వెనుదిరిగి ఇండియాకి వచ్చేసేవాళ్లల్లో వీళ్లు కూడా ఉంటున్నారు.

(ఈ proxy ఉద్యోగాల మీద పూర్తి వీడియోని ఇక్కడ చూడొచ్చు: )

ప్రస్తుతం అమెరికాలో స్థిరపడగల్గుతున్నవాళ్లు అయితే బాగా ట్యాలెంటెడ్ పీపుల్, లేదా ఫేక్ ఐడీలతో proxy ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు. 

దీనివల్ల అమెరికా తన స్వాభావికమైన లక్షణాన్ని కోల్పోయి రాబోయే రోజుల్లో ఒక థర్డ్ వర్ల్డ్ కంట్రీగా మారే ప్రమాదముంది. నిరుద్యోగం, ధనిక-పేద తారతమ్యాలు, అపరిశుభ్రత....వంటి అవలక్షణాలు దేశాన్ని కమ్మేయొచ్చు. 

ఈ ఒక్క విషయంలోనే కాదు అమెరికా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే నిన్న మెయిన్ రాష్ట్రంలో ఒక అగంతకుడు గన్ పట్టుకుని పిట్టల్ని కాల్చినట్టు 22 మందిని కాల్చి చంపితే అతన్ని ఈ వ్యాసం రాసే నాటికి పట్టుకోలేకపోయారు. 38000 మంది జనాభా కలిగిన ప్రాంతంలో కూడా ఆ ఉన్మాదిని పట్టుకోలేకపోయారంటే అమెరికన్ పోలీస్ వ్యవస్థ శక్తి మీద అనుమానాలొస్తాయి. 

అమెరికన్ పోలీసులు ధృఢంగా ఉండి, భారీ ఆయుధాలు పట్టుకుని, క్లాస్ గా ఉండడంతో వాళ్లు చాలా సమర్ధుల్లా అనిపించడం సహజం. కానీ అది నిజం కాదంపిస్తుంది.

అన్ని కొట్ల మంది జనాభా ఉన్న ముంబాయిలోనే కసబ్ ని రోడ్డు మీద పట్టేసారు లాఠీలు పట్టుకు తిరిగే లోకల్ పోలీసులు. ఆర్జీవీ 26/11 ఎటాక్స్ సినిమాలో చూపించిన కానిస్టేబుల్ తుకారం ఎపిసోడ్ చూస్తే అర్ధమవుతుంది. మరి ఇంత బిల్డప్పిచ్చే అమెరికన్ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తొందో అర్ధం కావట్లేదు! 

ఇంత జరిగినా ఇప్పటికీ గన్-కల్చర్ మీద నిర్ణయం తీసుకుని గన్స్ ని బ్యాన్ చేయకపోతే ఇక అమెరికా ప్రభుతం దండగనే చెప్పాలి. అంతే కాదు, ఈ దరిద్రం చాలదన్నట్టు దేశంలో గంజాయి వాడకంపై నిషేధం ఎత్తేయడంతో ఆ మత్తులోపడి యువత నానా రకాల నేరాలకి పాల్పడుతున్నారు. వాటిల్లో ఈ గన్ షూటింగులు కూడా! డ్రగ్స్ ని బ్యాన్ చెయ్యాల్సిన అవసరం అమెరికాకంటే ఎక్కువగా ఏ దేశానికి లేదిప్పుడు. 

ఈ పెద్ద క్రైం సీన్ విషయంలోనే ఇలా ఉంటే ఇక ఆర్ధిక పరమైన నేరాల్లో పట్టించుకునే నాధుడే లేడంటున్నారు కొందరు. 

ఈ మధ్య ఒక ఘరాన తెలుగు మోసగత్తె "ఎకానమీ రేట్లకే ఇండియాకి బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్" అంటూ అమెరికాలోని తన చుట్టూ ఉన్న తెలుగువాళ్లని మోసం చేసి 12 కోట్ల రూపాయలు టోకరా వేసి సంపాదించింది. ఆమెపై కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోక పోగా అంతలా మోసపోవడం మీదే తప్పు అంటూ కంప్లైంట్ ఇచ్చినవాళ్లకి క్లాస్ పీకారట.

ఒక రకంగా అది నిజమే! అమెరికాకి వెళ్లినా ఆ మాత్రం మోసాన్ని గ్రహించలేని అమాయాక స్వాతిముత్యాలున్నారంటే ఎవరికైనా చిరాకొస్తుంది. అలాగని పోలీసులు కేస్ బుక్ చేయకుండా వదిలేయడం సమజసం కాదు కదా. 

అంతే కాదు అమెరికాలో మొన్నీమధ్య ఒక గుంపుగా వచ్చిన ముసుగు యువకులు ఒక స్టోర్ మీద దాడి చేసి ఫోన్లు గట్రా ఎత్తుకుపోయారు. సీసీటీవీల్లో రికార్డైన ఆ చర్య చూస్తే ఇంత దయనీయంగా ఉందా అగ్రరాజ్యంలోని యువత అని ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంది. 

తక్షణం అమెరికన్ ప్రభుత్వం అనేక విషయాల్లో ప్రక్షాళణ కార్యక్రమాలు చెపట్టాలి. 

ఒక్క డాలర్ విలువపైనే ఫోకస్ పెట్టి అదొక్కటీ ఉంటే చాలు..ప్రపంచమంతా తమ దేశానికి తోకూపుకుంటూ వస్తుందనే అహంకారాన్ని పక్కనపెట్టాలి. 

ఎక్కడో ఇజ్రాయెల్లో యుద్ధమంటే సైన్యాన్ని పంపి తొడగొట్టడం కాదు. ముందు లోకల్ క్రైముల్ని అరికట్టగలగాలి. కసబ్ లాంటి ఒక ఉన్మాదిని పట్టుకోలేని దేశంలో ఉంటున్నామని దేశ పౌరులు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి తీసుకురాకూడదు. 

గన్ కల్చర్ ఎత్తేసి పోలీస్ రిక్రూట్మెంట్స్ పెంచేలా చర్యలు తీసుకోవాలి.

ఈ విషయాలపై తెలుగు సంఘాలు కూడా తమ వాణిని అమెరికన్ ప్రభుత్వానికి వినిపించాలి. అందుకే ఈ గోలంతా తెలుగులో చెబుతున్నది. 

తెలుగు సంఘాలంటే ఎంత సేపు ఇండియా నుంచి ఎవర్నో పిలిచి ఏదో వేడుక చేద్దామనే సరదాయే కాదు...అన్నం పెడుతున్న దేశం బాగోగులు కూడా పట్టించుకోవాలి. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలి. 

- పద్మజ అవిర్నేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?