బీజేపీని తెలుగుదేశంతో పొత్తుకు ఒప్పించింది తనేనంటూ పలు సార్లు ప్రకటించుకున్న జనసేన అధినేతకు ఇప్పుడు ఈ పొత్తు ఎత్తుల్లోకి ఆ పార్టీ ఎంట్రీతో కొన్ని సీట్ల కోత పడుతోందనే టాక్ వినిపిస్తోంది!
జనసేన పార్టీకి తెలుగుదేశం విదిల్చిన వీరముష్టి 24 సీట్లను గాయత్రి మంత్రంతో పోల్చుకుని గొప్పలకు పోయిన పవన్ కల్యాణ్ కు ఆ 24 నియోజకవర్గాల్లో పోటీకి కూడా అవకాశం దక్కేలా లేదు! బీజేపీ ఎంట్రీ తర్వాతి పొత్తు చర్చల నేపథ్యంలో జనసేన పోటీకి చంద్రబాబు కేటాయించిన సీట్లకు చిల్లు పడినట్టే అని తెలుస్తోంది.
ముందుగా మూడు ఎంపీ సీట్లలో ఒక నియోజకవర్గాన్ని జనసేన త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తోంది. బీజేపీ ఆరు ఎంపీ సీట్లకు గట్టిగా పోటీ పడుతున్న నేపథ్యంలో.. జనసేనకు అనుకున్న మూడు ఎంపీ సీట్లలో ఒకటి త్యాగం తప్పదని స్పష్టం అవుతోంది. ఇలా జనసేన ముచ్చట రెండు ఎంపీ సీట్లకు పరిమితం అవుతోంది.
ఇక 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ విషయంలో కూడా కోత తప్పదని వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయినా పోటీ చేయాలని గట్టిగా అనుకుంటూ ఉండటంతో.. జనసేన పోటీ 22 కు పరిమితం కావొచ్చని స్పష్టం అవుతోంది.
గాయత్రి మంత్రం.. అని అప్పుడు బిల్డప్పులు ఇచ్చినా ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో కూడా పోటీ సీన్ లేకుండా పోతూ ఉండటంతో త్రివిక్రమ్ ను అడిగి పవన్ కల్యాణ్ కొత్త ఉపమానం ఏదైనా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే రెండంటే రెండు ఎంపీ సీట్లలో పోటీకి జనసేన పరిమితం అయితే అది మరింత పరువు నష్టం అనడంతో వింత లేదు. అయినా టీడీపీతో ఒప్పందం అప్పుడే పోవాల్సిన పరువు పోయింది, ఇప్పుడు కొత్తగా పోయేదేముంది!