అంబానీ పెళ్లిని కూడా వదలని సైబర్ కేటుగాళ్లు

ఆన్ లైన్ మోసాలు ఊహించని విధంగా జరుగుతుంటాయి. కొత్తకొత్త ఎత్తుగడలతో సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తుంటారు. ఓ విషయంలో అప్రమత్తంగా ఉన్నామనుకునేలోపే మరో కొత్త మోసానికి తెరదీస్తారు. చివరికి వీళ్లు అంబానీ ఇంట జరగనున్న…

ఆన్ లైన్ మోసాలు ఊహించని విధంగా జరుగుతుంటాయి. కొత్తకొత్త ఎత్తుగడలతో సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తుంటారు. ఓ విషయంలో అప్రమత్తంగా ఉన్నామనుకునేలోపే మరో కొత్త మోసానికి తెరదీస్తారు. చివరికి వీళ్లు అంబానీ ఇంట జరగనున్న పెళ్లి వేడుకను కూడా వదల్లేదు.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనుంది. కొడుకు అనంత్ అంబానీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రాండ్ గా ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. దేశం మొత్తాన్ని ఇవి ఆకర్షించాయి.

ఇప్పుడీ అంశాన్ని సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు అడ్డాగా మార్చుకున్నారు. కొన్ని నకిలీ లింకులు తయారు చేశారు. అనంత్ అంబానీ పెళ్లి కానుకగా, జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ అంటూ కొన్ని లింకులు సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతున్నాయి.

పెళ్లి కానుకగా 259 రూపాయల జియో రీచార్జ్ ను ఉచితంగా అందిస్తున్నారని, మరో 3 రోజుల్లో గడువు ముగుస్తుందని, వెంటనే లింక్ ను క్లిక్ చేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఆశపడి లింక్ క్లిక్ చేస్తే అంతే సంగతులు.

ఇది పూర్తిగా ఫేక్ అని చెబుతున్నారు పోలీసులు. ఇలా ఆశపెట్టే లింక్స్ ను ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని చెబుతున్నారు. 3 రోజుల్నుంచి ఉత్తరాదిన హల్ చల్ చేస్తున్న ఈ ఫేక్ మెసేజీలు ఇప్పుడు హైదరాబాద్ తో పాటు చాలా ప్రాంతాల్లో సర్కులేట్ అవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.