తెలుగుదేశం పార్టీతో పొత్తుల నేపథ్యంలో జనసేన, బీజేపీలకు కొన్ని సీట్లు దక్కినా… వాటిల్లో మళ్లీ పోటీ చేసేది తెలుగుదేశం పార్టీ వాళ్లే అనే అభిప్రాయాలు ముందు నుంచి ఉన్నవే! తెలుగుదేశం నుంచి చాన్నాళ్ల కిందటే బీజేపీలో చేరిన అరివీర చంద్రబాబు భక్తులకు ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం దక్కుతుందని, అలాగే జనసేనలోకి అడావుడిగా కొందరు తెలుగుదేశం వాళ్లు చేరి ఆ పార్టీ పేరు మీద పోటీ చేస్తారనే అంచనాలున్నాయి.
చంద్రబాబు చేత ఆయా పార్టీలోకి పంపబడిన వాళ్లే ఆ పార్టీల తరఫున పోటీ చేస్తారు, వారిపై అథారిటీ అజమాయిషీ అంతా చంద్రబాబు దే తప్ప బీజేపీ, జనసేనలది మిథ్యాపాత్రే అనే క్లారిటీ సామాన్యులకు అయితే ఉంది. ఇప్పుడు రాజకీయ వెండితెరపై కూడా అదే జరుగుతోంది.
బీజేపీకి తెలుగుదేశం కేటాయించబోయే సీట్లలో ఒక చోట వరదాపురం సూరి, మరో చోట ఆదినారాయణ రెడ్డి, ఇంకో చోట సీఎం రమేష్, మరో చోట నుంచి సుజనా చౌదరి.. ఇలా ఉండబోతున్నట్టుగా ఉంది వరస! వీళ్లంతా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అతి సన్నిహితులు. ఆ పార్టీ అధికారం కోల్పోయాకా బీజేపీ పంచన చేరిన వారు! చంద్రబాబుకు వీరితో దశాబ్దాల అనుబంధం ఉంది, చంద్రబాబుకు ఆంతరంగికులుగా పేరు పొందినవారు కూడా! మరి బీజేపీ తరఫున పోటీ చేయబోయేదంతా ఇలాంటి వారే!
ఇక జనసేన సంగతైతే.. ఇప్పుడే తెలుగుదేశం టు జనసేన వలసలు మొదలవుతున్నాయి. జనసేన ఇప్పటి వరకూ ఐదారు సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించుకోలేకపోతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు నేతలు జనసేనలోకి వెళ్లి ఆ పార్టీ పేరు మీద, గుర్తు మీద పోటీ చేయడం అనే సన్నివేశమే ఇక మిగిలింది! కాపుల ఓట్ల బ్యాంకు కోసం జనసేన పేరును, పవన్ కల్యాణ్ ను, ఢిల్లీలో అనుకూలత కోసం బీజేపీ పేరును గుర్తును చంద్రబాబు తన వాళ్ల చేత వాడుకుంటూ ఉన్నారు!
వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టుగా.. ఇప్పుడు బీజేపీ, జనసేనల్లోకి చేరి మరీ చంద్రబాబు సన్నిహితులు ఎన్నికల్లో పోటీకి దిగి బీజేపీ, జనసేనల పేరు నిలబెట్టబోతున్నారనమాట!