అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో గట్టిగా పట్టుబట్టనప్పటికీ లోక్ సభ నియోజకవర్గాల పోటీ విషయంలో మాత్రం కమలం పార్టీ డిమాండ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఉక్కిరిబిక్కిరే చేస్తున్నట్టుగా ఉంది. ఎనిమిది ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ పట్టుబడుతోందనే వార్తలు వస్తున్నాయి. గంటల కొద్దీ చర్చలు జరుగుతున్నా.. ఈ విషయం ఎడతెగనట్టుగా ఉంది. సీట్ల చర్చలకు వచ్చిన షెకావత్ ఈ రోజు సాయంత్రానికే తేల్చేసుకుని ఢిల్లీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉన్నా, సీట్ల లెక్కలు తేలకపోవడంతో.. ఆయన ఆగిపోయారనే వార్తలు వస్తున్నాయి.
ఎనిమిది ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ పట్టుబట్టుకుని ఉందట! ఇప్పటికే పేరుకు జనసేనకు మూడు ఎంపీ సీట్లలో పోటీకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అయితే ఇప్పుడు అందులో ఒకటి తగ్గించుకోవాలంటూ తన దత్తపుత్రుడికి చంద్రబాబు చెబుతున్నట్టుగా టాక్ వస్తోంది. బీజేపీని అయితే చంద్రబాబు బతిమాలుకుని పొత్తుకు తెచ్చుకున్నారు కాబట్టి.. ఆ పార్టీ ఎనిమిది ఎంపీ సీట్ల విషయంలో గట్టిగా పట్టుకున్నట్టుగా ఉంది!
ఉన్నది 25! అందులో జనసేనకు ఒకటో రెండో అనుకున్నా.. బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు అంటే, టీడీపీకి మిగిలింది జస్ట్ 15! బీజేపీ కోరుకుంటున్న సీట్లలో తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇవ్వగల.. హిందూపురం, రాజమండ్రి, విజయవాడ లేదా గుంటూరు, అనకాపల్లి వంటి సీట్లున్నాయి! అరకు, రాజంపేట వంటివి తెలుగుదేశం పార్టీ త్యాగం చేయగలదు కానీ.. హిందూపురం, విజయవాడ లేదా గుంటూరు, అనకాపల్లి, రాజమండ్రి సీట్లు అంటే.. ఆ పార్టీకి ఇది గట్టి ఎదురుదెబ్బ అవుతుంది!
అసెంబ్లీ టికెట్ల విషయానికి వస్తే.. ధర్మవరం, జమ్మలమడుగుల త్యాగానికి టీడీపీ సై అనగలదు! అయితే.. గుంతకల్లు, మదనపల్లె, రాజమండ్రి, పి.గన్నవరం వంటి సీట్లను ఇప్పుడు టీడీపీ బీజేపీ కి వదలాల్సి ఉండటం అంటే ఆ పార్టీలో చిచ్చు రేగినట్టే! పది అసెంబ్లీ సీట్ల విషయంలో బీజేపీ పట్టుబడుతోందని, ఎనిమిది ఎంపీ సీట్లకు తగ్గేది లేదంటోందట!
జనసేన నుంచి కొంత త్యాగాన్ని చంద్రబాబు చేయించగలరు! పవన్ త్యాగరాజుగా మారినా.. ఒకటీ రెండు సీట్లకు మించి తగ్గలేరు. ఆ మాత్రం తగ్గినా పవన్ ఇంకా పలుచన అవుతారు! ఇళ్లలకగానే పండగ కాదన్నట్టుగా, పొత్తు కుదరగానే.. అధికారం అందినట్టు కాదనేందుకు ఇందుకేనేమో!