క‌మ్మోళ్ల భావోద్వేగంతో పొలిటిక‌ల్ గేమ్‌!

క‌మ్మోళ్ల భావోద్వేగంతో తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీలు ఆటాడుకుంటున్నాయి. తెలంగాణ‌లో న‌వంబ‌ర్ 30న అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ప్ర‌జ‌ల్లో టీడీపీ అభిమానులు, అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న…

క‌మ్మోళ్ల భావోద్వేగంతో తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీలు ఆటాడుకుంటున్నాయి. తెలంగాణ‌లో న‌వంబ‌ర్ 30న అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ప్ర‌జ‌ల్లో టీడీపీ అభిమానులు, అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గం ఆద‌ర‌ణ చూర‌గొనేందుకు రాజ‌కీయ పార్టీలు త‌మ‌దైన పొలిటిక‌ల్ గేమ్ ఆడుతున్నాయి.

బీఆర్ఎస్ అత్య‌ధికంగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి సీట్లు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. దీంతో తెలంగాణ రాజ‌కీయాల్లో ఆధిప‌త్యం చెలాయించే ఆ సామాజిక వ‌ర్గం ఓట్లు గంప‌గుత్త‌గా త‌మ‌కే ప‌డ‌తాయ‌నే న‌మ్మ‌కంతో బీఆర్ఎస్ వుంది. ఇక కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే మాజీ ఎంపీ రేణుకాచౌద‌రి నేతృత్వంలో క‌మ్మ సంఘం నేత‌లు ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ‌లో 30 నియోజ‌క‌వ‌ర్గాల్లో తాము ప్ర‌భావం చూప‌గ‌ల‌మ‌ని, కావున క‌నీసం 10-12 సీట్లు ఇవ్వాల‌ని కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ అత్య‌ధికంగా రెడ్ల‌కు సీట్లు ఇవ్వ‌డం, టీపీసీసీ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు శిష్యుడైన రేవంత్‌రెడ్డి వుండ‌డంతో క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట్లు త‌మ‌కే ప‌డ‌తాయ‌ని కాంగ్రెస్ నేత‌లు న‌మ్మ‌కంతో ఉన్నారు. దీంతో బీజేపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపింది. చంద్ర‌బాబు అరెస్ట్‌పై ఏపీ బీజేపీ నేత‌ల కంటే తెలంగాణ నేత‌లే ఎక్కువ‌గా స్పందించారు. అంతేకాదు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ద‌గ్గ‌రికి లోకేశ్‌ను తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి తీసుకెళ్లారు.

73 ఏళ్ల వ‌య‌సున్న చంద్ర‌బాబును అరెస్ట్ చేయ‌డం బాధాక‌ర‌మ‌ని అమిత్‌షా త‌న‌తో ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు లోకేశ్ అన్నారు. ఈ కామెంట్స్ వ‌ల్ల బీజేపీపై నెగెటివిటీ త‌గ్గుతుంద‌ని ఆ పార్టీ ఆశిస్తోంది. ఇదంతా ఓట్ల కోస‌మే అని చిన్న‌పిల్లల్ని అడిగినా చెబుతారు. చంద్ర‌బాబు అరెస్ట్ వెనుక కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉన్నార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. దీంతో చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం బీజేపీపై గుర్రుగా ఉంద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఆరోగ్యంపై ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబు అరెస్ట్‌ను నిర‌సిస్తూ టీడీపీ సానుభూతిప‌రులు ఆందోళ‌న‌లు చేప‌ట్ట‌డాన్ని కేటీఆర్ త‌ప్పు ప‌ట్ట‌డంపై టీడీపీ గుర్రుగా వుంది. ఎన్నిక‌ల్లో ఇది బీఆర్ఎస్‌కు న‌ష్టం చేస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. దీంతో కేటీఆర్ న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని స‌మాచారం.

ముందుగా లోకేశ్ ట్వీట్ గురించి తెలుసుకుందాం. “భ‌ద్ర‌త‌లేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయ‌న‌కి ప్రాణ‌హాని తల‌పెడుతున్నారు. ఎన్న‌డూ ఏ త‌ప్పూ చేయ‌ని 73 ఏళ్ల చంద్ర‌బాబు ప‌ట్ల రాక్ష‌సంగా వ్య‌వ‌హ‌రిస్తోంది ఈ ప్ర‌భుత్వం. వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్ర‌బాబు గారిని అనారోగ్య కార‌ణాల‌తో అంత‌మొందించే ప్ర‌ణాళిక ఏదో ర‌చిస్తున్నారు. చంద్ర‌బాబు గారి ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్ప‌దంగా ఉంది. జ్యుడీషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న చంద్ర‌బాబు గారిని ముద్దాయి అని హెల్త్ బులెటిన్లో ప‌దే ప‌దే పేర్కొనేందుకు పెట్టిన శ్ర‌ద్ధ ఆయ‌న ఆరోగ్యం, భ‌ద్ర‌త‌పై పెట్ట‌డంలేదు. చంద్ర‌బాబు గారికి ఏ హాని జ‌రిగినా, సైకోజ‌గ‌న్ స‌ర్కారు, జైలు అధికారుల‌దే బాధ్య‌త” అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌పై కేటీఆర్ త‌న‌దైన శైలిలో మాన‌వ‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. లోకేశ్ ట్వీట్ చూసి బాధ అనిపించింద‌న్నారు. చంద్ర‌బాబు భ‌ద్రత విష‌యంలో లోకేశ్ వ్య‌క్తం చేసిన ఆందోళ‌న‌ను ఒక కొడుకుగా అర్థం చేసుకోగ‌ల‌న‌ని ఆయ‌న అన్నారు. లోకేశ్ చెప్పింది వాస్త‌వం అయితే ఈ ప‌రిస్థితి బాధాక‌ర‌మ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో త‌న‌కు నిజానిజాలు తెలియ‌వ‌ని కేటీఆర్ అన‌డం విశేషం. కానీ చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌కు ప్ర‌మాదం అయితే రాజ‌కీయాల్లో ఇది దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. లోకేశ్‌కు కేటీఆర్‌ సానుభూతి తెల‌ప‌డం గ‌మ‌నార్హం. నిమ్స్ ఆస్ప‌త్రిలో కేసీఆర్ దీక్ష చేస్తున్న‌ప్పుడు ఆయ‌న ఆరోగ్యంపై తాము ఆందోళ‌న చెందిన విష‌యాన్ని కేటీఆర్ గుర్తు చేయ‌డం విశేషం. రెండు పార్టీల మ‌ధ్య ఉన్న రాజ‌కీయాల్లోకి తెలంగాణ‌ను లాగ‌వ‌ద్ద‌ని ఆయ‌న మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేశారు.

మాట‌ల్లో మాత్రం ప్రేమ‌, చేత‌ల్లో మాత్రం సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై అభిమానం చూపుతున్న వైనం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభిమానులు, చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం ఓట్లు రాబ‌ట్టుకునేందుకు బీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేత‌లు త‌మ‌దైన న‌ట‌న ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

లేదంటే హైద‌రాబాద్‌లో ఆంధ్రా పంచాయితీ ఏంద‌ని ప్ర‌శ్నించిన కేటీఆర్‌కు ఉన్న‌ట్టుండి లోకేశ్‌పై ప్రేమ పుట్ట‌డం, 20 రోజులుగా ఢిల్లీలో అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం ప‌డిగాపులు కాసినా ప‌ట్టించుకోని హోంమంత్రి… అక‌స్మాత్తుగా పిలిచి ఓదార్చ‌డం …చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌పై ప్రేమ అని న‌మ్మాలా? ఇదే క‌మ్మ‌సామాజిక వ‌ర్గానికి అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌లా మిగిలింది.