పవన్ తీరు మారాలి..
మారమని చెప్పాలి..
మారకుంటే ఏం చేద్దాం…
ఇలా అయితే మరోసారి కాపు సామాజిక వర్గానికి భంగపాటు తప్పదు.
అదే జరిగితే కాపులు జీవితకాలం నష్టపోతారు.
ఈ సుద్దులు.. ఈ మాటలు.. ఎవరివో కాదు. కాపు నాయకులవే. పార్టీలతో సంబంధం లేకుండా కాపులు పైకి రావాలని, అధికారం చేపట్టాలని తపన చెందుతున్న కాపు నాయకుల మాటలు ఇవి. ఆంధ్రకు చెందిన కీలక కాపు నాయకులు, ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో వుంటున్న కాపు నాయకులు తరచు టచ్ లోనే వుంటారు. అదేం పెద్ద విశేషం కాదు. మారుతున్న రాజకీయ సమీకరణాలు, పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల దాదాపు అర డజను మంది కాపు నాయకులు గ్రూపుగా ఏర్పడి అభిప్రాయాలు పంచుకున్నారని తెలుస్తోంది. వీరి అభిప్రాయాలు జనసేన నేత పవన్ కు కాస్త అనుకూలంగానే వున్నాయి కానీ, కాస్త ఆందోళన కూడా వీరి చర్చల్లో తొంగి చూసిందని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
పవన్‌కు వస్తన్న క్రేజ్ బాగుంది. పవన్ వెళ్తున్న పర్యటన తీరు బాగుంది. గతంలో కన్నా పవన్ ఇప్పుడు బాగా యాక్టివ్ అయ్యారు. ఇదో మంచి పరిణామం. పవన్ ఎన్నికల వరకు ఇదే జోష్‌ను బ్రేక్ లేకుండా కొనసాగిస్తే బాగుంటుంది.
ఇవీ కాపు నాయకుల గ్రూప్ కాల్ సమావేశంలో డిస్కషన్ కు వచ్చిన పాజిటివ్ పాయింట్లు.
కానీ పవన్ ప్రసంగాల తీరు బాగాలేదు. ప్రజల్ని కేరింతలు కొట్టించడానికి మాత్రమే ఇవి పనికి వస్తాయి. అసలు పవన్ తమ పార్టీ ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తుంది అన్నది క్లారిటీ తెచ్చుకోవాలి. అప్పుడు అక్కడ గట్టిగా టార్గెట్ చేయాలి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీకి కావాల్సిన చోట, కమ్మ సామాజిక వర్గం ఇబ్బందిగా ఫీలవుతున్న చోట పవన్ కావాలని, ఆ పార్టీకి అనుకూలంగా తన ప్రసంగాలు సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల జనాల్లో పవన్ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి పనికి వచ్చే వైఖరి అవలంబిస్తూ, కేవలం జగన్ ను టార్గెట్ చేస్తన్న ఫీలింగ్ కలుగుతోంది.
ఈ వ్యూహం కనుక సక్సెస్ అయితే ఓకె. పవన్ ఆశించినట్లు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఓకె. అలా కాక మళ్లీ జగన్ నే కనుక అధికారంలోకి వస్తే కాపులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం వుంది. ఎవరైతే ఆర్థికంగా బలంగా వుండి, పవన్ వెనుక వున్నారో ఆ కాపు నాయకులను భవిష్యత్ లో వైకాపా టార్గెట్ చేసే ప్రమాదం వుంది.
అలాగే అసలు పవన్ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారో అర్థం కావడం లేదు అన్నది కాపు నాయకుల్లో చర్చకు వచ్చిన మరో కీలకపాయింట్. కమ్మ సామాజిక వర్గం, దానికి దన్నుగా వున్న మీడియా, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, లోకేష్ ఇలా అందరూ తమ తమ బలాలను, బలగాలను మోహరించి, వైకాపాను గద్దె దించాలని కంకణం కట్టుకుని, జగన్ వ్యక్తిత్వ హననానికి తెగబడుతూ, నానా విషయాలు ప్రచారం చేస్తున్నది కేవలం అయిదేళ్ల అధికారం కోసమా? వేల కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేయడం అన్నది కేవలం తండ్రిని అయిదేళ్లు అధికారంలో వుంచి తాను తప్పుకోవడం కోసమా? జగన్ ను గద్దె దించేస్తే కాపుల ఆశ నెరవేరిపోతుందా? అధికారం వచ్చేస్తుందా? పవన్ సిఎమ్ అయిపోతారా?
నిజంగానే జగన్ ఓడిపోయి, చంద్రబాబు పవర్ లోకి వచ్చారు అనుకుందాం. 2029లో పవన్ లేదా కాపుల స్ట్రాటజీ ఏమై వుండాల్సి వుంటుంది. చంద్రబాబును ఢీకొట్టాల్సి వుంటుంది. అప్పుడు కూడా ప్రతిపక్షంలో (వుంటే) జగన్ ను టార్గెట్ చేయడం కాదు. చంద్రబాబును లేదా కమ్మ సామాజిక వర్గాన్ని ఢీ కొట్టి ఒక్క రోజు పవన్ తట్టుకోగలరా? పవన్ తమకు ఎదురు తిరుగుతున్నారని గమనించిన మరుక్షణం తెలుగుదేశం అను కుల మీడియా యాక్టివేట్ అయితే పవన్ తట్టుకోగలరా? అలా తట్టుకుని 2029లో అధికారం సాధించడం సాధ్యమేనా?
ఇవీ కాపు నాయకులు డిస్కస్ చేసిన పాయింట్లు.
అదే కనుక ఇప్పుడు జగన్‌ను, బాబును ఇద్దరినీ టార్గెట్ చేస్తే జగన్ మళ్లీ గెలిచేయవచ్చు. ఆ ప్రమాదం వుంది. కానీ బాబు, ఆయన పార్టీ పూర్తిగా తెరమీద నుంచి తొలగిపోతాయి. 2029లో జగన్‌ను టార్గెట్ చేస్తే తెలుగుదేశం అనుకుల మీడియా ఎలాగూ మద్దుతు ఇస్తుంది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇంకా పెరుగుతుంది. ఈ అయిదేళ్లు గట్టిగా కష్టపడితే పార్టీని బలోపేత చేసుకోవచ్చు.అప్పుడు 2029 లో నేరుగా అధికారంలోకి రావడానికి జనసేనకు చాన్స్ ఎక్కువగా వుంటుంది.
ఈ దిశగా పవన్ ఎందుకు ఆలోచించడం లేదు? ఎందుకు గుడ్డిగా, పట్టుదలగా చంద్రబాబుకు అధికారం అప్పగించాలని ప్రయత్నిస్తన్నారు. ఒకసారి చంద్రబాబుకు అధికారం ఇస్తే మళ్లీ పవన్‌కు చాన్స్ వస్తుందా? రానిస్తారా? ఈ దిశగా పవన్ ఎందుకు ఆలోచించడం లేదు?
ఇవన్నీ డిస్కస్ చేసిన కాపు నాయకులు తమ కింది, తోటి నాయకులకు ఏం చెప్పాలి? ఎలా దిశానిర్దేశం చేయాలి అన్నది డిసైడ్ కాలేదు. ఎన్నికల ముందు వరకు వేచి చూడాల్సందే అది. భాజపా స్టాండ్ ఎలా వుంటుందో? పవన్ కు బాబు ఎన్ని సీట్లు ఇస్తారో? ఇలాంటివి అన్నీ చూసిన తరువాత కాపుల వైఖరిని డిసైడ్ చేసుకోవాల్సి వుంటుందని మాత్రం ముక్తాయించి, సమావేశం ముగించినట్లు తెలుస్తోంది.