స్వాతంత్ర్యం రావడానికి ఇంచుమించుగా దశాబ్దం కిందటి ఉదంతం ఇది. బొబ్బిలి రాజా వారి సంస్థానం వెలుపల ఒక పెద్ద ఢంకా ఉండేది. కాలప్రమాణాలను పుర ప్రజలకు తెలియజేస్తూ ఆ పెద్ద డప్పును ప్రతిరోజూ ఉదయాస్తమాన వేళల్లో ఓ వ్యక్తి వచ్చి మోగించేవాడు. దానిని బట్టి పురప్రజలకు సమయం అంచనాగా తెలిసేది. అలా డప్పు మోగించే ఆ వ్యక్తి దళితుడు. వాడి ఒంటిమీద గోచీ తప్ప మరొక గుడ్డపేలిక ఏమీ ఉండేది కాదు. ఒక పూట తింటే మరొక పూట వెతుకులాడుకునే బతుకు.
ఇదిలా ఉండగా ఆ రాజవీధిలోనే రాజోద్యోగం వెలగబెడుతున్న కుటుంబాలు అనేకం ఉండేవి. అందులో ఓ అగ్రవర్ణాల ఇంటికి చెందిన ఏడెనిమిదేళ్ల పసివాడికి.. సదరు దళితుడు ప్రతి ఉదయమూ, సాయంత్రమూ వచ్చి వాయించే డప్పు మోత అంటే ఒక కుశాల, ఆసక్తి. ప్రతి రోజూ వెళ్లి అతడు డప్పు మోగిస్తుండగా.. తాను పక్కనే అరుగుమీద కూర్చుని చూస్తుండేవాడు.
ఇలా గడుస్తుండగా, ఒకనాడు సదరు డప్పువాడు.. ఆ పసివాడిని ఓ ప్రశ్న అడిగాడు. ‘సోమీ.. గాందీగారు ఎప్పుడొస్తారు?’ అని! ఆ పిల్లవాడు విద్యావంతులైన అగ్రవర్ణాల కుటుంబానికి చెందిన వాడు గనుక.. వాళ్లు పత్రికలు చదవడం, వార్తలు వినడం చేస్తుంటారు గనుక.. వారికి సమాచార పరిజ్ఞానం అందుబాటులో ఉంటుందని ఆ దళితుడి నమ్మకం. అందుకే అడిగాడు. ‘గాందీగారు రావడం’ అంటే ఏమిటో, అది ఎప్పుడు జరుగుతుందో నిజంగానే ఆ పిల్లవాడికి తెలియదు. అయితే-
‘‘నీకెందుకురా’’ అని అడిగాడు పసివాడు.
‘‘గాందీగారొస్తే మా బతుకులు మారిపోతాయంట’’ అన్నాడా డప్పువాడు.
గాందీగారె ప్పుడొస్తారో తనకు తెలియదనే చెప్పాడా పసివాడు.
అడగాలనే ఉత్సాహమే తప్ప తెలుసుకోగలననే నమ్మకం ఆ డప్పువాడికి కూడా లేదు గనుక.. అక్కడితో అది అయిపోయింది.
ఇంతకూ గాందీ గారు రావడం అంటే ఏమిటి? అప్పటికి మహాత్మా గాంధీ దేశమంతా విస్తృతంగా తిరుగుతున్నారు. స్వాతంత్ర్యోద్యమ పోరాటంలోకి సామాన్య జనాన్ని వేల సంఖ్యలో ఆకర్షిస్తున్నారు. ఆయన కష్టఫలితంగా.. స్వాతంత్ర్య పోరాటం దేశమంతటా మూలమూలలకు విస్తరిస్తున్నది. కూటికి గతిలేని పేదలెంతో మంది పోరాటంలోకి దిగుతున్నారు.
అయితే ఆ డప్పువాడి దృష్టిలో ‘గాందీగోరు రావడం’ అంటే ఏమిటి? వాళ్ల వాడల్లో మాట్లాడుకుంటున్నట్టుగా.. బ్రిటిషోడు దేశాన్ని వదలి వెళ్లిపోతే గాంధీ సారథ్యంలో పరిపాలన సాగుతుందని వాడు, వాడిలాంటి దేశంలోని కొన్ని లక్షల మంది అనుకున్నారు. దళితుల గురించి, నిమ్నవర్గాల గురించి, గతిలేని నిరుపేదల గురించి గాంధీ పదేపదే మాట్లాడుతూ వచ్చిన విషయాలు వారికి అలాంటి ఆశలు కల్పించాయి. బ్రిటిషోడు వెళ్లిపోవడం అంటేనే.. గాంధీ పాలన రావడం అనే భావన వచ్చింది. కానీ తాము అనుకున్నదంతా అబద్ధం అని వాళ్లకు అర్థం కావడానికి బహుశా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొన్ని దశాబ్దాలు పట్టి ఉండొచ్చు.. గాంధీ మరణించిన తర్వాత కూడా.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిపోయాయి. మనం ఏడాది పొడవునా పండగలు చేసుకున్నాం. ఈ 75 ఏళ్లలో ఏం సాధించాం. చెప్పుకోడానికి మనకు చాలా కనిపిస్తాయి. అనేక విషయాల్లో ప్రపంచంలో మనం అగ్రగామి దేశంగా చెలామణీ అవుతున్నాం. ప్రపంచంలో అనేక దేశాల్లో భారతీయులు గణనీయంగా స్థిరపడి.. భారతీయ మూలాలు విశ్వవ్యాప్తమైన ప్రతిభలతో పరిఢవిల్లుతుంటాయని నిరూపిస్తున్నారు. మనకు అద్భుతమైన నగరాలు ఏర్పడ్డాయి, అద్భుతమైన పరిశ్రమలు ఉన్నాయి.. ఉత్పాదక రంగాల్లో ప్రపంచంలోని మేటి దేశాల్లో ఒకరుగా మనకు కూడా గుర్తింపు ఉంది.
ఇవన్నీ కేవలం ఒక్క పార్టీ సొంత డబ్బా కొట్టుకోవడానికి తగినట్టుగా ఏ ఒక్క అయిదు- పదేళ్ల కాల వ్యవధిలో సాధించిన పురోగతి కానే కాదు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వమూ తమ వంతుగా ఎంతో కొంత చేస్తూ రావడం వల్ల.. ఇన్నాళ్లకు ఈ స్థితికి మనం చేరుకున్నాం.
అయితే పేదరికాన్ని ఎంతవరకు రూపుమాపగలిగాం? ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆర్థికంగా డబ్బులు పంచిపెడితే తప్ప.. పూటగడవడానికి గతిలేని నిరుపేద కుటుంబాలు ఉంటున్నాయంటే.. ఎవరిని నిందించాలి? ఆ పాపాన్ని ఏ ప్రభుత్వాలు మోయాలి?
వయసుడిగిపోయిన వారి బాగోగులను, మంచిచెడులను, పోషణను వారి కడుపున పుట్టిన వారు, వారి ప్రాపకంలో పెంపకంలో ఎదిగిన వారు- తమకు చేతనైనంత స్థాయిలో తామే చూసుకోవాలనే బాధ్యతను దేశ ప్రజలకు నేర్పలేక.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వేలం పాటలాగా పెన్షన్లు పెంచుకుంటూ పోయే ప్రభుత్వాలు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాయి? ప్రజలు తమ బతుకు తాము బతకలేని దుస్థితిని- తమ సంక్షేమ గానాలాపనలకు ఆలంబనగా వాడుకుంటూ ఉంటే ఆ పోకడలను అసహ్యించుకోకుండా ఎలా ఉండగలం?
మనం చెప్పుకున్న ఉదంతంలో డప్పువాడు దళితుడు. ఆ వర్గానికి చెందిన బతుకులు ఎంత మేర బాగుపడ్డాయి. ఎదిగిన కుటుంబాలు లేవని అనడం ఆత్మవంచన. అయితే, ఎన్ని దళితవాడలు అదృశ్యం అయ్యాయి. దళితులు సమూలంగా తరలివచ్చి ఇతరత్రా సాధారణ జనజీవన స్రవంతిలో కలవగలిగారు. సంపదలపరంగా ఒక ఎత్తులో ఉన్న వారికే నిచ్చన మెట్లు కూడా అంది వచ్చాయని అనుకోవాలా?
ఆధునికతరానికి చెందిన వారంతా అమెరికాలోనో, ఇతర విదేశాల్లోనో స్థిరపడడం వలన ఊరు ఊరంతా తాళాలు వేసిన విశాలమైన లోగిళ్లున్న ఇళ్లతో మనకు కొన్ని పల్లెలు కనిపిస్తుంటాయి. ఆ నిర్జన గ్రామాలన్నీ ఎవరికైనా గుండె కలుక్కుమనిపించవచ్చు గానీ.. ఒక రకానికి చెందిన ప్రగతికి చిహ్నాలే! ఆ రకంగా ఎన్ని దళితవాడలు.. అక్కడి జనం ‘ఎదిగి’ ఇతర ప్రాంతాలకు వలసపోవడం వలన ఖాళీ అయ్యాయి.. లేదా, అదృశ్యం అయ్యాయి? ఇలాంటిది మనకు ఒక్క ఉదాహరణ కూడా దొరక్కపోవచ్చు.
దరిద్రం ఏంటంటే.. దళితులను అక్కడి నుంచి బయటకు రానివ్వకుండా ఎప్పటికీ అక్కడే ఉంచేయడానికి మన ప్రభుత్వాలు మరింత కొత్త సంక్షేమ ఎత్తుగడలు వేస్తుంటాయి!
75 ఏళ్లు దాటిపోయిన స్వాతంత్ర్యం ద్వారా సాధించదగినది ఇంతమాత్రమేనా? ఈ దేశంలో అభివృద్ధి జరగలేదని అంటే దుర్మార్గం అవుతుంది. ఎన్నో అద్భుతాలు జరిగాయి. కానీ.. సామాన్యుల జీవితాల్లో రాదగిన ఎంతో మార్పు, రాకుండా ఆ జీవితాల్లో స్తబ్ధంగానే ఉండిపోతున్నాయి. పండగ చేసుకునే ముందు ప్రభుత్వాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పొందిన స్వాతంత్ర్యానికి ఏడాదిగా అమృతోత్సవాలు చేసుకున్న మనం.. ఆ అమృతం ఎండిన ఆత్మలను శోధించుకోవాలి.
పేదల జీవితాల్లో వాస్తవమైన వికాసానికి ఏం చేయగలరో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఒక్క విషయం మాత్రం నిజం. సమాజంలో కులపరమైన తారతమ్యాలు నిన్న ఉన్నవి, నిన్న ఉన్నంతగా నేడు లేవు. కులాలు అనేవి కేవలం రాజకీయ బలసమీకరణల అమ్ములపొదుల్లాగా మారిపోయాయి. సమాజాన్ని చీలుస్తున్న విభజనరేఖలుగా ఆర్థిక తారతమ్యాలు మాత్రమే ఎదిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులను స్పృహలో ఉంచుకుని, ‘గాందీగోరు వొస్తే’ ఏదో జరుగుతుందని ఎన్నో దశాబ్దాల కిందట పేదవాడు కన్న కల.. ఇప్పటికైనా సాకారం అవుతుందేమో అన్వేషించాలి.
..కె.ఎ. మునిసురేష్ పిళ్లె