కేటీఆర్/కేసీఆర్ ఇప్పటికైనా తెలిసి వస్తుందా?

తెలంగాణ ఉద్యమం వెనుక ఏం జరిగింది? ఆంధ్ర జనాలను తమను దోచుకుంటున్నారు అని తెలంగాణ నేతలు ఎందుకు అన్నారు. అంతకు ముందుగా అసలు భారతీయ జనతా పార్టీలోని తెలంగాణ నాయకులు, ఆంధ్ర నాయకుల పెత్తనం…

తెలంగాణ ఉద్యమం వెనుక ఏం జరిగింది? ఆంధ్ర జనాలను తమను దోచుకుంటున్నారు అని తెలంగాణ నేతలు ఎందుకు అన్నారు. అంతకు ముందుగా అసలు భారతీయ జనతా పార్టీలోని తెలంగాణ నాయకులు, ఆంధ్ర నాయకుల పెత్తనం సహించలేకనే కదా, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్న తీర్మానానికి శ్రీకారం చుట్టింది. ఎంత కాదన్నా వామపక్షాలు అయినా, భాజపా అయినా కమ్మ.. రెడ్డి పోరు అన్నది పచ్చి వాస్తవం. దాని నేపథ్యంలోనే ఏ రకాల మాటలు నర్మగర్భంగా మాట్లాడినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఎన్ని కతలు పోయినా దాని వెనుక ఈ కమ్మ-రెడ్డి ఫ్యాక్టర్ వుందన్నది అంగీకరించాల్సి వాస్తవం.

తెలంగాణ ఏర్పడుకుండా ఎక్కువగా పోరాడింది ఎవరు. అడ్డం పడే ప్రయత్నం చేసింది ఎవరు? వారిలో కమ్మ వారు ఎంత మంది? రెడ్లు ఎంత మంది? తెలంగాణ ఉద్యమ సమయంలో రామోజీ ఫిలిం సిటీని వేయి నాగళ్లతో దున్నుతామని అన్నది ఎందుకు? ఎవరెవరు తమ భవనాలపై రాళ్లు పగడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అన్నది అందరికీ తెలిసిందే.

ఎన్నికల తరువాత ఏం జరిగింది? కేసీఆర్/కేటీఆర్ కక్షలు పెట్టుకోలేదు. అందరినీ చేరదీసారు. ఓడిపోయిన తుమ్మలను మంత్రిని చేసారు. ఆయన కేసీఆర్ స్వయంగా రామోజీ రావు దగ్గరకు తీసుకెళ్లారు. కేసీఆర్ నాగళ్లను మూల పెట్టారు. ఫిలిం సిటీ దున్నాలి అని చెప్పడం లేదు. అందరినీ కలుపుకుని వెళ్లడంలో కేసీఆర్/కేటీఆర్ చూపించిన బాట చాలా మంచి బాట. క్షత్రియులందరినీ కేటీఆర్ ఆదరించారు. కమ్మవారికి అనేక కాంట్రాక్టులు ఇచ్చారు. గడచిన ఆరు నెలలు, ఏడాది కాలంగా కమ్మవారు అనేక మంది అనేక విధాలుగా లాభ పడ్డారు. అందులో సందేహం లేదు.

కేసీఆర్/కేటీఆర్ ఎవ్వరినీ నిరాకరించలేదు. నిరాదరించలేదు. రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ ఇలా అందరు సెటిలర్లను సమాదరించారు. రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా, తేదేపా, ఇలా వాళ్లకు వేరే వేరే విధమైన లెక్కలు వుండొచ్చు. మంత్రి పదవులు ఇచ్చారు. కాంట్రాక్టులు ఇచ్చారు. భూమి సెటిల్ మెంట్లు జరిగాయి. విలువైన భూములు దక్కిన వాళ్లకు దక్కాయి. అన్నీ జరిగినా ఎందుకో సెటిలర్లలోని ఓ వర్గానికి అసంతృప్తి.

ఎందుకంటే జగన్ కు 2019లో కేసీఆర్ సాయిం చేసారు. అదీ ఒకే ఒక రీజన్. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ గెలిస్తే జగన్ కు సాయం చేస్తారేమో? అదీ బలమైన రీజన్. అప్పటికీ భాజపాకు కాస్త ఆశ చూపారు. మద్దతు ఇచ్చే లా బల ప్రదర్శన చేసారు. కానీ భాజపా దిగలేదు. దాంతో ఇక శతృవు మిత్రుడు తమకు శతృవే అన్న నిర్ణయానికి వచ్చేసారు. ఇక్కడ కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఎలాగైనా మళ్లీ మేనేజ్ చేసుకోవచ్చు. ఆంధ్రలో జగన్ వస్తే మాత్రం కష్టం. అందుకే కేసీఆర్‌ను కూడా వ్యతిరేకించాలి అనే నిర్ణయానికి వచ్చేసారు.

ఇప్పుడు సెటిలర్లలోని కమ్మ సామాజిక వర్గం బలంగా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్‌ను గద్దెనెక్కించాలని అన్నది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ సంగతి కేసీఆర్/కేటీఆర్ లకు తెలియదా? తెలుసు. అసలు కమ్మ వర్గం ఎందుకు ద్వేషిస్తోందో తెలుసు. అందుకే వాళ్లను ఆకట్టుకునేలాంటి స్టేట్ మెంట్ లు ఇస్తూ వస్తున్నారు. దీనివల్ల హార్డ్ కోర్ ఓటు బ్యాంక్ కేసీఆర్ వైపు మళ్లుతుంది అని అనుకోవడానికి లేదు.

గమ్మత్తేమిటంటే ఆంధ్రలో చేతులు కలిపి కమ్మ-కాపు పార్టీలు రెండూ తెలంగాణలో కాంగ్రెస్.. భాజపా వైపు నిలబడడం. ఇదెక్కడి రాజకీయమో వాళ్లకే తెలియాలి.కూకట్ పల్లిలో జనసేన పోటీ చేస్తే అక్కడున్న కమ్మవారంతా కాంగ్రెస్ ను కాదని జనసేనకు ఓటేస్తారా? చూడాలి.

మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ కు జవసత్వాలు తేవడంలో సెటిలర్లది ప్రధాన పాత్ర అని కనిపిస్తూనే వుంది. సెటిలర్లు అనే పదం వాడితే చాలా మంది అంగీకరించకపోవచ్చు. సెటిలర్లలోని కమ్మ సామాజిక వర్గం అంటే క్లారిటీగా వుంటుందనీ అనొచ్చు. మరి ఇలాంటి నేపథ్యంలో భవిష్యత్ ఎలా వుండబోతోంది?

గతంలో మాదిరిగానే కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్, సినిమా రంగం, పదవులు ఇంకా ఇంకా అనేక విషయాల్లో కమ్మవారికి స్నేహ హస్తం చాచి అక్కున పెట్టుకున్న కేసీఆర్ వైఖరి అలాగే వుంటుందా? మారుతుందా? అది అసలు సిసలు ప్రశ్న. ఎంత సాయం చేసినా, ఎంత స్నేహం చేసినా, తెలుగుదేశం ప్రయోజనాల తరువాతే ఏదైనా అనే ఆ వర్గం వైఖరి మీద కేసీఆర్ కు మరింత క్లారిటీ వస్తుందా? వస్తే భవిష్యత్ లో కేసీఆర్ వైఖరి ఎలా వుంటుంది..

ఇవన్నీ డిసెంబర్ లో జవాబు దొరికే ప్రశ్నలు.