వామపక్షాలకు వేరే ఆప్షన్ వుందా?

తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఆంధ్రలో అస్తిత్వం కోల్పోయిన పార్టీల జాబితాలో వామపక్షాలు కూడా వున్నాయి. తెలుగుదేశంతో తెర ముందు, తెరవెనుక దోస్తీ చేసి భాజపా ఎలా అయితే ఎదుగు బొదుగు లేని మరుగుజ్జు…

తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఆంధ్రలో అస్తిత్వం కోల్పోయిన పార్టీల జాబితాలో వామపక్షాలు కూడా వున్నాయి. తెలుగుదేశంతో తెర ముందు, తెరవెనుక దోస్తీ చేసి భాజపా ఎలా అయితే ఎదుగు బొదుగు లేని మరుగుజ్జు పార్టీగా మిగిలిపోయిందో, వామ పక్షాల పరిస్థితి కూడా అంతే.

జనం భావజాలాన్ని పట్టించుకొకుండా, ఏదో ఒక పార్టీని పట్టుకుని ముందుకు వెళ్లడంతో స్వంత బలం అన్నది రాను రాను తగ్గిపోయింది. వామ పక్షాల్లో కూడా కొంత మంది నాయకులు సామాజిక సమీకరణలకు లొంగి తెలుగుదేశానికి గుడ్డిగా మద్దతు పలకడం కూడా వారి బలహీనతకు కారణమైంది.

గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచిన ఆ రెండు పార్టీలు ఇప్పుడు పాపం ఇబ్బందుల్లో పడ్డాయి. తెలుగుదేశం పార్టీ కోరి మరీ భాజపాతో జమకట్టే ప్రయత్నం చేయడంతో, వామపక్షాలకు దిక్కు తోచని పరిస్థితి. ఒంటరిగా పోరాడేంత సీన్ లేదు. అలా అని భాజపాతో కూడిన తెలుగుదేశం వెనుక వెళ్లలేదు. అందువల్ల ఇక మిగిలిన ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ తో జత కట్టడం. చిరకాలంగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ కు దూరమయ్యారు. ఇప్పుడు అదే దిక్కయింది.

నిజానికి షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వచ్చి, హడావుడి చేయకపోయి వుంటే ఈ అవకాశం కూడా వుండేది కాదు. కాంగ్రెస్ పార్టీకే 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులు లేరు. అందువల్ల వామపక్షాలకు కోరినన్ని సీట్లు ఇవ్వడం సమస్య ఏమీ కాదు. ఇలా చేయడం వల్ల అంటే కాంగ్రెస్ తో జత కట్టడం వల్ల తేదేపాకు రావాల్సిన ఓట్లను చీల్చేస్తారన్న భయం ఏమీ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ అంటూ ఏమీ మిగలలేదు.. వామ పక్షాల పరిస్థితి కూడా డిటో.. డిటో.

కార్మిక సంఘాలు వున్న కొన్ని ప్రాంతాల్లో ఏదో కాస్త హడావుడి చేయడానికి ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు పోకుండా ఎన్నో కొన్ని శాతం ఓట్లు తెచ్చుకుని మనుగడ సాగించడానికి తప్పితే వామపక్షాలు ఈ పొత్తుతో, పోటీతో సాధించేది పెద్దగా ఏమీ వుండదు. భాజపా ఎవరితో వుంటే వారిని వదిలేసి మిగిలిన వారి చిటికెన వేలు పట్టుకుని ముందుకు వెళ్లిపోవడమే. ఇదే ఇజం ఇప్పుడు.