లోకేష్ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారా?

తండ్రి జైలులో వున్నారు. తల్లి, భార్య ఒంటరిగా రాజమండ్రిలో వున్నారు. లోకేష్ మాత్రం ఢిల్లీలో వున్నారు. పెద్దగా పనులు ఏమున్నాయి అంటే మాత్రం బయటకు ఏవీ కనిపించలేదు. వున్నట్లుండి ఢిల్లీ వెళ్లిపోయారు తండ్రి అరెస్ట్…

తండ్రి జైలులో వున్నారు. తల్లి, భార్య ఒంటరిగా రాజమండ్రిలో వున్నారు. లోకేష్ మాత్రం ఢిల్లీలో వున్నారు. పెద్దగా పనులు ఏమున్నాయి అంటే మాత్రం బయటకు ఏవీ కనిపించలేదు. వున్నట్లుండి ఢిల్లీ వెళ్లిపోయారు తండ్రి అరెస్ట్ అయ్యాక. అందరికీ అదే ఆశ్చర్యం. 

అర్జంట్‌గా రెండు మూడు మీడియా మీట్‌లు తప్ప లోకేష్ అక్కడకు వెళ్లి చేసిన పని బయటకు ఏమీ కనిపించలేదు. ఢిల్లీలో లోకేష్ చేస్తున్న యాక్టివిటీ అంటూ ఏదీ కాంక్రీట్ గా బయటకు రాలేదు. అర్జెంట్ గా ఇక్కడ అన్ని పనులు వదిలేసుకుని ఢిల్లీలో కూర్చుని చేసేంత పనులు ఏవీ అయితే బయటకు రాలేదు. పైగా కీలకమైన వాదనలు వున్న 19 వ తేదీకి కూడా లోకేష్ ఇక్కడకు రాలేదు. ఇదంతా అరెస్ట్ చేస్తారని భయమేనా? ఇంకేదన్నా వుందా?

రాజకీయ వర్గాల బోగట్టా మాత్రం వేరుగా వుంది. సిఎమ్ రమేష్, సుజన చౌదరి తదితరుల సాయంతో ఢిల్లీలో లోకేష్ పలు కార్యక్రమాలు చక్కదిద్దుకునే పనిలో వున్నారని చెబుతున్నారు. భాజపాను కూడా మిత్రపక్షం చేసుకుని, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, మంత్రి పదవులు తీసుకునేందుకు ఒప్పించే పనిలో వున్నారని అంటున్నారు. 

గతంలో భాజపా కూడా తేదేపా మంత్రి వర్గంలో వుంది. అందుకే మరోసారి అలాంటి ఆఫర్‌నే ఇస్తున్నారని టాక్. అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారని కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అపాయింట్ మెంట్ దొరికే వరకు ఈ విషయాన్ని గుట్టుగా వుంచారని, అపాయింట్ మెంట్ దొరికితే, ఆంధ్రలో వ్యవస్థల దుర్వినియోగం మీద వినతిపత్రం ఇచ్చి వస్తారని అంటున్నారు. 

నిజానికి నిన్ననే లోకేష్ రావాల్సి వుంది. వస్తే అరెస్ట్ చేస్తారని తెలుగుదేశం అనుకూల చానెళ్లే హడావుడి చేసాయి. కానీ లోకేష్ రాలేదు. బహుశా ఇవ్వాళ తన తండ్రి కేసులో అనుకూల పరిణామాలు ఏర్పడితే రావచ్చేమో?