రాజకీయ సన్యాసం కాదు గానీ.. పదవుల నుంచి సన్యాసం తీసుకుంటానన్నట్లుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇప్పటికే మూడు దఫాలుగా ఈ పదవిలో ఉన్నానని, తాను తప్పుకొని కొత్తవారికి అవకాశం ఇస్తానని ఆయన ప్రకటించారు.
అయితే చంద్రబాబు తర్వాత.. భవిష్య ఆశాకిరణంగా ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీకి తిరుగులేని నేతగా.. ఒంగోలు మహానాడు ‘ప్రొజెక్టు’ చేస్తున్న ఈ నాయకుడి .. ఈ అర్థ సన్యాసం లాంటి మాటలు పార్టీకి ఎంత మేరకు మేలు చేస్తాయి? ఎంత కీడు చేస్తాయి? ఆలోచించాల్సిందే.
నిజానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వంటి ఎన్ని హోదాలతో అయినా లోకేష్ గురించి చెప్పుకోవచ్చు గానీ.. అవన్నీ కూడా కామెడీ హోదాలే! ఆయనకు ఉన్న నికార్సయిన హోదా ‘చంద్రబాబునాయుడు కొడుకు’ అన్నది మాత్రమే.
ఏపీలో తప్ప మరెక్కడా సోదిలో కూడా లేని పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అని విజిటింగ్ కార్డు కొట్టించుకుంటే ఎవరైనా సరే నవ్విపోతారు. అలాగే.. ఆయన మాజీ మంత్రి హోదా ఎలాంటిదో అందరికీ తెలుసు. ప్రజల్లో గెలిచే సత్తా లేక, దొడ్డిదారిలో మంత్రి పదవి పుచ్చుకుని, ఎమ్మెల్సీ అనిపించుకుని.. నామ్ కే వాస్తేగా మాజీ మంత్రిగా మిగిలారు. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు పార్టీ పదవిని త్యాగం చేస్తా కొత్తవారికి అవకాశం ఇస్తా లాంటి డైలాగులు చెబుతున్నారు.
ఇంతకూ నారా లోకేష్ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా ఉంటే ఎంత? పోతే ఎంత? అనేది పార్టీలోని చాలా మంది కార్యకర్తల అభిప్రాయం. చంద్రబాబునాయుడు కొడుకు అన్న ట్యాగ్ లైన్ తో అందరూ ఆయనను నెత్తినపెట్టుకోవడం మినహా.. పార్టీకోసం లోకేష్ చేసింది ఏముందనేది పలువురి ప్రశ్న. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఆయన పదవిని సన్యసిస్తానని అంటున్నారు గానీ.. ఆ పని వ్యవహారంలో వేలుపెట్టి కెలకకుండా ఉంటారా? అనేది అందరికీ పెద్ద డౌటు.
కాంగ్రెసు పార్టీ విషయం గమనిస్తే.. రాహుల్ ఆ పార్టీకి అధ్యక్షుడు కాదు. కానీ.. నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటారు. అధ్యక్షుడికి మించిన అధికారాన్ని ఆయన పార్టీ మీద ప్రదర్శిస్తుంటారు. పార్టీలో కూడా ఆయనకే గౌరవం అదే స్థాయిలో దక్కుతుంటుంది. అందుకే ఆ పార్టీ శవాసనం నుంచి కోలుకోలేని స్థితిలో ఉంది.
లోకేష్ కూడా అదే తీరుగా జాతీయ కార్యదర్శి పదవినుంచి తప్పుకుని.. మరొక తోలుబొమ్మని ఆ పదవిలో కూర్చుండబెట్టి.. తాను రిమోట్ తో వ్యవహారం నడిపించవచ్చునని భావిస్తే గనుక.. మళ్లీ పార్టీ సర్వనాశనం అయ్యే బాటలోనే సాగుతుందనేది తథ్యం.
పదవీ లాలసత లేదనే విషయాన్ని మాటల్లోనూ, టెక్నికల్ గా కాగితాల మీదనూ చూపించడం కాదు. నిజంగా పార్టీని బాగు చేయాలనే ఉద్దేశం వారికి ఉంటే గనుక.. ఆచరణలో దానిని చూపించాలి. నిజమే.. లోకేష్ మూడు దఫాలుగా జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు. పార్టీకి ఉపయోగపడింది మాత్రం సున్నా. అందుకే.. ఆయన ఆ పదవినుంచి తప్పుకుని, వేరొకరికి అప్పగించాలి.