ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడు వేదికపై యువ మహిళా నాయకురాలు కావలి గ్రీష్మ ప్రసాద్ ప్రసంగానికి సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు షాక్‌కు గురయ్యారు. ఇటీవల టీవీ డిబేట్లలో గ్రీష్మ తరచూ కనిపిస్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి తనయే గ్రీష్మ. తల్లి, తాతల వారసురాలిగా ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. స్త్రీ, పురుషులు సమానమంటే ఆమె నెగెటివ్ కోణంలో తీసుకున్నట్టున్నారు. బూతులు, అసభ్య పదజాల ప్రయోగంలో కూడా తామేం తక్కువ కాదని నిరూపించేందుకు తాను ఆద్యురాలు కావాలని గ్రీష్మ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
చదువు, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో పురుషులకు తాము ఏ మాత్రం తక్కువ కాదని గత కొన్నేళ్లుగా మహిళలు నిరూపిస్తున్నారు. రాజకీయ రంగంలో ఇందిరాగాంధీ, సోనియాగాంధీ లాంటి అగ్రమహిళా నాయకుల గురించి చెప్పుకోవచ్చు. అంతరిక్షం వరకూ స్త్రీలు ప్రయాణించి శభాష్ అనిపించుకున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు స్త్రీని ప్రతిరూపంగా భావిస్తాం. సృష్టికి మూలమైన స్త్రీ అంటే మనిషన్న వారెవరైనా గౌరవిస్తారు.
అయితే ఇవాళ మహానాడు వేదిక నుంచి గ్రీష్మ ప్రసంగం విన్న తర్వాత, ఒక మహిళ ఎలా వుండకూడదో నేర్చుకోవాలనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయని చెప్పడానికి బాధగా ఉంది. గ్రీష్మ ప్రసంగం విన్న తర్వాత ఇది కలా? నిజమా? అని తేరుకోడానికి ఎవరికైనా కొంత సమయం పట్టి వుంటుంది. రెండు దశాబ్దాల జర్నలిజం అనుభవం ఉన్న నాకు మొదటిసారి …ఓ ప్రసంగం గురించి కథనం రాయడానికి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఇదే ప్రసంగం ఏ మగాడో చేసి వుంటే ….తాగి మాట్లాడినట్టు విమర్శించే వాళ్లు. అతని మానసిక పరిస్థితి బాగా లేదని అనుమానించే వాళ్లు. ఒళ్లు బలిసి, మదమెక్కి, బరితెగించి మాట్లాడినట్టు తిట్టేవాళ్లు. ఇవే కాదు, ఇంకా ఎన్ని మాటలన్నా తక్కువే. కానీ మాట్లాడింది ఓ ఆడబిడ్డ.
“పులి కడుపున పులే పుడుతాది. చంద్రబాబు కడుపున లోకేశే పుట్టాడు” అనే కామెడీ కామెంట్స్‌ను కాసేపు పక్కన పెడదాం. ఇంతకూ మహానాడులో గ్రీష్మ ప్రసంగం ఎలా సాగిందంటే….
“ఓ వైసీపీ కుక్క ఈ మధ్య నన్నో ప్రశ్న వేసింది. నిన్నెవరైనా రేప్ చేశారా? అని అడిగింది. ఇప్పుడు అడుగుతున్నా….మిస్టర్ సీఎం, మిస్టర్ జగన్‌మోహన్‌రెడ్డి 30 రోజుల్లో 60 మందిని రేప్ చేస్తే, నువ్వు స్విట్జర్లాండ్‌కు వెళ్లి, మీ పెళ్లాంతో పబ్బం గడుపు తావా? నీకు మనస్సాక్షి అనేది లేదా? ఆడవాళ్ల పుస్తెలు తెంచి, నీ పెళ్లాంతో నువ్వు షికార్‌కు వెళ్తావా? జె డ్రగ్స్, జె బ్రాండ్స్ అమ్ముకుని వాటికి వచ్చిన డబ్బుతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మహిళా తాళి తెంపి, నువ్వు పబ్బం గడుపుకుంటావా? నీకు నిద్ర ఎలా పడుతోంది జగన్‌మోహన్‌రెడ్డి?
సార్ (వేదికపై ఉన్న చంద్రబాబును ఉద్దేశించి) ఎవరు ఎన్ని అన్నా మీకు మేము వాగ్దానం చేస్తున్నాం. ఎవడైనా సరే, జగన్‌మోహన్‌రెడ్డి అని ఇంటికొచ్చినా, బస్సు యాత్ర అని వచ్చినా, బస్సులో నుంచి ఈడ్చి ఈడ్చి తంతాం సార్. నా కొడకల్లారా రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. సిగ్గూశరం లేకుండా బస్సులో వెళ్తారా? బస్సులో నుంచి ఈడ్చి తన్నక పోతే (తొడ కొట్టింది) తెలుగుదేశం గడ్డమీద పుట్టినోళ్లం కాదు” అని ఆవేశంతో రెచ్చిపోయారామె.
బహుశా చంద్రబాబుకు ఏం మాట్లాడాలో దిక్కుతోచలేదు. గ్రీష్మ ఇలా మాట్లాడుతుందని ఆయన ఊహించి వుండరు. ఇదే వేదికపై ఆమె తల్లి ప్రతిభాభారతి వుంటే, ఆమె ఫీలింగ్స్ ఏంటో? బహుశా కూతురి ప్రసంగానికి మనసులోనే మౌన రోదన చేసి ఉంటా రామో. ఒకవేళ ఇంట్లో ఉండి, టీవీలో కూతురి ప్రసంగాన్ని విని వుంటే, ఇలాంటి కూతుర్ని ఎందుకు కన్నానా? అని ఆవేదనతో వెక్కివెక్కి ఏడ్చి ఉంటారు.
ఉన్నత రాజకీయ, విద్యావంతుల కుటుంబంలో పుట్టిన గ్రీష్మ ఇలా మాట్లాడ్డం ఏంటి? ప్రత్యర్థులపై విమర్శలు చేసి వుంటే ఎవరికీ అభ్యంతరం వుండేది కాదు. కనీస సభాసంప్రదాయం లేకుండా, నిండుసభలో కొడకల్లారా, ఈడ్చిఈడ్చి తంతాం, పెళ్లాంతో పబ్బం గడుపుకోడానికి స్విటర్జర్లాండ్‌కు వెళ్లావా?….వామ్మో వినడానికే ఇబ్బందిగా ఉంది. మరి మాట్లాడ్డానికి ఆమెకు నోరెలా వచ్చిందో మరి! గుర్తింపు కోసం చిల్లర మాటలు మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కొత్తపల్లి పున్నయ్య 1962లో పొందూరు నుంచి కాంగ్రెస్ తరపున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చీపురుపల్లి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పున్నయ్య సోదరుడు నరసయ్య మూడుసార్లు పొందూరు, పాలకొండ, ఎచ్చెర్ల నుంచి ఎన్నికయ్యారు.
కుటుంబ వారసత్వంగా ప్రతిభాభారతి రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఎచ్చెర్ల నుంచి టీడీపీ తరపున 1983 మొదలుకుని 1999 వరకూ వరుసగా ఐదుసార్లు కావలి ప్రతిభాభారతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా మంచి పేరు సంపాదించారు. 2004లో ఎచ్చెర్ల నుంచి ప్రతిభాభారతి ఓడిపోయారు. ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పడిన రాజాం నుంచి బరిలో నిలిచి ఆమె ఓటమి మూటకట్టుకున్నారు. మాటలో పొదుపు, నడవడికలో హూందాతనం. ప్రతిభాభారతిని చూడగానే ఆరాధన భావంతో చేతులెత్తి దండం పెట్టాలనే భావన కలుగుతుంది. అందుకే ఆమె ప్రత్యర్థి పార్టీల నుంచి కూడా గౌరవం అందుకున్నారు.
అయితే ప్రతిభాభారతి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన గ్రీష్మ , తల్లి, తాతల నుంచి ఏమీ నేర్చుకోలేదనే చేదు వాస్తవం ఇవాళ్టి మహానాడు సభ ద్వారా బయట పడింది. పెద్దల గౌరవమర్యాదల్ని కాపాడాల్సిన బిడ్డలు, కనీసం ఆ పని చేయకపోగా, పరువు పోగొట్టేలా వ్యవహరిస్తే కన్నవారి మనసు ఎంతగా తల్లడిల్లుతుందో ఒక్కసారి తన మాతృమూర్తిని గ్రీష్మ అడిగి తెలుసుకుంటే మంచిది.
జగన్ భార్యతో పబ్బం గడపడానికి స్విట్జర్లాండ్‌కు వెళ్లారనే కామెంట్స్ ఏ సంస్కార పరిధిలోకి వస్తాయో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. జగన్ భార్య కూడా ఒక మహిళే. బస్సు యాత్ర చేస్తున్న వాళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలు. అలాంటి వారిని బస్సులో నుంచి ఈడ్చి ఈడ్చి తంతామని వార్నింగ్ ఇవ్వడానికి నోరెలా వచ్చింది. ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్న మిమ్మల్ని చూసి, ఎలా పెంచావమ్మా? అని తల్లిని సమాజం ప్రశ్నిస్తుంది.
బహుశా తన పెంపకం సమాజ నిలదీతకు కారణమవుతుందనే ఆవేదన ప్రతిభాభారతిని కుంగదీస్తూ వుంటుంది. రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే గ్రీష్మకు కనీసం సొంత పార్టీ వాళ్లైనా హితవు చెబితే బాగుంటుంది. మంచీచెడు, రాజకీయ విచక్షణ గురించి గ్రీష్మకు ఇప్పుడు చెప్పకపోతే, ఆమె చెడును కోరుకున్న వాళ్లవుతారు. మాటే కాదు, ఏదైనా పొదుపుగా వాడితే మంచిది. అలా కాకుండా తొడలు కొడుతూ, ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటే… పోయేది తన పరువే అని గ్రీష్మ తెలుసుకునే సరికి పుణ్యకాలం మించిపోయి వుంటుంది. తస్మాత్ జాగ్రత్త గ్రీష్మ.
సొదుం రమణ