తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉన్న విశ్వసనీయతే అంతంతమాత్రం. ప్రజల్లోని విశ్వసనీయతను ఏ కొంచెం కాపాడుకున్న పార్టీ అయినా సరే.. మరీ ఘోరంగా 23 సీట్లకు పరిమితమై ఓడిపోదు. పోనీ ఓడిపోయిన తర్వాత అయినా సరే.. వారు బుద్ధి తెచ్చుకుని తమ విశ్వసనీయతను పెంచుకునే ప్రయత్నం ఏమైనా చేశారా అంటే అది కూడా లేదు. తీరా ఎన్నికల ముంగిట్లోకి వచ్చిన తర్వాత.. ఇప్పుడు నిర్వహిస్తున్న మహానాడులో వారు ప్రజలను మరింతగా భయపెట్టే మాటలు చెబుతున్నారు. స్వయంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే ఆ పార్టీని సమాధి చెయ్యడానికి గొయ్యి తవ్వినట్లుగా మాటలు చెబుతుండడం గమనార్హం.
ఇంతకూ అచ్చెన్న ఏం చెబుతున్నారంటే.. ‘తమ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందిట. సింపుల్ మెజారిటీ కానే కాదు ఏకంగా 160 సీట్లలో విజయం సాధిస్తుందిట’. మహానాడు లాంటి వేదికలు కనిపించగానే.. ఎదురుగా పచ్చ చొక్కాలు తొడుక్కున్న అమాయకపు తమ్ముళ్లు వేల సంఖ్యలో కనిపించగానే ఎవరికైనా ఆవేశం పెల్లుబికి ఇలాంటి ప్రల్లదనపు మాటలు వచ్చేస్తాయనడంలో ఆశ్చర్యం లేదు.
అలాంటి గప్పాలు ఎన్ని కొట్టుకున్నా సరే.. అది అచ్చెన్న అమాయకత్వమో, అవివేకమో అని సర్ది చెప్పుకోవచ్చు. వైసీపీకి 151 వచ్చాయి గనుక.. అంతకంటె పెద్ద ఫిగర్ చెప్పాలనుకుని 160 వద్ద ఆగారని కూడా మనం అనుకోవచ్చు. అయితే ఆ తర్వాత అచ్చెన్న చెబుతున్న మాటలే ప్రజల్ని భయపెట్టేలా ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీకి చెందిన వారి మీద ఈ ప్రభుత్వం హయాంలో నమోదు అయిన కేసులన్నీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక్క ఉత్తర్వుతో ఎత్తి పారేస్తారట. తమ పార్టీ వారి మీద ఈ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నదని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకు ఆయన అంటున్న మాట.. తమ ఏలుబడి రాగానే అందరి మీద కేసులు ఎత్తేస్తామని ప్రకటించడం.
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా సరే.. నూటికి నూరుశాతం అక్రమ కేసులుపెట్టదు. ఆకతాయి దుడుకు చర్యలకు పాల్పడిన వారిమీదనే కేసులు పెడుతుంది. అధికారం చేతులు మారితే.. అలాంటి కేసుల్లో మరీ అరాచకంగా పెట్టిన కొన్ని కేసులను రద్దు చేస్తారు. కానీ.. అచ్చెన్న మాత్రం అలాంటి సమీక్ష అవసరమేమీ లేకుండా.. సమస్త కేసులను మేం రాగానే ఎత్తేస్తాం అని అంటున్నారు.
ఈ మాటల వెనుక రెండు రకాల ప్రమాద సంకేతాలు ఉన్నాయి.
ఒకటి– తెలుగుదేశం పార్టీ ముసుగులో ఉండే గూండాలు అందరికీ ఆయన హామీ ఇస్తున్నారన్నమాట. మీరు చెలరేగిపోండి.. శాంతి భద్రతల్ని సర్వనాశనం చేసేయండి.. మీమీద ఏదైనా కేసులు వచ్చినా సరే.. మేం గెలవగానే ఆ కేసుల్ని ఎత్తేయిస్తాం అని భరోసా ఇస్తున్నారన్నమాట. అసలే అమలాపురం అల్లర్ల వెనుక తెలుగుదేశం శక్తులు ఉన్నాయనే పుకార్ల నేపథ్యంలో.. అచ్చెన్న చెబుుతన్న ఈ తరహా మాటలు ఆ పుకార్లకు బలం చేకూర్చేలా ఉన్నాయి.
రెండు– తెలుగుదేశం రౌడీలు, గూండాలు ఈ ప్రభుత్వ హయాంలో కాస్త అణకువగా ఉంటే గనుక.. ఈసారి టీడీపీ ప్రభుత్వం వస్తే గనుక.. ఈ రౌడీలందరికీ తిరిగి పగ్గాలు వదిలేస్తాం అని అచ్చెన్న చెబుతున్నారు. అంటే తమ ఏలుబడి రాగానే.. తమ రౌడీలే క్షేత్రస్థాయిలో రాజ్యం చేస్తుంటారనేది ఆయన ఇస్తున్న సంకేతం. ఇది నిజంగా ప్రజల్ని భయపెట్టే విషయం.
అచ్చెన్న మాటలను బట్టి.. నిజంగానే వాళ్ల ప్రభుత్వం వస్తే గనుక.. కేసుల బెడద కూడా లేని పచ్చ రౌడీమూకలు చెలరేగిపోతాయని, ఆ ప్రమాదం ఉన్నది గనుక.. ఆ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా ప్రజలు భావించినా ఆశ్చర్యం లేదు. అందుకే.. అచ్చెన్న మహానాడు సాక్షిగా తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టడానికి గొయ్యి తవ్వుతున్నారని అనిపిస్తోంది.