చంద్రబాబుకే వెన్నుపోటు స్కెచ్ వేసిన లోకేష్!

రాజకీయాల్లో ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వడం చాలా సహజమైన విషయం. ఒకరి పతనానికి మరొకరు శతవిధాల ప్రయత్నిస్తుండడం కూడా రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. రాజకీయాల్లో వెన్నుపోట్లు కూడా సాధారణంగానే జరుగుతుంటాయి.   …

రాజకీయాల్లో ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వడం చాలా సహజమైన విషయం. ఒకరి పతనానికి మరొకరు శతవిధాల ప్రయత్నిస్తుండడం కూడా రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. రాజకీయాల్లో వెన్నుపోట్లు కూడా సాధారణంగానే జరుగుతుంటాయి.   

నిజానికి రాజకీయాల్లో వెన్నుపోట్లు అనేవి ఎంత గొప్పగా, ప్రభావశీలంగా ఉంటాయో తెలుగుదేశం పార్టీకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. 

జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న క్రేజ్ ను పెట్టుబడిగా పెట్టి రాజకీయ పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చి.. కొన్నాళ్లకే ఒకసారి వెన్నుపోటుకు గురై.. ఆరోగ్యాన్ని కష్టాన్ని కూడా లెక్కచేయకుండా రాష్ట్రమంతా తిరిగి ప్రజాభిమానాన్ని తిరుగులేని స్థాయిలో కూడగట్టుకుని మళ్లీ అధికారంలోకి వచ్చి.. నందమూరి తారక రామారావు రాజకీయం చేస్తే.. అందులో ఉన్న కష్టనష్టాలన్నీ అనుభవిస్తే.. చాలా సింపుల్ గా ఆయనను వెన్నుపోటు పొడిచి.. ఆ పార్టీని హస్తగతం చేసుకున్న వ్యక్తి నారా చంద్రబాబునాయుడు! అందుకే రాజకీయాల్లో వెన్నుపోట్ల గురించి తెలుగుదేశం పార్టీకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మరో వెన్నుపోటు సంకేతం కనిపిస్తోంది. 

చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచే అంతటి వారు ఎవరబ్బా అని అనిపించవచ్చు గాక. మామను వెన్నుపోటు పొడిచిన ఈ నాయకుడిని.. కన్నకొడుకే వెన్నుపోటు పొడుస్తాడా అనే అభిప్రాయం, అనుమానం పలువురికి కలుగుతోంది. 

ఇందుకు ఒక సహేతుకమైన కారణం కూడా ఉంది. ఒంగోలులో జరుగుతున్న మహానాడు సాక్షిగా లోకేష్ మాటలు అలాంటి అభిప్రాయం కలిగిస్తున్నాయి. 

ఇంతకూ లోకేష్ ఏం చెబుతున్నాడో తెలుసా.. వరుసగా మూడేళ్లు ఒక పదవిలో ఉన్నవారు.. ఆ తర్వాత ఆ పదవినుంచి తప్పుకోవాలట. ఆ పద్ధతిని తనతోనే ప్రారంభిస్తాడట. అంటే మూడేళ్లు జాతీయ కార్యదర్శిగా ఉన్నాడు గనుక.. తప్పుకుని మరొకరికి అవకాశం కల్పిస్తాడట. ఇంతవరకు బాగానే ఉంది. 

ఆ రకంగా మూడుసార్లు ఒక పదవిలో ఉన్నవారు.. ఆ తర్వాత పైకి గానీ, కిందికి గానీ వెళ్లాలట. లేదా బ్రేక్ తీసుకోవాలట. కిందికి వెళ్తే అది చాలా అవమానకరకంగా ఎవరైనా భావిస్తారు. అంటే.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం తప్పుకుంటానని అంటున్న లోకేష్ పైకి వెళ్లాలని అనుకుంటున్నారన్న మాట. 

జాతీయ ప్రధాన కార్యదర్శి కంటె పైన ఉండే పదవి ఏమిటి? ‘‘జాతీయ అధ్యక్షుడు’’ మాత్రమే. అంటే నారా లోకేష్ నాయుడు గారు అర్జంటుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిపోవాలని కోరుకుంటున్నారన్నమాట. ఇది చంద్రబాబుకు వెన్నుపోటే! 

ఆ రోజుల్లో చంద్రబాబు వైస్రాయి గూడుపుఠాణి నడిపించడం ద్వారా.. మామ ఎన్టీఆర్ ను రహస్యంగా వెన్నుపోటు పొడిస్తే.. ఇవాళ కన్న కొడుకు తండ్రి చంద్రబాబును బహిరంగంగా వెన్నుపోటు పొడవడానికి, ఆయన పదవిని లాక్కోడానికి స్కెచ్ వేస్తున్నట్లుగా పలువురు అర్థం చేసుకుంటున్నారు.