గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని తక్కువ చేయడం కాదు కానీ, గ్రాడ్యుయేట్ కోటా ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ఒకటి.. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం గ్రాడ్యుయేట్ల కోటా ఎన్నికలో ఏకంగా పది వేల ఓట్లు చెల్లనివిగా తేలాయట! దాదాపు ఐదు నుంచి ఏడు శాతం ఓట్లు .. చెల్లకుండా పోయాయి!
దేశంలో ప్రస్తుతం చెల్లని ఓట్ల లెక్క లేదు. ఈవీఎంలు వచ్చాకా చెల్లని ఓట్లు లేకుండా పోయాయి. బ్యాలెట్ పేపర్ల సార్వత్రి ఎన్నికల యుగంలో చెల్లని ఓట్లు ఉండేవి. రెండు గుర్తుల మధ్యన ముద్ర ఉండటం, రెండు గుర్తులపై ఓటు వేయడం వంటి కారణాలతో అప్పట్లో చెల్లని ఓట్లు ఉండేవి.
అయితే ఈవీఎంల విషయానికి వస్తే.. మొదట ఏ గుర్తు వద్ద బటన్ ప్రెస్ చేస్తే దాన్ని మాత్రమే ఈవీఎం తీసుకుంటుంది. రెండు గుర్తుల వద్ద ప్రెస్ చేసి తమ ఓటును వ్యర్థం చేసే అవకాశాన్ని ఈవీఎంలు ఇవ్వవు. అంతా అయితే నోటా ఉంది.
అదలా ఉంటే.. గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటేసే ఎన్నికలో.. ఏకంగా పది వేల ఓట్లు చెల్లకుండా పోయాయంటే!గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా.. కనీసం ఓటేయడం రాలేదు వీళ్లకు అనుకోవాల్సి వస్తోంది! చదువుకున్న వాళ్లు అని వీరికి ఓటేసే అవకాశం ఇస్తే, తమ ఓటును ఎలా వేయాలో కూడా వీరికి తెలియలేదా! ఏ వంద మందో, రెండు వందల మందో కాదు.. ఓటేసిన వారిలో ఏడెనిమిది శాతం మందికి తమ ఓటును ఎలా వేయాలో అంతుబట్టినట్టుగా లేదు! ఇదీ మన వద్ద గ్రాడ్యుయేషన్ ను కంప్లీట్ చేసి వారి ప్రతిభ!
ఆ సంగతలా ఉంటే.. తొమ్మిది జిల్లాల పరిధి, 108 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటూ తెలుగుదేశం వాళ్లు దీర్ఘాలు తీస్తున్నారు! లోకేష్ తో సహా వీరి వాదన ఎలా ఉందంటే.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాస్త తెలుగుదేశం హవా కనిపించింది కాబట్టి.. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసేసి లోకేష్ ను సీఎంగా ప్రకటించేయాలనేంత రేంజ్ లో పచ్చ వర్గాల హడావుడి ఉంది.
మరి ఇంత ఉత్సాహం ఉంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ప్రజా వ్యతిరేక ప్రవాహంలా పారుతోందంటే.. లోకేష్ ఎలాగూ ఇప్పుడు మాజీ ఎమ్మెల్సీ అవుతున్నారు కదా, అయన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదో! లోకేష్ ఎలాగూ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతోనే గతంలో మంత్రి అయ్యాడు. కాబట్టి.. ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తాడనేందుకు ఏమీ లేదు.
ఎలాగూ కుప్పం ప్రాంతం కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసింది. కాబట్టి.. లోకేషే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే.. ఇప్పుడు నిజంగానే సత్తా చూపినట్టుగా అయ్యేది.
కింద పడినా పై చేయి తమదే అని పచ్చవర్గాలు వాదిస్తాయి. అలాంటిది ఇప్పుడు ఈ ఎన్నికలను వదులుతాయని అనుకోవడానికి ఏమీ లేదు. కానీ అసలు ఓటర్లు గ్రాడ్యుయేట్లు కాదు! వాళ్లు వేరే! బడుగుబలహీన వర్గాలు, మహిళలు, గ్రామీణులు, కార్మికులు, కర్షకులు!
గతంలో పార్టీలు ఈ విద్యాధికుల ఓటింగ్ ను పట్టించుకునేవి కావు. ఈ ఎన్నికల్లోనే ప్రధాన పార్టీలు పోటీ చేసేవీ కావు! కాబట్టి ఇలాంటి ఫలితాల గురించి చర్చ ఉండేది కాదు! తెలుగుదేశం మురిసిపోవడానికి ఈ ఎన్నికలు ఫలితాలు పనికొస్తాయేమో కానీ, అంతకు మించి ప్రయోజనం ఉండకపోవచ్చు!